శిథిలావస్థ!
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:52 AM
నగరంలో ప్రత్యేకత కలిగిన టౌన్ సర్వే రిజర్వాయర్ (టీఎస్‌ఆర్) కాంప్లెక్స్ దుకాణ సముదాయం శిథిలావస్థకు చేరింది.
కూలుతున్న టీఎస్‌ఆర్ కాంప్లెక్స్
ఒకప్పుడు నగరంలో లాండ్‌మార్క్‌గా వెలుగులు
నిర్వహణాలోపంతో అధ్వానం
గ్రౌండ్‌ఫ్లోర్ మినహా పైఅంతస్థులోని దుకాణాలన్నీ ఖాళీ
పట్టించుకోని జీవీఎంసీ అధికారులు
విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ప్రత్యేకత కలిగిన టౌన్ సర్వే రిజర్వాయర్ (టీఎస్‌ఆర్) కాంప్లెక్స్ దుకాణ సముదాయం శిఽఽథిలావస్థకు చేరింది. ఒకప్పుడు నగరంలో లాండ్‌మార్క్‌గా వెలుగొందిన ఈ భవనం నిర్వహణలోపంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితికి చేరడంపై నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో సుమారు 40 ఏళ్ల కిందట టీఎస్‌ఆర్ కాంప్లెక్స్ పేరుతో 80 దుకాణాలు ఉండేలా జీవీఎంసీ జీ+1 భవన నిర్మాణాన్ని చేపట్టింది. అప్పట్లో విశాఖలో అతిపెద్ద షాపింగ్‌కాంప్లెక్స్ కావడంతో ప్రత్యేకగుర్తింపు పొందింది. ఎవరైనా తమవారిని లేదంటే స్నేహితులను కలవాలనుకుంటే టీఎస్‌ఆర్ కాంప్లెక్స్ వద్దకు రావాలి అని చెప్పుకునేవారు. అలాంటి షాపింగ్‌కాంప్లెక్స్‌లో దుకాణాల కోసం వ్యాపారులు పోటీపడేవారు. కాలక్రమేణా షాంపింగ్‌కాంప్లెక్స్ నిర్వహణపై జీవీఎంసీ నిర్లక్ష్యం వహించడంతో మరమ్మతులుచేసే పరిస్థితిలేకుండాపోయింది. శ్లాబ్ పెచ్చులు ఊడి పడిపోతుండడంతో ఏక్షణంలో కూలిపోతోందో అన్నట్టు మారింది. షాపింగ్ కాంప్లెక్స్‌లోని పైఅంతస్థులోని దుకాణాలన్నింటినీ వ్యాపారులు ఖాళీ చేసేశారు. ప్రస్తుతం జీవీఎంసీ ఆధ్వర్యంలో నిరాశ్రయుల కేంద్రం మాత్రమే నడుస్తోంది. టీఎస్‌ఆర్ కాంప్లెక్స్ పరిసరాల్లో ప్రైవేటు షాపింగ్ కాంప్లెక్స్‌లు పెరిగిపోవడంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని దుకాణాలకు గిరాకీ తగ్గిపోయుంది. కొన్నేళ్లుగా కేవలం చెప్పుల దుకాణాలు మాత్రమే నడుస్తుండగా, కొన్ని ఖాళీగా ఉండిపోగా మరికొన్నింటిని వస్త్ర, జ్యువెలరీ, పండ్లరసాల వ్యాపారులు నిర్వహిస్తున్నారు.
నగరం నడిబొడ్డున ఉన్న దుకాణసముదాయాన్ని మరమ్మతులుచేసినా, ఆ భవనాన్ని కూల్చివేసి కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించినా జీవీఎంసీకి భారీగా దాయం సమకూరడంతో పాటు ద్వారకానగర్ కూడలిని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రత్యేక దృష్టిసారించి, టీఎస్‌ఆర్‌కాంప్లెక్స్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు.