లంచం మరిగారు.. చివరికి చిక్కారు !
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:59 AM
విధి నిర్వహణలో అనుచిత ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో లంచం తీసుకున్న ముగ్గురు లంచగొండి ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఏసీబీకి పట్టుబడిన ముగ్గురు ఉద్యోగులు
హైదరాబాద్, సిద్దిపేట రూరల్, అచ్చంపేట టౌన్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అనుచిత ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో లంచం తీసుకున్న ముగ్గురు లంచగొండి ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటికి మ్యూటేషన్ చేసేందుకు పంచాయతీ కార్యదర్శి అరుణ, కారోబార్ సంతోష్ రూ. 20 వేలు డిమాండ్ చేశారు. చివరికి రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకుపిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు.. బాధితుడు రూ.15 వేలు ఇస్తుండగా అధికారులు కారోబార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం కార్యదర్శి అరుణ నివాసంలో సోదాలు జరిపారు. కార్యదర్శి, కారోబార్‌పై కేసు నమోదు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. అలాగే, నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట సబ్ డివిజనల్ ట్రెజరీ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ కందాడ వెంకటయ్య ఓ ఉద్యోగి వైద్య సెలవు, బిల్లుల ప్రాసెసింగ్ కోసం రూ.25వేల లంచం డిమాండ్ చేశారు. ఆగస్టు 14న రూ.3వేల నగదు, ఆగస్టు 18న రూ. 22వేలను ఫోన్‌పే ద్వారా తీసుకోగా దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం సాయంత్రం ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తన సిబ్బందితో కలిపి కందాడ వెంకటయ్యను విచారించి అరెస్టు చేశారు.
ఎంవీఐ లేకుండానే డ్రైవింగ్ టెస్ట్
జగిత్యాల జిల్లా కోరుట్ల యూనిట్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు కార్యాలయంలోని రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, చలాన్లు, పెండింగ్ దరఖాస్తులు, కార్యాలయ నిర్వహణ తీరును పరిశీలించారు. రికార్డులు, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. ఎంవీఐ లేకుండానే ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ గిరీ్‌షకుమార్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించడంతోపాటు వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన తనిఖీలు చేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ ేసవలు పొందేందుకు వచ్చే ప్రజల నుంచి ఏజెంట్ల ద్వారా నిర్ణీత ధరలకంటే అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో వెలుగుచూసింది.
ఇవి కూడా చదవండి...
పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన టీస్టాల్ నిర్వాహకుడు సుధాకర్ మృతి
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి
గౌరవం లేని చోట ఉండలేను
Read Latest AP News And Telugu News