Share News

ఆధార్‌తో.. అధికారికంగా ఆస్తులు హాంఫట్‌!

ABN , Publish Date - Aug 03 , 2026 | 07:20 AM

‘ఆధార్‌’ భద్రతనే ప్రశ్నార్థకం చేస్తున్న మోసాలివి! ‘అత్యంత కట్టుదిట్టం, పటిష్ఠం’ అని భావిస్తున్న యూఐడీఏఐ డేటాకే తూట్లు పొడుస్తున్న వైనమిది! అన్నింటికీ ‘ఆధార్‌’ను ప్రామాణికంగా పరిగణిస్తున్న రోజుల్లో... ఆ ఆధార్‌నే గోల్‌మాల్‌ చేస్తూ ఆస్తులు కొట్టేస్తున్న బడా మోసాలు బయటపడ్డాయి.

ఆధార్‌తో.. అధికారికంగా ఆస్తులు హాంఫట్‌!
Aadhaar Fraud

  • కొత్త దందాకు తెరలేపిన అక్రమార్కులు..

  • ఆధార్‌ తమది.. వివరాలు ఆస్తి యజమానివి

  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోనే వివరాలు నమోదు..

  • సరిపోలుతున్న బయోమెట్రిక్స్‌

  • రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లు..

  • తిరుపతి సహా పలుచోట్ల బయటపడ్డ మోసాలు

  • ఆధార్‌లో అక్షరం మార్చాలన్నా ఎంతో కష్టం..

  • పేరు, తండ్రి పేరు ఎలా మారుతోంది?

  • ఇంకెన్ని అవసరాలకు ఈ మోసాలు చేస్తున్నారో?..

  • లోతుగా విచారణ జరిగితేనే గుట్టురట్టు


ఆస్తి మీది! ‘ఆధార్‌’ నంబర్‌ మాత్రం మీది కాదు! దానిపై ఉన్న పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలు మాత్రం మీవే! ‘ఇంకెవరో’ ఇచ్చిన ఆధార్‌ నంబర్‌ కొట్టగానే.. యూఐడీఏఐ వెబ్‌సైట్‌ నుంచే రిజిస్ట్రేషన్‌ శాఖలోని సీఏఆర్‌డీ డేటాలోకి మీ వివరాలు వచ్చేస్తున్నాయి. వేలి ముద్ర కూడా సరిపోతోంది. మీ ఆస్తి చేతులు మారుతోంది.


(తిరుపతి - ఆంధ్రజ్యోతి): ‘ఆధార్‌’ భద్రతనే ప్రశ్నార్థకం చేస్తున్న మోసాలివి! ‘అత్యంత కట్టుదిట్టం, పటిష్ఠం’ అని భావిస్తున్న యూఐడీఏఐ డేటాకే తూట్లు పొడుస్తున్న వైనమిది! అన్నింటికీ ‘ఆధార్‌’ను ప్రామాణికంగా పరిగణిస్తున్న రోజుల్లో... ఆ ఆధార్‌నే గోల్‌మాల్‌ చేస్తూ ఆస్తులు కొట్టేస్తున్న బడా మోసాలు బయటపడ్డాయి. ఒక్కచోట కాదు... ఒక్క సంఘటన కాదు! రాష్ట్రవ్యాప్తంగా అనేక సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అసలు యజమానికి తెలియకుండానే... ఆస్తులు బదిలీ అయ్యాయి. ఆధార్‌ నంబర్‌... పేరూ, తండ్రి పేరూ, వేలిముద్రలు సరిపోలుతుండటంతో ఏమాత్రం అనుమానం లేకుండా సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. కొనేవాళ్లు కొంటున్నారు.


ఎలా జరుగుతోంది?

ప్రస్తుత ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ‘ఆధార్‌’ అత్యంత కీలకం! సేల్‌ డీడ్‌ మొత్తం సిద్ధం చేసి... సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లాక, విక్రేత బయో మెట్రిక్స్‌ (వేలిముద్ర) తీసుకుంటారు. వెంటనే... ఆ వ్యక్తి ‘ఆధార్‌’ వివరాలు రిజిస్ట్రేషన్‌ శాఖతో సీడ్‌ అయిన డేటాబేస్‌లో కనిపిస్తాయి. అందులో పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలన్నీ సరిపోలితే... భూమికి అసలు యజమాని ఆ వ్యక్తే అని నిర్ధారించుకుని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. లెక్క ప్రకారం చూస్తే... ఇందులో ఎలాంటి మోసం జరగడానికి వీల్లేదు. అయినా సరే... మోసం జరిగిపోతోంది! ఎలాగంటే... ఏమైనా మార్చొచ్చు కానీ... బయో మెట్రిక్స్‌ మార్చడం అసాధ్యం! మరి... పేరు, వివరాలు మార్చడం అసాధ్యం కాదు కదా! ఇక్కడ జరుగుతున్న మోసం ఇదే! సోదాహరణంగా చెబితే... తిరుపతి శ్రీనగర్‌ కాలనీలోని ఒక స్థలానికి మునికృష్ణ అనే వ్యక్తి అసలు యజమాని! కానీ... ఏసోబు అనే మరో వ్యక్తి రంగంలోకి దిగాడు. మునికృష్ణ స్థలానికి చెందిన డాక్యుమెంట్‌ను ఎలాగో సంపాదించాడు. తన సొంత ఆధార్‌లో... పేరు, ఇతర వివరాలన్నింటినీ సదరు డాక్యుమెంట్‌లో ఉన్నట్లుగానే మార్చుకున్నాడు. అంటే... ఆధార్‌ నంబర్‌ ఏసోబుది! దానిపై కనిపించే వివరాలన్నీ మునికృష్ణవి! ‘నేనే మునికృష్ణను. ఈ స్థలం నాదే! దీనిని అమ్మేస్తున్నా’ అని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లి... బయోమెట్రిక్స్‌ ఇస్తే ఎంచక్కా యాక్సెప్ట్‌ చేస్తుంది. ఎందుకంటే, ఆ ఆధార్‌ ఏసోబుదే! వివరాలు మాత్రం డాక్యుమెంట్‌లో ఉన్నట్లుగా మునికృష్ణవి కనిపిస్తాయి. ఇక సబ్‌ రిజిస్ట్రార్‌కు సందేహం వచ్చే అవకాశమే లేదు! రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేస్తారు! మరి... ఫొటో మాటేమిటి అంటారా? తొలినాళ్లలో జారీ చేసిన ‘ఆధార్‌’ ఫొటోల్లో స్పష్టతే లేదు! ‘ఇది నేనేనా?’అని ఎవరికి వారు ఆశ్చర్యపోయే పరిస్థితి. పైగా... సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జిరాక్స్‌ కాపీ ఇస్తారు. అక్కడంతా హడావుడి! ‘ఫొటో మ్యాచ్‌ కాలేదు’ అని రిజిస్ట్రేషన్‌ ఆపేసేంత సీన్‌ ఎక్కడిది! ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఒరిజనల్‌ డాక్యుమెంట్‌తో పనిలేదు. లింక్‌ డాక్యుమెంట్లూ అక్కర్లేదు. ‘మరేం పర్వాలేదు’ అని కొనుగోలుదారుడు ముందుకొస్తే, రిజిస్ట్రేషన్‌ జరిగిపోతోంది. అంటే... ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ అసలు యజమాని దగ్గర ఉండగానే, ఇక్కడ ఆస్తి చేతులు మారుతోంది.


మోసంలోనూ ‘ముందుచూపు’

ఆస్తులు కొట్టేస్తున్న మోసగాళ్లు... చాలా ‘ముందుచూపు’తో వ్యవహరిస్తున్నారు. అప్పుడెప్పుడో ‘ఆధార్‌’ రాకముందు రిజిస్టర్‌ అయిన ఆస్తులే వారి టార్గెట్‌! అది కూడా... రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన లేఅవుట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ లేఅవుట్‌లోని ప్లాట్ల క్రయవిక్రయాలకు సంబంధించిన ఈసీలను ఆన్‌లైన్‌ ద్వారా తీసుకుంటున్నారు. లేఅవుట్‌ వేసిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసి, ఆ తర్వాత ఎటువంటి లావాదేవీలు జరగని స్థలాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఆ స్థలం సర్వే నంబరుకు సంబంధించిన నకలును ఆన్‌లైన్‌ ద్వారా తీసుకుంటున్నారు. ఆ డాక్యుమెంటులోని వ్యక్తి పేరు, తండ్రి పేరు వంటి వివరాలన్నీ చూసి... తమ సొంత ఆధార్‌లోని వివరాలను దాని ప్రకారం యూఐడీఏఐలో మార్పులు చేయిస్తున్నారు. ఆ తర్వాత ఆ స్థల యజమాని తామే అని పేర్కొంటూ అమ్మకాలు చేస్తున్నారు. స్థలం అసలు యజమాని గుర్తించే దాకా ఈ మోసం బయటపడదు.


ఇది సాధ్యమేనా?

‘మోసపూరిత ఉద్దేశంతో ఆధార్‌లో పేరూ, ఊరూ అధికారికంగా మార్చడం సాధ్యమేనా?’... ఎవరిలోనైనా తలెత్తే ప్రశ్న ఇది! నిజానికి... దీనికి ‘అసాధ్యం’ అనే సమాధానమే వస్తుంది! కానీ, మోసగాళ్లు ఈ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నారు. మన ‘ఆధార్‌’లో నమోదైన పేరులో(స్పెల్లింగ్‌) ఒకటి రెండు అక్షరాలు మార్చుకోవడం మాత్రమే కుదురుతుంది. అలాంటిది... పేరు, తండ్రి పేరు, వయసు, వ్యక్తిగత వివరాలను ఎలా మార్చగలుగుతున్నారు? పేరు పూర్తిగా మార్చాలంటే... ‘ఫలానా వ్యక్తి తన పేరు ఇలా మార్చుకున్నాడు’ అని ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అక్రమార్కులు తమ ఆధార్‌ గుర్తింపు కార్డు నంబరును అలాగే ఉంచుకొని... ఇంటి పేరు, పేరు, చిరునామాను పూర్తిగా మార్చేశారు. ఇదేదో ఫోటోషాప్‌లో చేసిన మార్పులు కాదు! యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోనూ మారిన వివరాలే కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖతో సీడ్‌ అయిన డేటాబేస్‌లో అదే కనిపిస్తోంది. ఇది ఎలా జరుగుతోంది? ప్రస్తుతానికి ఇది భేతాళ ప్రశ్న! దీనికి సమాధానం కనుక్కోవాల్సింది పోలీసులు, యూఐడీఏఐ అధికారులే!


ఎవరా దొంగలు?

‘ఆధార్‌’ మోసంతో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కానీ... ఎక్కడికక్కడ, విడివిడిగానే ఈ కేసులను చూస్తున్నారు. అసలు మోసం ఎక్కడ, ఎలా జరుగుతోందనే అంశంపై లోతైన దర్యాప్తు మాత్రం జరగడం లేదు. ‘అన్నింటికీ ఆధార్‌’ అంటున్న ఈ రోజుల్లో... ఇది తేలిగ్గా తీసుకునే వ్యవహారం కానే కాదు! ఇంకా ఇలాంటివి ఎన్ని రాష్ట్రాల్లో, ఇంకెన్ని జరిగాయో! ’ఆధార్‌’లోని వివరాలను మార్చేసి... ఇంకెన్ని రకాల మోసాలు చేస్తున్నారో?


ఇవీ మోసాలు...

  • తిరుపతి శివార్లలోని మంగళం పరిధిలో తుడా (తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ) 1992లో 388 ఎకరాల పరిధిలో లేఅవుట్‌ వేసింది. ఇందులో తిరుపతికి చెందిన ఏ. బాలాజీ 388 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆయన ఇటీవల ఈసీలో ఆస్తి మరొకరు పేరు మీద ఉన్నట్లు గుర్తించి విస్తుపోయారు. పరుగుపరుగున సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లి ఆరా తీయగా... ‘‘ఆ స్థలాన్ని రెండుగా విభజించి విక్రయించింది మీరే కదా! ఆధార్‌ బయోమెట్రిక్స్‌, పేరూ సరిపోలడంతో రిజిస్ర్ట్రేషన్‌ పూర్తి చేశాం’’ అని చెప్పారు.

  • మంగళం పరిధిలో తుడా లేఅవుట్‌లోనే ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి తన తల్లి అరుణమ్మకు 2013లో కొంత స్థలాన్ని దానంగా రాసి ఇచ్చి రిజిస్ర్టేషన్‌ చేశారు. అరుణమ్మకు తెలియకుండానే... ఆ ఆస్తిని ఇంకెవరో విక్రయించారు. ఇక్కడా జరిగింది అదే... ‘ఆధార్‌’ మోసం! దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

  • తిరుపతి శ్రీనగర్‌ కాలనీ ప్రాంతంలో మునికృష్ణ పేరుతో స్థలం ఉంది. గతేడాది ఆయన పేరుతో ఆధార్‌ గుర్తింపు కార్డును సమర్పించి... భూమిని విక్రయించారు. మునికృష్ణ పేరుతో ఆధార్‌ను సృష్టించి భూమిని విక్రయించిన వ్యక్తి పేరు ఏసోబుగా అధికారులు గుర్తించారు.

  • చెన్నైకి చెందిన మమత 1987లో ఏర్పేడు మండల పరిధిలో స్థలాన్ని కొనుగోలు చేశారు. 2024లో ఆ స్థలాన్ని ఇంకెవరో విక్రయించారు. అమ్మకం సమయంలో మమత పేరుతో ఆధార్‌ కార్డును సమర్పించడం, బయోమెట్రిక్స్‌ మ్యాచ్‌ కావడంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సాఫీగా పూర్తయింది. ఇటీవల తన స్థలాన్ని విక్రయించేందుకు అసలు మమత యత్నించగా తన పేరుతో అమ్మినట్లు గుర్తించారు. దీనిపైనా కేసు నమోదైంది.

Updated Date - Aug 03 , 2026 | 07:37 AM