Share News

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ..

ABN , Publish Date - May 03 , 2026 | 10:03 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి బహిరంగ లేఖ రాశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ లేఖ రాస్తే ఎదురుదాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ..
Bandi Sanjay Letter

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి బహిరంగ లేఖ రాశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ లేఖ రాస్తే ఎదురుదాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మరో లేఖ రాశారు.


లేఖలో ప్రస్తావించిన అంశాలు..

'కళ్లుండి చూడలేని కబోది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అబద్ధాలు, అవగాహనా రాహిత్యంలో ఆస్కార్‌కు తుమ్మల అర్హులు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) చట్టం తెస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్సే. సొంత పార్టీ మేనిఫెస్టోలో ఏం రాశారో కూడా తెలుసుకోలేని అసమర్థుడు మంత్రి తుమ్మల. ఎమ్మెస్పీ నిర్ణయాధికారం కేంద్రానిదే.. అమలు చేసే బాధ్యత రాష్ట్రాలదే అని తెలియకుండా మాట్లాడతారా?. దాదాపు 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదని మీరే ఒప్పుకున్నారు కదా?. నరం లేని నాలుక ఏది మాట్లాడినా చెల్లుతుందని మాట్లాడుతోంది తుమ్మల నాగేశ్వరరావే. ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని బీజేపీయేతర రాష్ట్రాల్లో అమలు చేయడం లేదా?.


ఫసల్ బీమా పనికి రానిదైతే రెండున్నరేళ్లు కావొస్తున్నా ప్రత్యామ్నాయ పంటల బీమా పథకం ఎందుకు తీసుకురాలేకపోయారు?. కొత్త పథకం తీసుకురాకుండా, ఫసల్ బీమా అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతోంది మీరు కాదా?. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతున్న తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పడం పచ్చి అబద్ధం. కాంగ్రెస్ పాలనలో ఎస్డీఆర్ఎఫ్ పేరిట ఏటా కేంద్రం తెలంగాణకు రూ.400 కోట్లు ఇస్తోంది. ఆ డబ్బును ఏం చేస్తున్నారో లెక్కలు చెప్పగలరా?. 5 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోతే ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.5 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.250 కోట్లు చెల్లించి చేతులు దులుపుకుంది నిజం కాదా?.


రాష్ట్రంలో ఎరువుల సరఫరా కూడా సక్రమంగా పంపిణీ చేయలేని అసమర్థ మంత్రి తుమ్మల. ఖమ్మం గడప దాటి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధలను కళ్లారా చూడాలనే ఆలోచన లేని మంత్రికి రైతుల బాధలు ఏం తెలుస్తాయి?. రాష్ట్రంలో 25 శాతం వడ్లను మాత్రమే కేంద్రం కొంటోందని చెప్పడం పచ్చి అబద్ధం. పౌరసరఫరాల సంస్థ సేకరించిన ధాన్యంలో సింహభాగం కేంద్రమే తీసుకుంటోంది. గత ఖరీఫ్ సీజన్‌లో 71.86 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 60 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొనుగోలు చేసింది. గత రబీ సీజన్‌లో 74.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే.. 50.10 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం కొనుగోలు చేసింది.


గత రబీ సీజన్ కంటే 2 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఈ సీజన్‌లో కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని చెప్పడం పచ్చి అబద్ధం. 12 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు తెలంగాణకు ఇచ్చింది మోదీ ప్రభుత్వం. కేంద్రం సహకరించలేదని భావిస్తే ప్రధానమంత్రికి లేఖ ఎందుకు రాయలేదు?. కేంద్రం సహకరించకపోతే వడ్ల కొనుగోలు సమయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం బయటపడేది. పార్లమెంట్ చేసిన రైతు చట్టాలను నల్ల చట్టాలని వ్యవసాయ మంత్రి చెప్పడం రాజ్యాంగ ద్రోహం. వ్యవసాయ మంత్రిగా కొనసాగే అర్హత తుమ్మలకు లేదు.


ఇప్పటికైనా రాజకీయ నిందారోపణలు, ఎదురుదాడి మాని కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు పడుతున్న బాధలు తెలుసుకోండి. కనీస మద్దతు ధర అందించడంతోపాటు రబీ సీజన్‌లోనూ అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించండి. మేనిఫెస్టో హామీల అమలుపై తక్షణమే దృష్టి సారించి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోండి. వ్యవసాయ మంత్రికి కాంగ్రెస్ మేనిఫెస్టోపైనా, వడ్ల కొనుగోళ్లపైనా, కేంద్ర అందిస్తున్న సహకారంపైనా అవగాహన కల్పించండి' అంటూ లేఖ రాశారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం.. ఈదురుగాలుల బీభత్సం

భార్యాభర్తల గొడవలు.. కదులుతున్న కారులోంచి దూకి మహిళ మృతి

Updated Date - May 03 , 2026 | 10:03 PM