Share News

ఎర్రవల్లిలో పసుపు నీళ్లతో శుద్ధి

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:35 AM

(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు ముట్టడించడంపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎర్రవల్లిలో పసుపు నీళ్లతో శుద్ధి
BRS shuddhi

  • కాంగ్రెస్ కార్యకర్తల రాకతో ఎర్రవల్లి అపవిత్రం అయిందంటూ రోడ్లు శుద్ధి చేసిన బీఆర్ఎష్ నేతలు

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

  • బీఆర్ఎస్ ‘శుద్ధీకరణ’పై కాంగ్రెస్ ఆగ్రహం

  • అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనని విమర్శ

మర్కుక్‌/హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు ముట్టడించడంపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన చావును కోరుతూ నిరసనలకు దిగడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల రాకతో ఎర్రవల్లి ప్రాంతం అపవిత్రమైందంటూ బుధవారం రోడ్లపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఎర్రవల్లితో పాటు శివారు వెంకటాపూర్‌, భవానందాపూర్‌ గ్రామాల్లోనూ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన పోరాటాన్ని ఎవరూ విస్మరించలేరన్నారు. రాజకీయ విభేదాలున్నా తెలంగాణ ఉద్యమ నాయకుడి పట్ల కనీస గౌరవం, సంస్కారం పాటించాలని కాంగ్రెస్‌ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ భాగ్య బాలరాజు, మండల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


బీఆర్‌ఎస్‌ చర్యపై కాంగ్రెస్‌ ఆగ్రహం

బీఆర్‌ఎస్‌ పసుపునీళ్లతో ఎర్రవల్లిలో రోడ్లను శుద్ధి చేయడంపై కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం నాయకులు వెళ్లొచ్చిన తర్వాత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద పసుపు నీళ్లతో శుద్ధిచేయడం అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పేరుమాండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. బీఆర్‌ఎ్‌సలోని దళిత నాయకులు రాజయ్య, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఈ చర్యను ఖండించి దళితుల ఆత్మగౌరవం కోసం నిలబడాలన్నారు. శుద్ధీకరణ బాధ్యులతో పాటు దాన్ని ప్రోత్సహించిన కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కార్యాలయాలు, నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం వరదరాజపూర్‌లో దళితులను అవమానించేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నేతలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం ఫిర్యాదు చేశారు. దళిత స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి బాధ్యత వహించి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారంనాడు దళిత నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తన ఫిర్యాదులో పేరొన్నారు. ఇందులోభాగంగా వరదరాజపూర్‌లోనూ దళిత నాయకులు దండోరా కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారన్నారు. దళిత నాయకులు నిరసన తెలిపిన ప్రదేశాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు పాలు, పసుపు నీళ్లతో శుద్ధి చేశారని, దీనికి సంబంధించిన వార్తలూ మీడియాలో వచ్చాయని పేర్కొన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన నాయకులను గుర్తించి వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్టేషన్‌ ఆఫీసర్‌ను కోరారు. అనంతరం మీడియాతో మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేసీఆర్‌ ఆదేశం మేరకే బీఆర్‌ఎస్‌ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ కుల వివక్షేనన్నారు. ఇదిలా ఉండగా, దళితుల పట్ల బీఆర్‌ఎస్‌ వ్యవహార శైలిని ఎండగట్టేందుకు టీపీసీసీ రాష్ట్రస్థాయి నాయకులతో అన్ని జిల్లాల్లోనూ మీడియా సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులకు జిల్లాలను కేటాయిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. దళితుల పట్ల బీఆర్‌ఎస్‌ వ్యవహార శైలితో పాటు దళిత స్పీకర్‌ను వారు అవమానించిన తీరునూ మీడియా సమావేశాల్లో వీరు వివరించనున్నట్లు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పాలుపంచుకున్న వేదికను బీజేపీ నేతలు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద దళిత నాయకులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు శుద్ధీకరించడా న్ని వివరించనున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫాంహౌస్‌లోనే కుట్ర
తక్షణమే పీఆర్సీ నివేదిక

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 04:35 AM