ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తాం..
ABN , Publish Date - Jan 23 , 2026 | 08:41 AM
భవిష్యత్ అవసరాలకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
- భవిష్యత్ అవసరాలకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: నగరం విస్తరిస్తోందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో 1.40 ఎకరాల ఖాళీ స్థలంలో థీమ్ పార్కు అభివృద్ధి చేయాలని సీఎం జీహెచ్‌ఎంసీని ఆదేశించారు.
ఈ మేరకు ఏర్పాటు చేసిన చిల్డ్రన్ ప్లే పార్కును ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అర్వీ కర్ణన్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం పార్కులో ఆట స్థలాలు, టెన్నిస్ కోర్టు, యోగా, వాటర్ స్టోరేజీ, గార్డెన్ ప్రాంతాలను పరిశీలించారు. మేయర్‌తో కలిసి టెన్నిస్ ఆడి అధికారులను ఉత్సాహపరిచారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ. 3.10 కోట్ల నిధులతో పార్కును అభివృద్ధి చేసినట్టు చెప్పారు.

పది లక్షల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసే స్టోరేజ్ ప్లాంట్, వాకింగ్ ట్రాక్, యోగా, టెన్నిస్ కోర్టు వంటి సదుపాయాలు కల్పించినట్టు పేర్కొన్నారు. ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తామని, నగరంలో ఇలాంటి పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్టు వివరించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు పార్కును సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!
Read Latest Telangana News and National News