Hyderabad: ఓఆర్‌ఆర్ చుట్టూ మహా మెట్రో.. ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం
ABN , Publish Date - Jan 04 , 2026 | 08:13 AM
అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రింగ్‌రైల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రకటనతో ఔటర్ చుట్టూ మెట్రోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- మంత్రి తాజా ప్రకటనతో సర్వత్రా ఆసక్తి
- 158కి.మీ వలయాకారంలో మెట్రో రింగ్‌రైల్‌కు సన్నాహాలు
- 22 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద స్టేషన్లు..
హైదరాబాద్ సిటీ: మహా మెట్రో నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. 360 డిగ్రీలతో నగరం చుట్టూరా మెట్రో రింగ్‌రైల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కోర్ అర్బన్ ప్రాంతాన్ని 2,071 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించిన నేపథ్యంలో.. అక్కడి నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు వేగవంతమైన, మెరుగైన రవాణాను కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రకటనతో ఔటర్ చుట్టూ మెట్రోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వలయాకారంలో..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే ప్రజలు ట్రాఫిక్ బారిన పడకుండా సులువుగా రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)ను 2000లో ప్రారంభించి 2012నాటికి పూర్తి చేశారు. ప్రస్తుతం 158 కిలోమీటర్ల చుట్టూ ఓఆర్‌ఆర్ విస్తరించి ఉంది. అయితే, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను కూడా ఔటర్ చుట్టూ నిర్మించే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఔటర్ టు ఔటర్ వరకు మెట్రో మార్గాన్ని నిర్మించడం ద్వారా జాతీయ రహదారుల నుంచి నగరానికి వచ్చే వాహనాలను శివారుకే పరిమితం చేయడంతోపాటు స్థానికులకు కూడా ఉపాధి కల్పించవచ్చని, అదే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు, వాహన కాలుష్యాన్ని అరికట్టవచ్చని భావిస్తోంది.

నిర్మాణానికి సులువుగా భూసేకరణ
ఔటర్ చుట్టూ మెట్రోను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో ప్రభుత్వం సులువుగా ముందుకుసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఔటర్ నుంచి సర్వీస్ రోడ్డు మధ్యలో రీజినల్ రింగ్ రైల్ కోసం ఇప్పటికే 25 మీటర్ల భూసేకరణకు వదిలేయడంతో మెట్రో నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని తెలుస్తోంది. దీంతో నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ను త్వరగా తయారు చేసే అవకాశాలున్నాయి. కాగా, ఓఆర్‌ఆర్‌కు చెందిన ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి నడిచే రైల్వేస్టేషన్ల వద్ద కూడా మెట్రోస్టేషన్లను ఏర్పాటు చేయడం బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా వలయాకారంలో మెట్రోను నిర్మించడం ద్వారా హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రజలు హాయిగా రాకపోకలు సాగించనున్నారు.
22 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద స్టేషన్ల ఏర్పాటు..!
ఔటర్ పరిధిలో ప్రస్తుతం 22 ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరో మూడింటిని కలిపి 25 వరకు విస్తరించాలని చూస్తున్నారు. ప్రస్తుతం 22 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మెట్రోస్టేషన్లను ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. కాగా, ఇంటర్‌ఛేంజ్‌ల నుంచి మెట్రోస్టేషన్లకు వెళ్లేందుకు స్కైవాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే వాహనాలకు భారీ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు
Read Latest Telangana News and National News