ధమ్కీ ఇచ్చి భయపెట్టలేరు: సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 03 , 2026 | 08:43 PM
హైదరాబాద్‌లో చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై పలు కీలక ప్రకటనలు చేశారు.
హైదరాబాద్: చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హైదరాబాద్ అభివృద్ధి, మెట్రో విస్తరణ, మౌలిక వసతులు, పేదల సంక్షేమంపై సీఎం పలు కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వం కేవలం కొబ్బరికాయ కొట్టి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం నిధులు కేటాయించి పనులను పూర్తి చేసిందని తెలిపారు.
‘ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’
పాతబస్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలోనే చెప్పినట్లు ఇది ఓల్డ్ సిటీ కాదని.. ‘ఒరిజినల్ సిటీ’ అని అన్నారు. ఇక్కడి ప్రతి గల్లీ తనకు తెలుసని పేర్కొన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కోరిన అభివృద్ధి పనులను మంజూరు చేయాలని అధికారులను ఈ వేదికగా ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా.. కళాశాల అభివృద్ధికి రూ.20 కోట్లు కోరగా.. రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నిధులు ఇస్తుందని, అయితే ఏడాదిన్నరలోపు అభివృద్ధి పనులు పూర్తి చేసే బాధ్యత ఎమ్మెల్యేదేనని స్పష్టం చేశారు. విద్య కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ దేశానికి మద్దతుగా నిలిచి దేశభక్తిని చాటుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ సిద్ధాంతాలు వేర్వేరుగా ఉండొచ్చని.. దేశభక్తి విషయంలో మాత్రం అందరం ఒక్కటేనని పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జిని చూడాలంటే ప్రస్తుతం దుర్గం చెరువుకు వెళ్లాల్సి వస్తోందని సీఎం అన్నారు. అందుకే మీరాలం చెరువులో సుమారు 3 కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు సేవలను పూర్తి చేస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల సమయంలో మెట్రోలో ప్రయాణిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతామని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు
హైదరాబాద్ నగరంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. హిందువులు, ముస్లింలు కలిసి ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. మూసీని అభివృద్ధి చేసి నగరంలో నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని తెలిపారు. పేద ముస్లింలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్, వనస్థలిపురం, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని సీఎం అన్నారు. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ అడుగడుగునా అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని.. ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ కలిసి హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
ధమ్కీ ఇచ్చి భయపెట్టలేరు: సీఎం
ఈ క్రమంలో సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనను ఎవరూ ధమ్కీ ఇచ్చి భయపెట్టలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు, బెదిరింపులకు తాను లొంగే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. తనను ప్రేమతో మాత్రమే గెలవగలరని, ఒత్తిళ్లకు తాను తలవంచనని సీఎం పేర్కొన్నారు.
Also Read:
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి
మీడియా ముందుకు వచ్చి.. మీసం తిప్పిన కొండా మురళి!