వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 08:16 AM
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉత్సవ విశేషాలుతెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి తొలిబోనం సమర్పించారు.
సికింద్రాబాద్, రాంగోపాల్ పేట, బంజారాహిల్స్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. ఫలహార బండ్ల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలతో లష్కర్ పురవీధులు శోభాయమానంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో ఆలయానికి రాగా.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం మహంకాళి అమ్మవారికి రేవంత్‌రెడ్డి పూజలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు.
రాష్ట్ర మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, పవన్‌ఖేరా, ఎమ్మెల్యేలు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, దానం నాగేందర్, సీహెచ్.మల్లారెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, ఎన్.శ్రీగణేష్, నవీన్‌యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హన్మంతరావు, హర్కర వేణుగోపాల్ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని, అందరికీ శుభం చేకూర్చాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నట్టు ప్రజా ప్రతినిధులు, నేతలు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలవాలని అమ్మవారిని వేడుకున్నానని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, రైతులు సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నామని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల జాతరను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇలా అవమానిస్తారా ?
గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ప్రస్తుత ప్రభుత్వం బోనాల జాతరలో తమను అవమానించిందని జోగినిలు శ్యామల, నిశాక్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగిని శ్యామల మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు కేటాయించిన సమయానికి ఆలయానికి వస్తేనే తోపులాట జరిగిందని, తాను తీసుకొచ్చిన ఒడి బియ్యం కింద పడిపోయిందని రోదిస్తూ, స్పృహ తప్పి పడిపోయారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని నిశాక్రాంతి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పొన్నం బోనాల విందులో సీఎం రేవంత్
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికార నివాసంలో ఆదివారం విందు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విందుకు హాజరయ్యారు. సీఎం రేవంత్‌తోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్, సీతక్క, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి, వాకిటి శ్రీహరి, అజారు ద్దీన్, లక్ష్మణ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కూడా విందులో పాల్గొన్నారు. విందు అనంతరం సీఎం రేవంత్.. మంత్రి పొన్నం కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.
రంజాన్‌కు రూ.33 కోట్లు.. బోనాలకు రూ.20 కోట్లేనా?: బండి సంజయ్
రాష్ట్రంలో హిందూ పండుగలు, ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులంతా బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. 'రంజాన్ పండుగ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు ఇచ్చింది. 80 శాతానికిపైగా హిందువులు నిర్వహించుకునే బోనాల ఉత్సవాలకు మాత్రం రూ.20 కోట్లు మాత్రమే ఇస్తారా?' అని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బోనాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మంత్రులు, సీఎం ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని వెళితే సరిపోతుందా? అని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ అంటేనే ముస్లిం.. ముస్లిం అంటేనే కాంగ్రెస్‘ అని సాక్షాత్తు సీఎం చెప్పారంటే హిందువుల పట్ల ప్రభుత్వానికి ఎంత చులకన ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..