బీఆర్ఎస్ చేసిన అప్పుల భారాన్ని ఇంకా మోస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:20 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి రూ.600 కోట్లు బకాయిలు పెట్టి వెళ్తే తాము ప్రతినెలా రూ.89 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రూ.2,408 కోట్ల బిల్లులు చెల్లించామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి రూ.600 కోట్లు బకాయిలు పెట్టి వెళ్తే తాము ప్రతినెలా రూ.89 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రూ.2,408 కోట్ల బిల్లులు చెల్లించామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. ఏడో రోజైన నేడు(గురువారం) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వాస్పత్రులకు రూ.927 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించామని చెప్పుకొచ్చారు. 27 నెలల్లో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు చెల్లించామని ఆయన వివరించారు.
పేదలకు అన్యాయం జరుగుతోందని విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని.. బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసంటూ విమర్శించారు. ఎవరి పీఏలు సీఎం రిలీఫ్ ఫండ్ కాజేశారో కూడా తెలుసంటూ చురకలు అంటించారు రేవంత్. గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ నిధులను కొందరు తమ సొంత ఖాతాల్లో వేసుకున్నారని, దీనిపై విచారణ జరుగుతోందన్నారు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక 27 నెలల్లో రూ.2,046 కోట్ల సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అప్పుల భారాన్ని తమకు వారసత్వంగా ఇచ్చిందని, ఆ బకాయిలను తామే చెల్లిస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.52 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నెలకి రూ.89 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆరోగ్య శ్రీ ఇవ్వకపోవడం వల్ల చికిత్స చేయట్లేదు అనేది అపోహ మాత్రమే అన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. విద్యా, వైద్యం విషయంలో కోతలు ఉండవని సీఎం రేవంత్ మరోసారి తేల్చి చెప్పారు. కోతలు పెట్టాల్సి వస్తే వేరే కోతలు పెడతామని అన్నారు. టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్-1 అధికారులకు అప్పగిస్తామని, ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం తీసుకువస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన