Share News

పాలమూరు-రంగారెడ్డిని అడ్డుకోండి

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:06 AM

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను వెంటనే అడ్డ్డుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది.

పాలమూరు-రంగారెడ్డిని అడ్డుకోండి
Palamuru Rangareddy project

గూడెందొడ్డి, కల్వకుర్తి సహా తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను వెంటనే అడ్డ్డుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తితోనే పంచాలని డిమాండ్‌ చేసింది. అక్టోబరు 1న జరిగే (కేఆర్‌ఎంబీ) బోర్డు సమావేశం అజెండాలో ఈ అంశాలను చేర్చాలని కోరుతూ ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లో అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని అందులో పేర్కొన్నారు. పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు 2023 ఫిబ్రవరి 17న ఆదేశించినట్టు చెప్పారు.


తాగునీటి అవసరాలకు 7.5 టీఎంసీలతో ప్రాజెక్టు చేపట్టేందుకే అనుమతినిచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపించిందని, నీటి కేటాయింపులపై జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌విచారణ నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మక్తల్‌-నారాయణపేట--కొడంగల్‌ ఎత్తిపోతల పథకంపైనా ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జవహర్‌ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని పెంచడం, గూడెందొడ్డి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచాలనే ప్రతిపాదలను తిరస్కరించింది.


పులిచింతల బ్యాక్‌ వాటర్‌పై చేపట్టిన.. రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకం(బుద్ధ మాధవరం), జాన్‌పహాడ్‌ ఎత్తిపోతల పథకం, బెట్టెతాండ ఎత్తిపోతల పథకం, నక్కగూడెం, ముక్త్యాల పథకాలపైనా అభ్యంతరం తెలిపింది. అనుమతులు వచ్చేదాకా ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరింది. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తితోనే పంచాలని కృష్ణా బోర్డును ఏపీ కోరింది. ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల్లో.. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను పంచుకోవాలని అంగీకారం కుదిరిందని.. ఇదే విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎక్కడున్నాడో.. ఎం చేస్తున్నాడో..

సచివాలయం వద్ద నిరసనలు సిగ్గుచేటు

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 06:06 AM