ధాన్యం కొనుగోలు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి..
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:32 AM
కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర పౌరసరఫరాల శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై చర్చించారు.
ఢిల్లీ: కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Union Minister Pralhad Joshi)తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర పౌరసరఫరాల శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. 2025-26 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ ధ్యానం సేకరించాలని కేంద్రమంత్రికి రేవంత్, ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. అలాగే 2025-26 యాసంగి పంట 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ధాన్యం మెుత్తం కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగానికి అండగా నిలవాలని కోరారు.
కేంద్ర మంత్రితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..'దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పాడి ధాన్యం ఉత్పత్తి జరుగుతోంది. ఈ రబీ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాం. వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసిన 48 గంటల్లోనే మద్దతు ధర డబ్బులు వారి ఖాతాల్లో వేస్తున్నాం. ఈ రబీ సీజన్‌లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాం. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1,400 కోట్లు రావాల్సి ఉంది. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆ నిధులను విడుదల చేయాలని కోరాం. కేంద్రం పోషకాహార పంపిణీ పథకాన్ని రద్దు చేసింది. ఇది సరైన విధానం కాదు' అని తెలిపారు.
కాగా, ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా సాగుతోంది. డీలిమిటేషన్‌పై హైబ్రిడ్ మోడల్‌కు మద్దతు కూడగట్టేందుకు ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల వాదనను జాతీయస్థాయిలో వినిపించేందుకు కృషి చేస్తున్నారు. ప్రోరేటాకు వ్యతిరేకంగా దక్షిణాది ముఖ్యమంత్రులను రేవంత్ సమన్వయం చేస్తున్నారు. అదే సమయంలో పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, పథకాలపై చర్చిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
శాస్త్రిపురం ఆర్‌వోబీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
పెట్టుబడుల పేరిట భారీ స్కామ్.. కోట్లు వసూలు చేసి ఆపై..