Share News

తొలగించిన కులాల పేరిట 2,123 బీసీ సర్టిఫికెట్ల జారీ

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:45 AM

రాష్ట్రంలో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాల పేరుతో 2,123 కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ తెలిపారు.

తొలగించిన కులాల పేరిట 2,123 బీసీ సర్టిఫికెట్ల జారీ
G. Niranjan

  • నెలల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

  • గత మూడు నెలలుగా ఆ కులాల పేరుతో

  • జారీ చేసిన సర్టిఫికెట్లను రద్దు చేయాలి

  • బీసీ కమిషన్‌ సమావేశంలో తీర్మానం

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాల పేరుతో 2,123 కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ తెలిపారు. దీనిపై రెండు నెలల్లో పూర్తిస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ కార్యదర్శి టి.వెంకట్‌కు సూచించారు. జాబితా నుంచి తొలగించిన కులాల పేరుతో గత మూడు నెలలుగా జారీ అయిన సర్టిఫికెట్లను రద్దు చేయాలన్నారు. శనివారం చైర్మన్‌ నిరంజన్‌ అధ్యక్షతన సభ్యులు రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మి రంగు, కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ బి.బాలమయదేవితో కలిసి రాష్ట్ర బీసీ కమిషన్‌ సమావేశం జరిగింది.


సమావేశానికి ముందు.. తొలగించిన కులాల పేరుపై జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి సీసీఎల్‌ఏ కార్యదర్శితో చర్చించి ఆదేశాలు జారీ చేశారు. పంబాల కుల ధ్రువీకరణ పత్రాల విషయమై ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన మండలాలకు చెందిన ఆరుగురు తహసీల్దార్లతోనూ సమావేశమై ఆ కులస్తుల వివరాలను రికార్డు చేశారు. అనంతరం జరిగిన కమిషన్‌ సమావేశంలో.. రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.


గ్రామ బహిష్కరణపై కమిషన్‌ ఆగ్రహం..

నిజామాబాద్‌ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు కొన్ని కులాల వారిపై బహిష్కరణ విధించడాన్ని కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఆ జిల్లాలో ఇలాంటి వేధింపులకు గురవుతున్న వారితో ఈ నెల 7న జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం కావాలని నిర్ణయించింది. అనంతరం జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ అధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై ఈ జాడ్యాన్ని అరికట్టే విషయమై చర్చించాలని తీర్మానించింది. ఇటీవల లొద్ద కులస్తుల సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో జరిపిన పర్యటనను కమిషన్‌ ఈ సందర్భంగా సమీక్షించింది.


సదరు కులస్తుల స్థితిగతులపై అధ్యయనానికి సెస్‌ సంస్థ ద్వారా ప్రత్యేక సర్వే చేయించాలని నిర్ణయించింది. మరో అంశంలో.. తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఇతర ప్రాంతాల్లో ఇంటర్మీడియట్‌ చదివినందున స్థానిక విద్యార్థి కాదంటూ సుప్రింకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కమిషన్‌ చర్చించింది. రాష్ట్ర విభజన సమయంలో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.


ఇవి కూడా చదవండి...
శ్రీరాముడు అయోధ్యలో పుట్టినా.. అరణ్య వాసం చేసింది భద్రాద్రిలోనే

గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించాలి.. 98 శాతం పనులు పూర్తి: మంత్రి ఉత్తమ్‌
ఖమ్మంలో రూ.113 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయం.. 12న శంకుస్థాపన: మంత్రి తుమ్మల

Updated Date - Oct 04 , 2026 | 06:56 AM