Share News

సింగరేణిపై కేంద్రం గురి

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:52 AM

సింగరేణిలో డైరెక్టర్ల సంఖ్యను పెంచుకుని సంస్థపై పట్టు సాధించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందా? నైనీ కోల్‌బ్లాక్‌ టెండర్లు వంటి వివాదాలు, సంస్థ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుండటం నేపథ్యంలో ఈ దిశగా చర్యలు చేపడుతోందా?..

సింగరేణిపై కేంద్రం గురి
Singareni Issue

  • తమ తరఫున ఉండే డైరెక్టర్ల సంఖ్యను పెంచుకునేందుకు సన్నాహాలు?

  • తద్వారా సంస్థపై నిర్ణయాధికారం

  • సింగరేణి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, గనుల టెండర్ల వివాదాలతోనే ఫోకస్‌

  • నేడు, రేపు కోల్‌ బెల్ట్‌ ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

  • నైనీ టెండర్ల వ్యవహారంపై సింగరేణిలో కేంద్ర కమిటీ ఆరా

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో డైరెక్టర్ల సంఖ్యను పెంచుకుని సంస్థపై పట్టు సాధించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందా? నైనీ కోల్‌బ్లాక్‌ టెండర్లు వంటి వివాదాలు, సంస్థ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుండటం నేపథ్యంలో ఈ దిశగా చర్యలు చేపడుతోందా?.. ప్రస్తుత పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వానికి 51.1 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 48.9 శాతం వాటాలు ఉన్నాయి. సంస్థలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పాలక మండలి పాత్రే కీలకం. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉండటంతో పాలక మండలిలో రాష్ట్రానికి చెందిన డైరెక్టర్ల సంఖ్య ఎక్కువ. దీనితో దాదాపుగా నిర్ణయాధికారం మొత్తం రాష్ట్రం చేతిలోనే ఉంది. కేంద్రం తరఫున ఉన్న డైరెక్టర్లు ఏవైనా నిర్ణయాలతో విభేదించినా.. వారి సంఖ్య తక్కువ కాబట్టి రాష్ట్ర నిర్ణయమే చెల్లుబాటు అవుతోంది. అయితే ఓబుళాపురం మైనింగ్‌ కుంభకోణం తర్వాత దేశవ్యాప్తంగా బొగ్గు, ఇతర కీలక ఖనిజాలపై కేంద్రం అజమాయిషీ పెరిగింది. ఇలాంటి సమయంలో నైనీ బొగ్గు బ్లాకు వివాదంతో సింగరేణిపై దృష్టిపెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సింగరేణిలో తొలిసారిగా పర్యటించనుండటం గమనార్హం. ప్రస్తుతం సింగరేణి పాలక మండలిలో సీఎండీ డి.కృష్ణభాస్కర్‌తో కలిపి రాష్ట్రం తరఫున ఆరుగురు ఉండగా, కేంద్రం నుంచి ముగ్గురు ఉన్నారు.


నేడు, రేపు కోల్‌బెల్ట్‌లో కిషన్‌రెడ్డి పర్యటన

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన శనివారం (24వ తేదీ) సాయంత్రం కొత్తగూడెం చేరుకొని సింగరేణి గెస్ట్‌హౌ్‌సలో సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులతో సమీక్షిస్తారు. రాత్రి 8 గంటలకు సంస్థ భాగస్వాములతో సమావేశం అవుతారు. ఆదివారం (25న) ఉదయం 7:30 గంటలకు సింగరేణి కార్మికులతో కలిసి కొత్తగూడెం పద్మావతిఖని గనిని సందర్శిస్తారు. ఉదయం 9 గంటలకు కార్మికులతో కలిసి అల్పాహారం తీసుకుని, వారితో మాట్లాడుతారు.


సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ నిబంధన ఎందుకు?

ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాకు వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చేతనా శుక్లా, డైరెక్టర్‌ మారపల్లి వెంకటేశ్వర్లుతో నియమించిన కమిటీ పరిశీలనను ముమ్మరం చేసింది. గురువారం సాయంత్రం, శుక్రవారం పొద్దంతా సింగరేణి భవన్‌లో అధికారులతో సమావేశాలు నిర్వహించింది. ‘నైనీ కోల్‌బ్లాక్‌ టెండర్‌కు సంబంధించి సైట్‌ విజిట్‌ నిబంధన ఎందుకు పెట్టారు? మైన్‌ డెవలపర్‌, ఆపరేటర్‌ (ఎండీవో) కోసం ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకు ఎందుకు సర్టిఫికెట్లు జారీ చేయలేద’ని ఆరా తీసింది. అయితే నైనీ బ్లాక్‌కు రోడ్డు సౌకర్యం లేదని, ఓవర్‌ బర్డెన్‌ తరలించాలన్నా, తీసిన బొగ్గును రవాణా చేయాలన్నా.. రోడ్డు వెంట ఉన్న వన సంరక్షణ సమితులతో ప్రతిబంధకాలు ఉన్నాయని అధికారులు వివరించనట్టు తెలిసింది. టెండర్లు వేసే సంస్థలు అన్ని వివరాలు తెలుసుకోవాలనే ఈ నిబంధన పెట్టినట్టుగా వెల్లడించినట్టు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

గుజ్జర్‌ గేదె @ రూ. 3.11 లక్షలు

డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలు

Updated Date - Jan 24 , 2026 | 08:56 AM