Share News

మహిళల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సీఎం రేవంత్

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:21 PM

మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలను శక్తితో పోలుస్తామని.. కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతో పోలుస్తామని సీఎం తెలిపారు.

మహిళల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, మార్చి 7: మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). శనివారం జేఎన్‌టీయూలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘స్టాండ్ విత్ హర్’ బ్రోచర్‌‌ను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు. మహిళా నాయకత్వం నుంచి వచ్చిన పార్టీ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.


మహిళల పట్ల బాధ్యతల్ని నెరవేర్చాలి

మహిళలను శక్తితో పోలుస్తామని.. కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతో పోలుస్తామని సీఎం తెలిపారు. మహిళలకు వేధింపులు.. పట్టణాలు, కాలేజీలు, పబ్లిక్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని.. సోషల్ మీడియాలో మహిళలు ఎక్కువగా వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ‘మనల్ని మనం సవరించుకొని మహిళల పట్ల మన బాధ్యతల్ని నెరవేర్చాలి’ అని సీఎం సూచించారు.

revant-jntu.jpg


మహిళలకు ఆర్థిక స్వావలంబన..

మహిళల రక్షణ కోసం చట్టాలు చేస్తే బాధ్యత తీరిపోయిందని అనుకోవడం తప్పని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల కేటాయింపులు, రేషన్ కార్డులు అన్నీ మహిళల పేర్లమీద ఇస్తోందన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకు అమ్మే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఈ నిర్ణయంతో మహిళలు అదానీ, అంబానీల స్థాయిలో విద్యుత్ రంగంలో పోటీ పడే అవకాశం ఇచ్చామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తోందని సీఎం రేవంత్ వెల్లడించారు.


మహిళల శక్తిపై సంపూర్ణ విశ్వాసం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారి స్వేచ్ఛ పెరిగిందని సీఎం తెలిపారు. జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు కేటాయించి మహిళల చేతుల్లో పెట్రోల్ బంకులు నిర్వహించే అవకాశాలు ఇచ్చామన్నారు. దేశంలోనే తొలిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ సహా కీలక అధికార పదవుల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదే అని అన్నారు. మహిళల శక్తి, నైపుణ్యంపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

revant-jntu1.jpg


సైబర్ నేరాలపై కఠిన చర్యలు

మహిళల రక్షణను సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బలపడుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు ధైర్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడైనా మహిళలపై వేధింపులు జరిగితే నిలబడి ప్రశ్నించే ధైర్యం సమాజంలో రావాలన్నారు. కాలేజీలు, బస్టాండ్లు సహా ఎక్కడైనా జరిగే వేధింపులను చూసీ చూడనట్టు ఉండడం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అని అన్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలపై సైబర్ వేధింపులు పెరుగుతున్నాయని తెలిపారు. మహిళలపై మార్ఫింగ్, ఫేక్ వీడియోలు వంటి సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

చెప్పులు వేసుకొచ్చారంటూ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దారుణం

దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 07 , 2026 | 01:39 PM