Share News

కొన్ని చ.కి.మీ.లోనే 9 లక్షల ఉద్యోగులు!

ABN , Publish Date - Nov 27 , 2026 | 04:17 AM

ఒకే ప్రాంతంలో భారీగా ఉద్యోగాల కల్పన అన్నది ట్రాఫిక్‌ రద్దీకి కారణమవుతుందని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు.

కొన్ని చ.కి.మీ.లోనే 9 లక్షల ఉద్యోగులు!
DGP Anand

  • ఐటీ కారిడార్‌, సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు

  • ఇదే ప్రధాన కారణం: డీజీపీ సీవీ ఆనంద్‌

  • ‘సైబరాబాద్‌ మూవ్స్‌’తో రవాణాకు కొత్త దిశ

  • వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించడమే లక్ష్యం

  • ప్రయోగాత్మకంగా వన్‌వే లూప్‌ విధానం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఒకే ప్రాంతంలో భారీగా ఉద్యోగాల కల్పన అన్నది ట్రాఫిక్‌ రద్దీకి కారణమవుతుందని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌లో తక్కువ చదరపు కిలోమీటర్ల పరిధిలోనే సుమారు 9 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వీరిలో 65 శాతం మంది ఒకే ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఒత్తిడి నానాటికీ పెరుగుతోందన్నారు. ఈ సమస్యకు రహదారుల విస్తరణ ఒక్కటే పరిష్కారం కాదని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, చివరి మైలు అనుసంధానాన్ని మెరుగుపరచడం, కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను ప్రోత్సహించడం అవసరమని అభిప్రాయపడ్డారు. బస్సులు అందజేస్తామని చెప్పారు.


dgp2.jpgఈ దిశగా ప్రభుత్వ విభాగాలు, పోలీస్‌, కార్పొరేట్‌ సంస్థలు, రవాణా రంగ నిపుణులు, ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ‘సైబరాబాద్‌ మూవ్స్‌-2026‘కు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, సైబరాబాద్‌ పోలీసు శాఖ, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ), షిఫ్ట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని గురువారం రాయదుర్గంలోని టీ హబ్‌లో డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబరాబాద్‌ భవిష్యత్తుకు ట్రాఫిక్‌ ప్రధాన అడ్డంకిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇక్కడ పరిధి తక్కువగా ఉండటం భారీగా ఉద్యోగాలు కేంద్రీకృతం కావడంతో ట్రాఫిక్‌ రద్దీ అనూహ్యంగా పెరుగుతోందన్నారు. ఇక్కడి ఉద్యోగులందరి నివాస ప్రాంతాలు ఒకే చోట ఉండటం సైతం ట్రాఫిక్‌ సమస్యకు మరో కారణంగా నిలుస్తోందని తెలిపారు. సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కావాలంటే ప్రజా రవాణా సౌకర్యాలు కార్యాలయాలకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలని డీజీపీ అన్నారు. దీంతోపాటు అన్ని కార్యాలయాలకు ఒకే పనివేళలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్‌ నియంత్రణకు వన్‌వే లూప్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలనిచెప్పారు. ఫ్రీ లెఫ్ట్‌, యూటర్న్‌లను సక్రమంగా ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ జరిగితే ట్రాఫిక్‌ జంక్షన్లపై భారం తగ్గుతుందన్నారు. కార్పొరేట్‌ సంస్థలు.. పోలీసు వ్యవస్థకు సహకరించాలని, ఉద్యోగులకు ట్రాఫిక్‌ క్రమశిక్షణపై అవగాహన కల్పించాలని, కార్‌ పూలింగ్‌, ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. కాగా, సైబరాబాద్‌ మూవ్స్‌ తొలిరోజు కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో 15కు పైగా కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు ‘కార్పొరేట్‌ మొబిలిటీ అండ్‌ సస్టెయినబిలిటీ ప్రతిజ్ఞ’ చేశారు. ఉద్యోగుల రాకపోకల కోసం వినియోగించే వ్యక్తిగత వాహనాల సంఖ్యను 2027 నాటికి 10 శాతం తగ్గించాలన్నది ఈ ప్రతిజ్ఞ ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ఈ కార్యక్రమంలో 113 భాగస్వామ్య సంస్థలు చేరగా, వెయ్యికి పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వివిధ ప్రదర్శనలను డీజీపీ ప్రత్యక్షంగా పరిశీలించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, ఎస్‌సీఎ్‌ససీ చైర్మన్‌ ఎం.రమేశ్‌ మాట్లాడుతూ.. నగరమంటే కేవలం నివాస ప్రాంతం కాదని, ఆర్థిక కార్యకలాపాల కేంద్రమని అన్నారు. సైబరాబాద్‌ మూవ్స్‌లో స్టార్టప్‌ కంపెనీలు ప్రదర్శించిన ఆలోచనలు త్వరలోనే కార్యరూపం దాల్చుతాయని చెప్పారు. ఈ విప్లవాత్మక మార్పులో 21 పౌర సమాజ సంస్థలు, టీ హబ్‌, టీ వర్క్స్‌ నుంచి 28 స్టార్టప్‌ కంపెనీలు భాగస్వాములుగా చేరడం అభినందనీయమన్నారు.


మొబిలిటీ లివింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు..

ఎస్‌సీఎస్‌సీ, డబ్ల్యూఆర్‌ఐ ఇండియా సంస్థలు ‘సైబరాబాద్‌ మూవ్స్‌ లివింగ్‌ ల్యాబ్‌’ను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టులో ఎస్‌సీఎ్‌ససీ ట్రాఫిక్‌ కౌన్సిల్‌, విద్యా, పరిశోధనా సంస్థలు, రవాణా నిపుణులు కలిసి పనిచేస్తారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్‌, రోడ్డు భద్రత సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. ఎస్‌సీఎ్‌ససీ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రెండు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. పాఠశాలలకు వెళ్లే మార్గాల్లో భద్రత పెంపు, రద్దీ కూడళ్లను సురక్షితంగా తీర్చిదిద్దడం వీటి ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో కొలంబియా రాజధాని బొగోటా మాజీ మేయర్‌ ఎన్రిక్‌ పెనలోసా, లండన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ శశివర్మ, డబ్ల్యూఆర్‌ఐ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పవన్‌ ములుకుట్ల అమెరికా కాన్సులేట్‌ లారా విలియమ్స్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మున్సిపల్‌ కమిషనర్‌ సృజన, అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ‘డీజిల్‌ టు ఎలక్ట్రిక్‌’ బస్సు

సైబరాబాద్‌ మూవ్స్‌ -2026 కార్యక్రమంలో జీరో 21 రెట్రో సొల్యూషన్స్‌ తయారు చేస్తున్న టీజీఎస్‌ ఆర్టీసీ డీజిల్‌-టు- ఎలక్ర్టిక్‌ రెట్రోఫిట్‌ బస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీజిల్‌ ఇంజన్‌ నుంచి ఈవీ మారిన బస్సును డీజీపీ సి.వి.ఆనంద్‌ పరిశీలించారు. తెలంగాణ ఆర్టీసీలో 40 డీజిల్‌ బస్సులను రెట్రోఫిట్‌తో ఎలక్ర్టిక్‌ బస్సులుగా మారుస్తున్నామని జీరో 21 రెట్రో సొల్యూషన్‌ ఎండీ రాణి శ్రీనివాస్‌ తెలిపారు. డిసెంబరు చివరి నాటికి డీజిల్‌ నుంచి ఈవీలుగా మార్చిన 10 బస్సులను ఆర్టీసీకి అందజేస్తామని, ఫిబ్రవరి నాటికి మొత్తం బస్సులు అందజేస్తామని చెప్పారు

ఇవి కూడా చదవండి..

ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు?

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్

Updated Date - Nov 27 , 2026 | 04:20 AM