Share News

అంబేడ్కర్ కొందరి వాడు కాదు.. అందరి వాడు: కేటీఆర్

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:56 PM

‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేడ్కర్ తత్వంతోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటుంది తప్ప.. ఎన్నడూ నిజమైన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు.

అంబేడ్కర్ కొందరి వాడు కాదు.. అందరి వాడు: కేటీఆర్
KTR

హైదరాబాద్, ఏప్రిల్ 14: బీఆర్ఎస్ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. పోరాడితే పోయేదేమీ లేదన్న శ్రీశ్రీ చెప్పిన మాట నిజం అయిందని.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సంకెళ్లు వేసి బందీ చేసిందని ఆరోపించారు. ఈసారి బందీ చేస్తే సంకెళ్లు బద్దలు కొడతామని పిలుపు ఇచ్చిన వెంటనే విగ్రహాన్ని ఓపెన్ చేశారని వ్యాఖ్యానించారు.


అంబేడ్కర్‌‌కు గౌరవం ఇవ్వలేదు...

అంబేడ్కర్ తత్వం ‘బోధించు, సమీకరించు, పోరాడు’తోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కేటీఆర్ పేర్కొన్నారు. గురుకులాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గురుకులాల్లో మరణ మృదంగం మోగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటోంది తప్ప.. ఎన్నడూ నిజమైన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదన్నారు. అంబేడ్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయకుండా ఆయనను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు లాంటి పథకాలను తీసుకొచ్చిన కలేజా ఉన్న నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు.


మూసి కాంట్రాక్టు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తారా...

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవకాశాలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి విమర్శించారు. లక్షన్నర కోట్ల కాంట్రాక్టుల్లో 72 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. మూసి కాంట్రాక్టు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ మోసాలను రాష్ట్రంలోని ప్రతి దళిత, బీసీ, మైనార్టీ కుటుంబాలకు చేర్చి పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 20న జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతాని ప్రకటించారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.


కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే..

పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని బీజేపీని డిమాండ్ చేశామని.. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని కేటీఆర్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు ఏ మాత్రం గౌరవం ఉన్నా స్పందించే వారన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని.. అంబేడ్కర్ అంటే గిట్టని వారే అని విమర్శించారు. అంబేడ్కర్‌ను కొందరి వాడుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. మహాత్మా గాంధీ లాగే అంబేడ్కర్ అందరి వాడని స్పష్టం చేశారు. ‘జై భీమ్, జై కేసీఆర్, జై తెలంగాణ’ నినాదాలతో ముందుకు సాగుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు స్పీకర్, హోం మంత్రి ఘన నివాళి

దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 01:18 PM