వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత.. 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - May 18 , 2026 | 11:36 AM
హైదరాబాద్ నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటైన ఉప్పల్ జంక్షన్ మీదుగా ప్రయాణించే వాహనదారులకు అధికారులు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఉప్పల్, మే 18: హైదరాబాద్ నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటైన ఉప్పల్ జంక్షన్ మీదుగా ప్రయాణించే వాహనదారులకు అధికారులు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, నగర ట్రాఫిక్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా, పిల్లర్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు దాదాపు మూడు నెలల పాటు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు.

ప్రత్యామ్నాయ మార్గాలు:
ప్రయాణికుల సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయం పక్కనే ఉన్న వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట బస్టాప్‌ను తాత్కాలికంగా నల్లచెరువు కట్ట ప్రాంతానికి మార్చారు.
వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు.. మేఫేర్ హోటల్ దాటిన తర్వాత 'ఉప్పల్ భగాయత్ లేఅవుట్' మీదుగా నాగోల్ చేరుకోవాలి. అక్కడ సర్వీస్ రోడ్డు గుండా వెళ్లి, ఫ్లైఓవర్ కింద యూటర్న్ (U-Turn) తీసుకుని నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు, సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్, బీరప్పగడ్డ మీదుగా జాతీయ రహదారి 163 (NH 163) కి చేరుకోవాలి.
పీర్జాదిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు.. ఉప్పల్ జంక్షన్‌కు రాకుండా, లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ వద్దకు చేరుకుని అక్కడ యూటర్న్ తీసుకోవాలి.
భారీ వాహనాల (RTC బస్సులు, లారీలు, ట్రక్కులు) మళ్లింపు.. ఉప్పల్ భగాయత్ రోడ్డు చాలా ఇరుకైనది కావడంతో భారీ వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు. వాటి కోసం ప్రత్యేక మార్గాలను కేటాయించారు
వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు.. ఘట్‌కేసర్ వద్దే ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎక్కి, హయత్‌నగర్ లేదా పెద్ద అంబర్‌పేట మీదుగా ఎల్బీనగర్ చేరుకోవాలి.
సికింద్రాబాద్, రామంతాపూర్, హబ్సీగూడ నుంచి వరంగల్ వెళ్లే భారీ వాహనాలు.. నాచారం, మల్లాపూర్, ఐఓసీ (IOC) జంక్షన్, చెంగిచర్ల మీదుగా వరంగల్ హైవేకి వెళ్లాల్సి ఉంటుంది.
ప్రయాణికులకు కీలక సూచన:
ఈ ఆంక్షల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాగోల్ వైపు ప్రయాణించే వారు తమ గమ్యస్థానాలకు సాధారణ సమయం కంటే కాస్త ముందే బయలుదేరడం ఉత్తమం అంటున్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
ఓవర్ స్పీడ్‌గా వెళ్లొద్దన్న వృద్ధుడు.. యువకుల దారుణం
Read Latest Telangana News And Telugu News