Share News

బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిలుపై నేడు నిర్ణయం

ABN , Publish Date - May 15 , 2026 | 04:55 AM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌ తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్‌.....

బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిలుపై నేడు నిర్ణయం

  • బాధితురాలి రెండు బర్త్‌ సర్టిఫికెట్లలో ఏది నిజం?

  • వాదనలన్నీ విన్నాకే ముందస్తు బెయిల్‌పై నిర్ణయం

  • విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు

  • భగీరథ్‌ కోసం కొనసాగుతున్న పోలీసు గాలింపు

  • బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తున్న వారిపై పోక్సో కేసు!

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌ తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్‌(ఐఏ)పై శుక్రవారం ఉత్తర్వులు వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, బాధితురాలికి సంబంధించిన రెండు బర్త్‌ సర్టిఫికెట్లలో ఏది వాస్తవమో తేల్చాలని సూచించింది. ప్రధాన పిటిషన్‌ అయిన ముందస్తు బెయిల్‌పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తనపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై విడుదల చేసేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బండి భగీరథ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ టీ మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అయితే, ఈ కేసులో సత్వర విచారణపై బాధితురాలి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయగా.. బాధితురాలి తరఫు వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల తీరుపై ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేసింది. భగీరథ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విచారణకు హాజరుకావడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి భగీరథ్‌ సిద్ధంగా ఉన్నారని, తాము కేసును కొట్టేయమని కోరడం లేదని, అరెస్టు నుంచి రక్షణ మాత్రమే కోరుతున్నామని తెలిపారు. సుప్రీం కోర్టు గత తీర్పుల ప్రకారం ఈ కేసులో భగీరథ్‌ బెయిల్‌కు అర్హుడని, ప్రస్తుతానికి మధ్యంతర ఉపశమన ఉత్తర్వులివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ‘బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ముందుగా కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత సెక్షన్లు మార్పు చేశారు’ అని చెప్పారు. బాధితురాలి తరఫున న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. నిందితుడు పరారీలో ఉంటూ ముందస్తు బెయిల్‌ కోరడం విడ్డూరంగా ఉందని, అంతేకాక అంత అత్యవసరం బెయిల్‌ కోరడం సరికాదన్నారు.


మధ్యంతర ఉపశమన ఉత్తర్వులిస్తే ముందస్తు బెయిల్‌ ఇచ్చినట్లేనని తెలిపారు. నిందితుడికి బెయిల్‌ వస్తే బాధితురాలు, ఆమె కుటుంబాన్ని వేధింపులకు గురి చేసే అవకాశం ఉందన్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్‌ మధ్యంతర అప్లికేషన్‌పై వాదనలు విని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ప్రధాన పిటిషన్‌లో విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. కాగా, మధ్యంతర రక్షణపై తీర్పును న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో ఇప్పటికే పోలీసులు ఇచ్చిన నోటీసులకు విచారణకు తప్పక హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బండి భగీరథ్‌ శుక్రవారం పోలీసు విచారణకు వస్తాడా? లేదా కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతాడా ? అనేది చూడాలి.

సోషల్‌ మీడియాపై పోలీసుల నజర్‌

బండి భగీరథ్‌పై నమోదైన కేసులో బాధిత బాలికపై సోషల్‌ మీడియాలో కొందరు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై పోలీసులు దృష్టి సారించారు. పోక్సో కేసు విచారణ జరుగుతున్నపుడు ఆ బాలిక ఫోటోలు, వీడియోలు, ఆమె గుర్తింపునకు సంబంధించిన వివరాలను ఎలకా్ట్రనిక్‌, డిజిటల్‌, ప్రింట్‌ మీడియాలో ఏ విధంగా వాడినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బాధితురాలిని కించపరిచేలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టిన యూజర్లను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా మైనర్‌ బాలిక సమాచారాన్ని వైరల్‌, షేర్‌, రీపోస్టు చేసిన వారిపై పోక్సో కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

భగీరథ్‌ కోసం కొనసాగుతున్న గాలింపు

పరారీలో ఉన్న భగీరధ్‌ కోసం గాలింపు కొనసాగుతోందని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ ఉన్నతాధికారులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, కరీంనగర్‌ ప్రాంతాల్లో అతని ఆచూకి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. భగీరధ్‌ స్నేహితుల ఇళ్లపై కూడా నిఘా పెట్టాయి. మరోవైపు తనపై లైంగికదాడి యత్నం జరిగిందని బాధితురాలు పేర్కొన్న ప్రదేశాల్లో గురువారం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించిన పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. అలాగే, భగీరథ్‌ స్నేహితులు, బాలిక మిత్రుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. బాలిక వయస్సుకు సంబంధించి ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో జారీ అయిన బర్త్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా ఆమె వయస్సును నిర్ధారించే పరీక్షలను ప్రభుత్వ వైద్యుల సమక్షంలో పోలీసులు చేపట్టినట్లు తెలుస్తోంది.

Updated Date - May 15 , 2026 | 05:47 AM