సీఎం రేవంత్ భాష, అరాచకాలపై మేధావులు స్పందించాలి: హరీశ్ రావు
ABN , Publish Date - Feb 05 , 2026 | 07:58 PM
మహబూబ్‌నగర్ ఎంపీ సీటును బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి బహుమానంగా ఇచ్చారని హరీశ్ రావు ఆరోపించారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదన్నారు. పగ ప్రతీకారాలు తప్ప పాలన మీద దృష్టి లేదంటూ సీఎం రేవంత్ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 05: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికృత మాటలకు సభ్య సమాజం ఛీ కొడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను జాతిపిత అన్నందుకు రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వరుస విమర్శలపై మాజీ మంత్రి హరీశ్ రావు గురువారం కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ను జాతిపితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కడుపునొప్పి అని ప్రశ్నించారు. బూతుల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడన్నారు. పాలన చేతకాక సీఎం రేవంత్ రెడ్డి నిరాశ నిస్పృహలో ఉన్నారని చెప్పారు. నీతి లేకుండా జాతి అని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ వైఖరిని ఎండగట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి భాష, అరాచకాలపై స్పందించాలంటూ తెలంగాణ మేధావులకు ఈ సందర్భంగా హరీశ్ రావు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి అదుపు తప్పి ఎలా మాట్లాడుతున్నారో గమనించాలంటూ కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. ఏడేళ్లలో ఎస్ఎల్‌బిసి టన్నెల్‌ను 11 కిలో కిలోమీటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తవ్వామని.. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద మీటర్లు కూడా తవ్వలేదని విమర్శించారు. ఎస్ఎల్‌బిసి టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో శవాలు బయటకు తీసుకురాలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే అమరవీరుల ఆత్మ ఘోషిస్తుందన్నారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ఇచ్చారని.. అదే వేదికపై రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారని తెలిపారు. ప్రతిసారీ డైవర్షన్ చేయాలనుకుంటే ప్రజలే రేవంత్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి డైవర్షన్ చేస్తారని చెప్పారు. ప్రతి నెలకో కుంభకోణానికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు హరీష్ రావు. గ్యారెంటీలు నిల్.. స్కామ్‌లు ఫుల్ అంటూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన కుర్చీని కాపాడుకోవటానికి బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
మహబూబ్‌నగర్ ఎంపీ సీటును బీజేపీకి రేవంత్ రెడ్డి బహుమానంగా ఇచ్చారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదన్నారు. పగ ప్రతీకారాలు తప్ప పాలన మీద దృష్టి లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. రూ. 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఎక్కడ ఇచ్చావో ప్రెస్ క్లబ్‌లో చర్చ పెడదామా? అంటూ సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్ విసిరారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి వచ్చిన తర్వాత అయినా మారాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా హరీశ్ రావు హితవు పలికారు. రేవంత్ రెడ్డి మారతారన్న నమ్మకం తనకు లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.