Share News

బై బై.. గ్లాస్గో అహ్మదాబాద్‌లో కలుద్దాం

ABN , Publish Date - Aug 03 , 2026 | 05:24 AM

కామన్వెల్త్‌ క్రీడా సంగ్రామానికి తెరపడింది. గత క్రీడల స్థాయిలో కాకున్నా భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శనతో అలరించారు. దేశానికి కచ్చితంగా పతకాలు తెచ్చిపెట్టే షూటింగ్‌, రెజ్లింగ్‌, బ్యాడ్మింటన్‌, హాకీలాంటి క్రీడాంశాలు...

బై బై.. గ్లాస్గో అహ్మదాబాద్‌లో కలుద్దాం

  • ముగిసిన కామన్వెల్త్‌ క్రీడలు

  • భారత్‌ ఖాతాలో 13 స్వర్ణాలు

  • 39 పతకాలతో నాలుగో స్థానం

  • పదిరోజులుగా క్రీడా

  • భిమానులను అలరించిన గ్లాస్గో

కామన్వెల్త్‌ క్రీడా సంగ్రామానికి తెరపడింది. గత క్రీడల స్థాయిలో కాకున్నా భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శనతో అలరించారు. దేశానికి కచ్చితంగా పతకాలు తెచ్చిపెట్టే షూటింగ్‌, రెజ్లింగ్‌, బ్యాడ్మింటన్‌, హాకీలాంటి క్రీడాంశాలు ఈసారి లేకున్నా.. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలతో పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల తర్వాత జరిగే తదుపరి క్రీడలకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా 2030 కామన్వెల్త్‌ క్రీడలు జరగనున్నాయి.

గ్లాస్గో: కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆఖరి రోజైన ఆదివారం భారత్‌ నుంచి జూడో, సైక్లింగ్‌ విభాగాల్లో ఏడుగురు అథ్లెట్లు పోటీ పడినా ఒక్క పతకం కూడా సాధించలేకపోయారు. జూడోకా ఇష్రూప్‌ నారంగ్‌ కాంస్య పోరులో నిలిచినా పతకం మాత్రం నెగ్గలేకపోయింది. ఇక, 16 ఏళ్ల పారా సైక్లిస్ట్‌ లిషో దాస్‌ అనుభవజ్ఞులైన అంతర్జాతీయ సైక్లి్‌స్టలతో పోటీ పడి ఆఖరున నిలిచింది. దీంతో భారత్‌ మొత్తంగా 39 పతకాలతోనే సంతృప్తి పడింది. ఆస్ట్రేలియా 171 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 2022 బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో భారత్‌ 61 (22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు) పతకాలు సాధించడం విశేషం.

జూడోలో చేజారిన కాంస్యం

మహిళల 78 కేజీల విభాగంలో ఇష్రూప్‌ నారంగ్‌ కాంస్య పతక పోరులో పోరాడినా ఫలితం లేకపోయింది. కెనడాకు చెందిన కోరలీ గాడ్‌బౌట్‌ తనను ఓడించింది. ఆరంభంలోనే నారంగ్‌ను కోరలీ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో యూకో ద్వారా ఆమెకు పాయింట్‌ వచ్చినా, తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ప్రత్యర్థి ఎత్తుగడల ముందు నారంగ్‌ ఆత్మరక్షణలో పడింది. అలాగే నారంగ్‌కు 2 ఎల్లో పెనాల్టీ కార్డులు చూపినా, నాలుగు నిమిషాల నిర్ణీత సమయంలో పాయింట్‌ కోల్పోకుండా జాగ్రత్త పడింది. దీంతో గోల్డెన్‌ సమయం అనివార్యమైంది. ఇందులో కెనడా జూడోకానే మొదట యూకో సాధించడంతో ఇష్రూ్‌పనకు నిరాశే ఎదురైంది. అంతకుముందు ప్రీకార్డర్స్‌లో నికోల్‌ ఉడ్‌ (స్కాట్లాండ్‌)పై నెగ్గిన ఇష్రూప్‌.. క్వార్టర్స్‌లో ఎమ్మా రీడ్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడింది. అయితే రెపిచేజ్‌ రౌండ్‌లో జార్జికా వెస్లీ (కామెరూన్‌)పై గెలిచి కాంస్య పోరులో నిలిచింది. ఇక పురుషుల విభాగంలో యష్‌ గంగాస్‌ (+100కేజీ), అవతార్‌ సింగ్‌ (-100కేజీ) రౌండ్‌ ఆఫ్‌ 16లోనే ఓడారు. ఓవరాల్‌గా భారత జూడోలు 2 స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం దక్కించుకున్నారు.


సైక్లింగ్‌లో నిరాశే

మధ్యాహ్నం ఆరంభమైన సైక్లింగ్‌లో నలుగురు అథ్లెట్లు బరిలోకి దిగి నా పతకం దక్కలేదు. మొదట పురుషుల 40 కిలో మీటర్ల పాయింట్స్‌ రేసు హీట్‌ 1లోనే హర్ష్‌వీర్‌ సింగ్‌ వైదొలిగాడు. అయితే దినేశ్‌ కుమార్‌ తొలి రౌండ్‌ దాటినా హీట్‌ 2లో 11వ స్థానంలో నిలిచి త్రుటిలో ఫైనల్స్‌ అవకాశాన్ని కోల్పోయాడు. పురుషుల 1000మీ. టైమ్‌ ట్రయల్‌ ఫైనల్లో రొనాల్డో సింగ్‌ 20వ స్థానంలో నిలవడంతో ట్రాక్‌ సైక్లింగ్‌లో పోరాటం ముగిసింది. ఇక రాత్రి జరిగిన పారా సైక్లింగ్‌లో 16 ఏళ్ల లిషో దాస్‌ మహిళల సీ4-సీ5 1000 మీ. టైమ్‌ ట్రయల్‌ ఫైనల్‌ను 1:34.410 టైమింగ్‌తో ఆశాజనకంగా ఆరంభించింది. కానీ రేసు పూర్తయ్యేసరికి ఆరో స్థానంతో ఆఖరున నిలిచింది.

‘ఈశాన్యం’ లేని ఇండియా మ్యాప్‌

గ్లాస్గోలో హోటల్‌పై బాక్సర్ల ఆగ్రహం

గ్లాస్గోలోని ఓ భారత రెస్టారెంట్‌ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పది పతకాలు సాధించిన బాక్సర్లు తమ విజయోత్సవంలో భాగంగా అక్కడి ‘మిస్టర్‌ సింగ్స్‌ ఇండియా’ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ వారికి భారతదేశ పటంతో కూడిన న్యాప్‌కిన్‌ను అందించగా, అందులో నార్త్‌ ఈస్ట్‌ భాగం పూర్తిగానూ, కశ్మీర్‌లో సగభాగం లేకపోవడంతో అథ్లెట్లు షాక్‌ అయ్యారు. ముఖ్యంగా ఈ విషయమై అసోం బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ ఆ రెస్టారెంట్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ‘దేశంలోని ప్రతీ భాగం ముఖ్యమైందే. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా మీ చర్య నన్నెంతో బాధ పెట్టింది. హోటల్‌ బయట బోర్డుపై కూడా మ్యాప్‌ అలానే ఉంది. దయచేసి ఈ తప్పును సరిదిద్దుకోండి’ అని సూచించింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో మిస్టర్‌ సింగ్స్‌ యాజమాన్యం సరైన మ్యాప్‌ను పెడతామంటూ, తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను డిలీట్‌ చేసింది.

భారత్‌లో క్రీడలు..

శతాబ్ది ఉత్సవాలు

గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. నాలుగేళ్ల తర్వాత జరిగే తదుపరి క్రీడలకు అహ్మదాబాద్‌ నగరం ఆతిథ్యమివ్వనుండడంతో ప్రస్తుత క్రీడల ముగింపు ఉత్సవంలో కామన్వెల్త్‌ క్రీడల పతాకాన్ని భారత్‌కు అప్పగించారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్లాస్గోలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి హర్ష్‌ సంఘ్వీ హాజరై క్రీడల పతాకాన్ని స్వీకరించారు. 1930లో కెనడాలోని హామిల్టన్‌లో తొలి కామన్వెల్త్‌ క్రీడలు జరిగాయి. 2030 నాటికి సరిగ్గా వందేళ్లు పూర్తవుతాయి. దీంతో ఆ ఏడాది అహ్మదాబాద్‌లో జరిగే ఈ క్రీడలు శతాబ్ది ఉత్సవాలుగా నిలవనున్నాయి.


విజేతలకు ఘనస్వాగతం

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లు స్వదేశానికి చేరుకుంటున్నారు. అలాగే వెయిట్‌లిఫ్టర్లు మీరాబాయి చాను, వల్లూరి అజయ్‌ బాబు, లవ్‌ప్రీత్‌ సింగ్‌లకు ఆదివారం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ‘తొలిసారిగా గేమ్స్‌లో పాల్గొని మెడల్‌ సాధించాను. ఒత్తిడి ఉన్నప్పటికీ రాణించగలిగాను. ఈ విజయాన్ని కోచ్‌, నా తండ్రికి అంకితం ఇస్తున్నాను. 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా లక్ష్యం’ అని రజతం సాధించిన లిఫ్టర్‌ అజయ్‌ తెలిపాడు. ఇతర అథ్లెట్లు లవ్‌ప్రీత్‌, వింద్యా రాణి, రిషికాంత సింగ్‌, ముత్తుపాండి, హర్జీందర్‌ కౌర్‌ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

కామన్వెల్త్‌ పతకాల పట్టిక

దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం

ఆస్ట్రేలియా 70 45 56 171

ఇంగ్లండ్‌ 29 45 36 110

కెనడా 19 20 23 62

భారత్‌ 13 17 9 39

స్కాట్లాండ్‌ 13 9 17 39

న్యూజిలాండ్‌ 10 14 12 36

నైజీరియా 10 7 7 24

జమైకా 10 4 5 19

వేల్స్‌ 9 10 12 31

మలేసియా 8 3 5 16

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 05:24 AM