వైఎస్సార్‌ను తిట్టిన నోటితోనే పొగడ్తలా..? జీవన్ రెడ్డిపై ఆది శ్రీనివాస్ విసుర్లు
ABN , Publish Date - Jun 13 , 2026 | 08:21 PM
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
వేములవాడ (రాజన్న సిరిసిల్ల)జూన్ 13: కాంగ్రెస్ పార్టీని వీడి, ఇటీవల బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ వీడిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరారు
వేములవాడ పట్టణంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ఆరోపిస్తూ బయటకు వెళ్లిన జీవన్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరారు. పార్టీ వీడిన వారు కాంగ్రెస్ విధానాలను విమర్శించే స్థాయికి ఎలా వచ్చారు?' అని ప్రశ్నించారు. 'మీరు లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆగిపోతుందా?' అని ఆయన సూటిగా నిలదీశారు.
వైఎస్సార్‌ను తిట్టిన నోటితోనే పొగడ్తలా?
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఆయనపై నిప్పులు చెరిగిన జీవన్ రెడ్డి, నేడు పొగడ్తలు కురిపించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన చేసిన విమర్శలకు, ఈ రోజు ఆయన తీరుకు వైఎస్సార్ ఆత్మ కూడా ఘోషిస్తుందని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వరద కాల్వ జీవనదిలా మారిందని, తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డిది తప్పుడు వైఖరి అని జీవన్ రెడ్డి చేస్తున్న వాదనలను ఆది శ్రీనివాస్ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే జీవన్ రెడ్డి ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనులు చేస్తుంటే, ఓర్వలేకనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అజెండాను అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని, పార్టీ మారినంత మాత్రాన వాస్తవాలను వక్రీకరించడం సరికాదని ఆయన జీవన్ రెడ్డికి హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు
అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్