రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే: బండి సంజయ్
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:19 PM
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10: రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఆయన లేఖ రాశారు. ‘సీఎం గారూ... మీకు మానవత్వం ఉందా?’ అని ప్రశ్నించారు. విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం న్యాయమా అని ప్రశ్నించారాయన. రిటైర్డ్ అయ్యి రెండేళ్లయినా.. వారి బకాయిలను ఇంకా చెల్లించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 61 మంది విశ్రాంత ఉద్యోగులు తనువు చాలించారని.. వారి చావులకు ఎవరు బాధ్యులని లేఖలో ప్రస్తావించారు.
ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులను రాష్ట్ర సర్కార్ ప్రాధాన్యం లేని కేటగిరీలుగా భావిస్తోందా అని బండి సంజయ్ నిలదీశారు. ప్రభుత్వ తీరు తెలంగాణకు మాయని మచ్చ అని విమర్శించారు. జీవితం మలి సంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిదన్నారు. ముక్కూమొహం తెలియని వృద్ధులు కష్టాల్లో ఉంటేనే చేతనైనంత సాయం చేయాలని భావించే గొప్ప మానవతా హృదయం ఉన్న తెలంగాణ సమాజం మనదని ఆయన చెప్పుకొచ్చారు.
ఉద్యోగ విరమణ చేసిన వెంటనే వారికి బెనిఫిట్స్ అన్నింటినీ చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. దీనిని తక్షణమే అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని వారి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేసేందుకు వెనకాడబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..
హీరోయిజం చూపిస్తే.. కఠిన చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
Read Latest Telangana News And Telugu News