Share News

మూడేళ్లలో అన్ని రంగాలకూ ఏఐ విస్తరణ

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:27 AM

ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు ప్రస్తుతం ప్రధానంగా డిజిటల్‌ రంగాలకే పరిమితమైనప్పటికీ.. రానున్న మూడేళ్లలో అన్ని పరిశ్రమలు, ఇతర రంగాలను చుట్టేయనుందని ప్రపంచ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

మూడేళ్లలో అన్ని రంగాలకూ ఏఐ విస్తరణ
AI

  • అణుశక్తి, పునరుత్పాదక ఇంధనంపై పెట్టుబడులు..

  • అమెరికా ఆధిపత్యానికి చైనా ఏఐ మోడళ్లు చెక్‌

  • వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు ప్రస్తుతం ప్రధానంగా డిజిటల్‌ రంగాలకే పరిమితమైనప్పటికీ.. రానున్న మూడేళ్లలో అన్ని పరిశ్రమలు, ఇతర రంగాలను చుట్టేయనుందని ప్రపంచ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఇంధనం-వస్తువుల రంగం, గనుల తవ్వకం, ఇంజినీరింగ్‌, నిర్మాణం, యుటిలిటీస్‌ వంటి రంగాల్లో ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తాజాగా విడుదల చేసిన ‘సెప్టెంబరు 2026 చీఫ్‌ ఎకనామిస్ట్స్‌ ఔట్‌లుక్‌’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాంతోపాటు ఏఐకు అవసరమైన డేటా సెంటర్లపై కూడా భారీగా పెట్టుబడులు రానున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


సర్వేలో పాల్గొన్న చీఫ్‌ ఎకనామిస్టుల్లో 97 శాతం మంది వచ్చే ఏడాదిలో ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ఈ సర్వేలో అడిగిన అంశాల్లో దీనిపైనే ఎక్కువమంది ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. మరోవైపు 69 శాతం మంది ఏఐ వల్ల గణనీయమైన ఉత్పాదకత, లాభాలు వస్తాయని అంచనా వేశారు. కాగా ఏఐ రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ మరింత తీవ్రతరం కానుందని సర్వే సూచించింది. చైనాకు చెందిన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లు(ఎల్‌ఎల్‌ఎం) వచ్చే 12 నెలల్లో అమెరికా మోడళ్ల స్థాయికి పూర్తిగా చేరుకుంటాయని 69 శాతం మంది చీఫ్‌ ఎకనామిస్టులు అంచనా వేశారు.


అంటే ఏఐ మోడళ్ల సామర్థ్యంలో అమెరికా ఆధిపత్యానికి చైనా నుంచి మరింత గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది. డేటా సెంటర్లకు అవసరమైన భారీ విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చేందుకు వచ్చే 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని 83 శాతం మంది అంచనా వేశారు. అందులో భాగంగానే పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని 80 శాతం మంది, శిలాజ ఇంధనాలపై కూడా పెరుగుతాయని 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏఐ ప్రభావం ఆశాజనకంగానేఉండనుందని డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక పేర్కొంది.


వార్తలు కూడా చదవండి:
జీహెచ్‌ఎంసీ, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

భాద్రపదంలో గ్రీష్మం!

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 06:27 AM