కాలేజీ అమ్మాయిలకుఉచిత ఈవీ స్కూటీలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:03 AM
కాలేజీ విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్ (ఈవీ) స్కూటీలు అందించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట.. ఆర్థికంగా శక్తిమంతులను చేస్తున్నాం
మహిళా శక్తితోనే ట్రిలియన్ డాలర్ల తెలంగాణ
హైదరాబాద్ కాలుష్య రహిత నగరం కావాలి
మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దు
13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం
జర్నలిస్టులకు ఫ్యూచర్‌సిటీలో మోడల్ కాలనీ
ఇళ్ల స్థలాలపై త్వరలోనే తీపి కబురు చెబుతాం
ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజాభవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కాలేజీ విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్ (ఈవీ) స్కూటీలు అందించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఆ వాహనాలకు జీరో ట్యాక్స్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న 2500 ఆర్టీసీ డీజిల్ బస్సులను డిసెంబరులోపు జిల్లాలకు తరలించి, వాటి స్థానంలో పూర్తి స్థాయిలో ఈవీ బస్సులను ప్రవేశపెడతామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సన్మానించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఏటా మహిళా దినోత్సవం నాడు కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. వేలాది మంది ఆడబిడ్డలను పిలిచి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నామని తెలిపారు. ‘‘200 బిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 8 ఏళ్లలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడం కోసం పనిచేస్తున్నాం. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించాం. కోటి 30 లక్షల జనాభా ఉన్న క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్‌గా మారుస్తాం. సౌత్ కొరియా, న్యూయార్క్, టోక్యోతో హైదరాబాద్ పోటీపడేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మహిళలే రాష్ట్రానికి వెన్నెముక’’ అని సీఎం అన్నారు.

మహిళలకు అత్యున్నత పదవులు..
దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులుగా మహిళలకు అన్ని అత్యున్నత పదవులు ఇచ్చింది కాంగ్రె స్సేనని సీఎం రేవంత్ అన్నారు. ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో కలెక్టర్లు, ఎస్పీలుగా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మహిళా అధికారులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ముఖ్యమైన శాఖలకు మహిళలు బాధ్యత వహిస్తున్నారని, హైదరాబాద్ లాంటి కీలక జిల్లాకు కలెక్టర్‌గా మహిళ ఉన్నారని తెలిపారు. ఎస్‌ఐబీలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారి చొరవతో 700 మంది మావోయిస్టులు లొంగిపోవడం మహిళల కార్యదీక్షకు నిదర్శనమని కొనియాడారు. మహిళలను తాము కేవలం లబ్ధిదారులుగా చూడటం లేదని, వారిని ఆర్థికంగా శక్తివంతులను చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా.. 1000 బస్సులకు మహిళలను యజమానులను చేసి కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా చేశామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల యజమానులుగా మారుస్తున్నామని వెల్లడించారు.
కాలుష్య రహిత నగరం కావాలి..
‘దేశ రాజధాని ఢిల్లీ.. వాయు కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతోంది. ముంబై కూడా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతోంది. చెన్నైలో వరదల సమస్య ఉంది. దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌ను తీర్చిదిద్దారు. రెడ్, ఆరెంజ్ క్యాటగిరీ పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పంపిస్తాం’ అని సీఎం రేవంత్ అన్నారు. అంతర్జాతీయ స్థాయికి నగరాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ఇప్పుడు ఆరెం జ్ క్యాటగిరీలో ఉందని, ఇలాగే వదిలేస్తే.. రెడ్ జోన్‌లోకి వెళుతోందని పేర్కొన్నారు. మూసీ రివర్ ప్రంట్ ప్రాజెక్టుపై విపక్షాల తీరును సీఎం తప్పుబట్టారు. అహ్మదాబాద్‌లో సబర్మతి, ఢిల్లీలో యమునా, యూపీలో గంగానది రివర్ ఫ్రంట్లు కట్టినప్పుడు లేని అభ్యంతరం హైదరాబాద్‌లో ఎందుకు? అని ప్రశ్నించారు. అహ్మదాబాద్‌లో 10 వేల కుటుంబాలను తరలించి సరైన సౌకర్యాలు కల్పించలేదని, నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ తరువాత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 50 మీటర్ల లోపుల కట్టడాలపై నిషేధం ఉందని, అందుకే వాళ్లను పిలిచి మాట్లాడి చెప్పామని అన్నారు. వాళ్లకు 7 ఎకరాల భూమి ఇచ్చి.. అందులో అపార్ట్‌మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బును డిపాజిట్ చేస్తామన్నామని చెప్పారు. కానీ, దీనికి రాజకీయ రంగు పూసి.. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపుతున్నాయని విమర్శించారు. సానుభూతికి సమస్య పరిష్కారం కాదన్నారు. నగరాన్ని కాపాడుకోవడానికి అందరి సహకారం కావాలని, దీనిపై ఈ నెల 13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై త్వరలో నిర్ణయం
తన ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు శ్రేయోభిలాషులుగా ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ‘జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై త్వరలోనే మంచి వార్త చెబుతాం. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టుల కోసం ఒక అద్భుతమైన కాలనీని డిజైన్ చేస్తాం’ అని సీఎం ప్రకటించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తామన్నారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు చేసే పనులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘గతంలో ప్రగతి భవన్‌లోకి మహిళా జర్నలిస్టులు ఎంత మంది వచ్చారు? ఇప్పుడు అంతా వస్తున్నారు. ఇది ప్రజా వేదిక’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.