సీఐడీ ముందుకు పాడి కౌశిక్ రెడ్డి.. విచారణ ప్రారంభం
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:14 PM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేను సీఐడీ డీఎస్పీ రంగస్వామి విచారిస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 4: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈరోజు(శనివారం) హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయన సతీమణికి కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే భార్య కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేను సీఐడీ డీఎస్పీ రంగస్వామి విచారిస్తున్నారు. జనవరి 29న సమక్క - సారలమ్మ జాతర సందర్భంగా హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయగా.. విచారణకు రావాల్సిందిగా కౌశిక్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన సీఐడీ ముందు విచారణకు వచ్చారు.
అందుకే విచారణకు వచ్చా: పాడి కౌశిక్ రెడ్డి
సీఐడీ కార్యాలయం వద్ద పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నా నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ నిర్మాణంపై ఇవాళ నిరసన చేపడతామని అనుకున్నాను. నన్ను హుజురాబాద్ వెళ్లనివ్వకుండా నోటీసులు ఇచ్చి కావాలనే విచారణకు పిలిచారు. నాతో పాటు నా సతీమణికి సీఐడీ అధికారులు ఎందుకు నోటీసులు ఇచ్చారో అర్థం కావడం లేదు. సీఐడీ నోటీసులు ఇవ్వాల్సి వస్తే 108 సార్లు ఫైరింగ్ జరిపిన కరీంనగర్ సీపీకి ఇవ్వాలి. చట్టాన్ని గౌరవించాలి కాబట్టి నేను సీఐడీ విచారణకు హాజరయ్యాను’ అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
జహూర్ ఇక్బాల్ గ్యాంగ్ ఘాతుకం.. యువకుడి కిడ్నాప్.. కర్రలతో దాడి
క్యాతనపల్లి ఎన్నిక సజావుగా జరిగేలా చూడండి: బాల్క సుమన్
Read Latest Telangana News And Telugu News