Share News

మైనార్టీ, మెజార్టీ ప్రజలను ముందుకు తీసుకెళ్తున్న సంస్థ జమియత్: సీఎం రేవంత్

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:00 PM

మల్కాజిగిరి నుంచి బరిలో దిగినప్పుడు తనకు జమియత్ స్వచ్ఛందంగా సహకరించిందని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. తాను గల్లీ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఈ సంస్థ సహకరించిందని పేర్కొన్నారు.

మైనార్టీ, మెజార్టీ ప్రజలను ముందుకు తీసుకెళ్తున్న సంస్థ జమియత్: సీఎం రేవంత్

హైదరాబాద్, ఫిబ్రవరి 05: దేశంలో మైనార్టీలు, మెజార్టీ ప్రజలు కలిసి ముందుకు వెళ్ళడానికి జమియత్ ఉలామా-ఇ-హింద్ (Jamiat Ulama-i-Hind) సంస్థ పాటుపడుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని జ‌మియత్ ఉల‌మా ఇ హింద్ సంస్థ ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. లోకసభ ఎన్నికల్లో తాను మల్కాజిగిరి నుంచి బరిలో దిగినప్పుడు జమియత్ స్వచ్ఛందంగా తనకు సహకరించిందని గుర్తు చేసుకున్నారు. తాను గల్లీ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఈ సంస్థ సహకరించిందని పేర్కొన్నారు. తద్వారా హిందువులతోపాటు ముస్లింలు తనను గెలిపించి పార్లమెంట్‌కి పంపారని ఆయన వివరించారు.


ఈ నేపథ్యంలో లోక్‌సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తోడుగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై తాను పోరాటం చేశానని చెప్పారు. మైనార్టీల అండతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక మంది మైనార్టీ నేతలకు అవకాశం ఇచ్చిందని సీఎం రేవంత్ సోదాహరణగా వివరించారు.

సల్మాన్ ఖుర్షీద్, హమ్మద్ పటేల్ తదితర నేతలు కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకులయ్యారని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో అజారుద్దీన్, షబీర్ అలీ లాంటి వాళ్లకు ఎంఎల్‌ఏ టికెట్‌లు సైతం ఇచ్చామని తెలిపారు. అవకాశం ఉన్న చోట్ల మైనార్టీ నేతలకు అవకాశం ఇచ్చామన్నారు. అలాగే 8 కార్పొరేషన్ల చైర్మన్లుగా మైనార్టీలను నియమించామని గుర్తు చేశారు.


అజారుద్దీన్‌ ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేశామన్నారు. పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఆయనను గెలిపించుకునే బాధ్యత మీదేనంటూ వారికి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకు రానున్నట్లు ప్రకటించారు. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.


దేశం అభివృద్ధి చెందాలంటే అంతా కలిసి మెలిసి ముందుకు సాగాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యమన్నారు. ఏ ఒక్కరి వల్ల దేశం అభివృద్ధి చెందదని తెలిపారు. ఒక్కరే పదవిలో ఎల్లకాలం ఉండలేరన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కలిపించారని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్నారు. కులగణన చేసినప్పుడు రాష్ట్రంలో మైనార్టీ జనాభా కూడా లెక్కించామని వివరించారు.


సుప్రీంకోర్టులో నాలుగు శాతం రిజర్వేషన్ల కేసు విచారణకు వచ్చినప్పుడు మైనార్టీ జనాభా లెక్కలను అందిస్తామని వారికి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు.

విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ మైనార్టీలకు ఈ సందర్భంగా సూచించారు. మైనార్టీలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారని విమర్శించారు. అమిత్ షాకు దమ్ముంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని తాను సవాల్ విసిరానని చెప్పారు. ఒక పార్టీ అవయవ దానం చేయడం వల్ల బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు పోలీసులు నోటీసులు

సీఎం రేవంత్ భాష, అరాచకాలపై మేధావులు స్పందించాలి: హరీశ్ రావు

For More TG News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 10:12 PM