BJP Leader Ramachandar Rao: కాంగ్రెస్‌కు అవినీతి కావాలి.. మోదీకి అభివృద్ధి కావాలి: రాంచందర్ రావు
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:42 PM
కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన 'వీబీ జీ రామ్ జీ' ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని.. అది కాంగ్రెస్‌కు నచ్చడం లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్, జనవరి 11: నగరంలో నిర్వహించిన 'వీబీ జీ రామ్ జీ(వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ)' రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పాల్గొన్నారు. 'వీబీ జీ రామ్ జీ' అనేది మన స్వప్నమని.. వికసిత్ భారత్ మన లక్ష్యం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మోదీ రాకతో దేశం ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించిందని రాంచందర్ రావు చెప్పుకొచ్చారు.
'కాంగ్రెస్ హయాంలో దేశం ఆర్థికంగా 11 స్థానంలో ఉండేది. మోదీ వచ్చాక ఆర్థికంగా 4వ స్థానంలోకి వచ్చాం. త్వరలో మొదటి స్థానంలోకి వస్తాం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆ సంస్కరణల్లో భాగమే వీబీ జీ రామ్ జీ. గ్రామీణ ప్రాంతంలో ఖర్చుచేస్తున్న నిధులు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లక్ష కోట్ల రూపాయలు కేటాయించింది. మోదీ వచ్చాక రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, బెంగాల్‌లలో పెద్దఎత్తున అవినీతి జరిగింది. దానిని అరికట్టేందుకే ఈ మార్పు. పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకే ఈ కొత్త చట్టం. రాష్ట్రాలు భాగస్వామ్యం వహించినప్పుడే బాధ్యత పెరుగుతుంది' అని రాంచందర్ రావు అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై రాంచందర్ రావు విమర్శలు గుప్పించారు. 'కాంగ్రెస్‌కు అవినీతి కావాలి. అవినీతి చేసేందుకే కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. రేవంత్ రెడ్డి.. మీరు అడగాల్సింది మోదీని కాదు, రాహుల్‌ను. బీజేపీ తీసుకొచ్చే ప్రతి పథకాన్నీ వ్యతిరేకించడం రాహుల్ గాంధీకి పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి 40 శాతం కేటాయిస్తే తప్పేంటి?. కాంగ్రెస్‌కు నిజంగా సిగ్గుంటే రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టుకు మహాత్మాగాంధీ పేరు పెట్టండి. మోదీకి మంచిపేరు వస్తుందన్న ఉద్దేశంతోనే వ్యతిరేకిస్తున్నారు. గ్రామగ్రామాన తిరిగి కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మోదీ లేకుంటే ప్రజలకు ఉచిత బియ్యం, జాతీయ రోడ్లు వచ్చేవా?. యూనివర్సిటీల భూములు, ఇండస్ట్రియల్ భూములను లాగేసుకుంటున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రజాధనాన్ని దోచుకున్నాయి. వీబీ జీ రామ్ జీ పథకం రెండు విధాలుగా ప్రజలకు మేలు కలిగిస్తుంది. దానికి 40 శాతం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మోదీకి కాదు.. ప్రజలకు. కిందిస్థాయికి తీసుకెళ్లే బాధ్యత మనదే' అని రాంచందర్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాంచందర్ రావుతో పాటు బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్ ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే అరెస్ట్..
గ్రోక్ అసభ్య కంటెంట్ ఎఫెక్ట్.. 600 అకౌంట్లు డిలీట్..