Share News

మెట్రో రుణం ఆపేసిన కిషన్‌ రెడ్డి

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:00 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆపేశారని, జపాన్‌ నుంచి ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌.....

మెట్రో రుణం ఆపేసిన కిషన్‌ రెడ్డి

  • ఐఆర్‌ఎఫ్‌సీ ఖాతాలో జమయిన మొత్తాన్ని ఇవ్వకుండా నిలిపేశారు

  • రేవంత్‌ అడిగినవన్నీ చేసేస్తే తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా!?

  • కేంద్ర మంత్రులు ఖట్టర్‌, అశ్వినీ వైష్ణవ్‌లతో ఆయన అన్న మాటలివే

  • సగం ధరకే మెట్రో స్వాధీనం.. 4 శాతం వడ్డీకే రుణం తెస్తున్నాం

  • అందుకే కేటీఆర్‌తో కలిసి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు

  • మెట్రో విస్తరణకు అన్ని రాష్ట్రాలకు 50 శాతం నిధులిస్తున్న కేంద్రం

  • తెలంగాణపై మాత్రం వివక్ష.. అందుకే ఆయన వెంట పడుతున్నాం

  • కూలేశ్వరం కట్టిన కేసీఆర్‌కు 3.15 లక్షల కోట్ల నిధులు ఇప్పించారు

  • కిషన్‌రెడ్డీ.. నిధులు విడుదల చేయిస్తారా లేదా? ఎన్వోసీ ఇప్పిస్తారా?

  • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిలదీత

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆపేశారని, జపాన్‌ నుంచి ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) ఖాతాలో జమయిన రూ.13,600 కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపివేయించారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మెట్రో విస్తరణను కిషన్‌ రెడ్డి అడ్డుకుంటున్నారని, కేటీఆర్‌తో కలిసి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించడానికి మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నాం. రెండో దశ విస్తరణకు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశాం. రెండో దశ విస్తరణ చేపట్టడానికి ఫేజ్‌-1 చేపట్టిన ఎల్‌ అండ్‌ టీనే ఒప్పించి ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకు ఎల్‌అండ్‌టీ అంగీకరించలేదు. ఏటా రూ.350-400 కోట్ల నష్టాలొస్తున్నాయని, రెండో దశ విస్తరణ చేపట్టలేమని తేల్చిచెప్పింది. దాంతో.. మొదటి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రెండో దశ విస్తరణ చేపట్టాలని మళ్లీ కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని, కాలుష్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యాలతో మొదటి విడత మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.30 వేల కోట్ల విలువ కలిగిన మెట్రో మొదటి దశను కేవలం రూ.15 వేల కోట్లకే స్వాధీనం చేసుకుంటున్నాం. ఇందుకు కార్యాచరణ పూర్తి చేశాం. ఎల్‌అండ్‌టీ రూ.13,600 కోట్లను 8.25 శాతం వడ్డీకి బ్యాంకుల్లో రుణం తెచ్చుకుంది.

7.jpg


దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా తక్కువ వడ్డీకి రుణం తీసుకోవడానికి చర్చలు జరిపాం. రుణానికి ఒప్పించాం. ఐఆర్‌ఎఫ్‌సీతో అన్ని రకాల ఒప్పందాలు పూర్తయ్యాయి. కేవలం 4 శాతం వడ్డీకి జపాన్‌ సంస్థ నుంచి అప్పు తీసుకొచ్చాం. ఇది ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆర్బీఐ కౌంటర్‌ గ్యారెంటీ కూడా ఇచ్చాం. ఫీజు రూపేణా ఐఆర్‌ఎఫ్‌సీకి రూ.84 కోట్లతోపాటు ఈక్విటీగా ఎల్‌అండ్‌టీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1400 కోట్లనూ చెల్లించాం. ఈ క్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను అనేకమార్లు కలిశాను. మెట్రో విస్తరణ, జపాన్‌ రుణంపై వారు సానుకూలంగా ఉన్నారు. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ఈరోజు (జూన్‌-15) నిధులు విడుదల కావాలి. ఇక రుణం వచ్చినట్లేనని మేం అనుకుంటే కిషన్‌ రెడ్డి అడ్డుకున్నారు. మే 20వ తేదీన ఖట్టర్‌ను, 21న అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. తెలంగాణ సీఎం అడిగినవన్నీ ఇచ్చేస్తుంటే.. అక్కడ బీజేపీ ఉండాలా వద్దా..? అని ఆయన వారిని ప్రశ్నించారు. అందుకే.. మేం కిషన్‌ రెడ్డి వెంట పడుతున్నాం. కిషన్‌ రెడ్డిని సూటిగా అడుగుతున్నా. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రిగా నిధులను విడుదల చేయిస్తున్నారా!? లేదా?’’ అని నిలదీశారు. అహ్మదాబాద్‌, వైజాగ్‌కు కూడా మెట్రో మంజూరు చేశారని, కానీ, తెలంగాణకు ఇవ్వడం లేదని, దీనినిబట్టే వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల్లో మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూర్చుతోందని, తెలంగాణ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు ఇక్కడ బీజేపీ మూసుకోవాల్సి వస్తుందన్న భయంతోనే కిషన్‌ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీని వెనక కేటీఆర్‌ ఉన్నారన్నారు. కేటీఆర్‌, కిషన్‌ రెడ్డి కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ‘‘తెలంగాణ అభివృద్ధిపై నిజంగా ప్రేమ ఉంటే ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి నిధులు విడుదల చేయిస్తారా..? లేదా రెండో విడత వ్యయంలో కేంద్రం తన వాటా కింద 50 శాతం ఇచ్చేలా ఓప్పిస్తారా..? లేదా కనీసం రెండో విడత అంతా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) అయినా ఇస్తుందా..?’’ అని ప్రశ్నించారు.


మోదీ చేస్తే.. రాజీనామాకు నేనూ సిద్ధం

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, స్విస్‌ బ్యాంకుల్లోని నల్లధనం వెనక్కి తేవడం, ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేయడం, రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీలు ఇచ్చి నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. వాటిని అమలు చేయని ఆయన రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని క్యాబినెట్‌ రాజీనామా చేయాలన్న బీజేపీ నాయకుల డిమాండ్‌కు రేవంత్‌ జవాబు ఇచ్చారు.

‘ఛత్రపతి’లో రామాచారి క్యారెక్టర్‌లా రాంచందర్‌ రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు తనను కమేడియన్‌లా భయపెడుతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన తనను విమర్శించడం చూస్తుంటే.. ‘ఛత్రపతి’ సినిమాలో రామాచారి పాత్ర పోషించిన కమేడియన్‌ వేణు మాధవ్‌ అపరిచితుడు వేషం వేసి భయపెడుతున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అజరుద్దీన్‌, ఎంపీలు వేం నరేందర్‌ రెడ్డి, అనిల్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ అప్పులకు కిషన్‌ రెడ్డి సహకారం

‘‘పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ప్రభుత్వం రూ.3.15 లక్షల కోట్ల రుణాలను తీసుకుంది. వాటన్నిటినీ 8 నుంచి 11 శాతం వడ్డీకి రుణాలను తీసుకుంది. దీనికి మోదీ ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పూర్తి సహకారం అందించారు. భారీ వడ్డీలతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ముంచింది. ఈ నిధులతోనే కాళేశ్వరాన్ని కూలేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తాము కేవలం 4 శాతం వడ్డీకే ఒప్పందం చేసుకున్నామని, అయినా, తమకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అన్ని లాంఛనాలను పూర్తి చేసినా నిధులు బదిలీ కాకపోవడం వెనక కిషన్‌ రెడ్డి పాత్ర ఉందన్నారు. ‘‘నిజానికి, 2017 నాటికే మెట్రో మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. తెలంగాణ వచ్చాక చారిత్రక కట్టడాల సాకుతో మొదటి దశను అడ్డుకున్నారు. కేసీఆర్‌ చర్యలతో మూడేళ్లు ఆలస్యమైంది. రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు రూ.22 వేల కోట్లకు చేరింది. కేసీఆర్‌ వల్లే ఎల్‌అండ్‌టీకి తీవ్ర నష్టాలు వచ్చాయి’’ అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌వోసీ ఇస్తే కేంద్రం వాటా లేకుండానే వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నిధులు విడుదల చేయించడానికి, ఎన్వోసీ ఇప్పించడానికి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్‌ రెడ్డి బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొదటి విడతను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేస్తే తప్ప 2వ విడత విస్తరణకు అవకాశం లేదని చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు 50 శాతం కేంద్రం భరిస్తోందని చెబుతున్న విషయమే వాస్తవమైతే అందుకు సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు.

Updated Date - Jun 16 , 2026 | 06:16 AM