హైదరాబాద్‌లో TG SAFE దాడులు.. డార్క్ స్టోర్లలో భారీ తనిఖీలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 08:22 PM
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై TG SAFE అధికారులు చర్యలకు దిగారు. 10 ప్రత్యేక బృందాలతో BigBasket, Blinkit, Zeptoకు చెందిన 20 డార్క్ స్టోర్లలో తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్, ఆగస్టు 22: నగరంలో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘనలపై TG SAFE అధికారులు కొరడా ఝుళిపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కలిసి మొత్తం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నగరంలోని డార్క్ స్టోర్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా BigBasket, Blinkit, Zeptoకు చెందిన 20 డార్క్ స్టోర్లలో అధికారులు సోదాలు చేపట్టారు. ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణ, పరిశుభ్రత, నాణ్యతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు స్టోర్లలో పరిశుభ్రత ప్రమాణాలు సరిగా పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయడం, వాటి నిర్వహణ, స్టోరేజీ ప్రాంతాల పరిశుభ్రత విషయంలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలు అందేలా నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
తనిఖీల సందర్భంగా కొన్ని డార్క్ స్టోర్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను కూడా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన స్టోర్లపై అధికారులు చర్యలకు దిగారు. నిబంధనలు పాటించని స్టోర్లకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా తనిఖీల్లో భాగంగా పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపించారు. ఈ నమూనాల పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా వేగంగా ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించే డార్క్ స్టోర్లలో భద్రతా ప్రమాణాలపై TG SAFE ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల
జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి
For More National News And Telugu News