Share News

యూనిటీ మాల్‌ ఒప్పందంపై విచారణ జరగాలి: ఎంపీ రఘునందన్ రావు..

ABN , Publish Date - Aug 13 , 2026 | 04:23 PM

తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్‌ దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు.

యూనిటీ మాల్‌ ఒప్పందంపై విచారణ జరగాలి: ఎంపీ రఘునందన్ రావు..
BJP MP Raghunandan Rao

ఢిల్లీ: తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్‌ దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఇరువైపులా ఉన్నటువంటివని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనిటీ మాల్‌ పేరుతో జరిగిన ఒప్పందంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ డిమాండ్ చేశారు.


కేంద్రం ఇచ్చిన రూ.202 కోట్లతో యూనిటీ మాల్‌ నిర్మించాలని నిర్ణయించారని ఎంపీ రఘునందర్ రావు అన్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆరు ఎకరాలకు పైగా భూమి ఇచ్చిందన్నారు. అయితే, ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరగాలని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్‌ తప్పు చేస్తే విచారణ జరిగినప్పుడు, కాంగ్రెస్‌ తప్పు చేస్తే విచారణ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. 2018లో బీఆర్‌ఎస్‌ హయాంలో 10 ఎకరాల భూమిని ప్రైవేట్‌ సంస్థకు కేటాయించారని, దానిపైనా విచారణ జరగాలన్నారు. ఈ రెండు భూకేటాయింపు ఒప్పందాలపై సమదృష్టితో దర్యాప్తు జరపాలని రఘునందన్ డిమాండ్ చేశారు.


యూనిటీ మాల్‌, గత బీఆర్‌ఎస్‌ భూకేటాయింపులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ కోరుతూ కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎంపీ చెప్పుకొచ్చారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుపై డీపీఆర్‌ నుంచి చివరి చెల్లింపు వరకు సీబీఐ విచారణ జరపాలన్నారు. కేవలం మూడు బ్యారేజీలపై కాకుండా మొత్తం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయాలన్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని ఎంపీ సూచించారు. దానిపై కేంద్ర హోంమంత్రిని కలిసి దర్యాప్తు జరిగేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు, రింగ్‌ రోడ్డు, ఫార్ములా-ఈ రేస్‌, కాళేశ్వరం అంశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట మార్చిందని ఎంపీ మండిపడ్డారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని రఘునందన్ రావు విమర్శించారు. వీళ్లిద్దరూ అవినీతిలో అన్నదమ్ములంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రావాలని ప్రజలకు బీజేపీ విజ్ఞప్తి చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో భూముల విలువ ఎకరాకు వందల కోట్లకు చేరిందని, ప్రజల ఆస్తులను విక్రయించే హక్కు ప్రభుత్వాలకు లేదని ఎంపీ తేల్చి చెప్పారు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు కస్టోడియన్లుగా ఉండాలని, అంతేకానీ యజమానులుగా వ్యవహరించొద్దని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అభివృద్ధి కోసమే సీఎంకు మద్దతిచ్చా.. పోచారం మరోసారి హాట్ కామెంట్స్

వరంగల్ జిల్లా శాయంపేట మెగా టెక్స్‌టైల్ పార్కులో విషాదం..

Updated Date - Aug 13 , 2026 | 04:28 PM