Share News

నిండు కుండలా జలాశయాలు.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు..

ABN , Publish Date - Jul 31 , 2026 | 09:10 AM

తెలుగు రాష్ట్రాల్లో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

నిండు కుండలా జలాశయాలు.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు..
Godavari Floods

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి, కడెం, మేడిగడ్డ బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండగా.. భద్రాచలం, కాళేశ్వరం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద కూడా వరద ప్రవాహం పెరుగుతోంది.


మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 1,16,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1,32,785 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల్లో గోదావరి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు కూడా వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు 5 గేట్లు ఎత్తి 46,747 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు 35,473 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రధాన పుష్కర ఘాట్‌ వద్ద నీటిమట్టం 9.930 మీటర్ల ఎత్తుకు చేరింది. మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుండగా.. అక్కడ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6,79,910 క్యూసెక్కులుగా ఉంది.


ములుగు జిల్లాలో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. వాజేడు మండలం పేరూరు వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. రామన్నగూడెం వద్ద నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చీకుపల్లి-పెద్దగొల్లగూడెం మధ్య ఇసుక వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు పూర్తికాకపోవడంతో ఏర్పాటు చేసిన తాత్కాలిక అప్రోచ్‌ రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో 26 గ్రామాల ప్రజలు నాటు పడవల సహాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 41 అడుగులకు చేరగా.. 8,12,220 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


ఇక, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి స్వల్పంగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 701 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 470 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.269 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 18,445 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.691 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


రాజమహేంద్రవరం వద్ద ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతోంది. బ్యారేజ్‌ నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 10.9 అడుగులకు చేరింది. రాబోయే రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కూడా గోదావరి వరద ప్రభావం కనిపిస్తోంది. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద నదీపాయకు ఏర్పాటు చేసిన తాత్కాలిక గట్టు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడి లంక, గంటిపెదపూడి, బూరుగులంక, అరిగెల వారిపాలెం లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెవెన్యూ అధికారులు పడవలు, లైఫ్‌ జాకెట్లు ఏర్పాటు చేశారు.


నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 1,43,615 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఔట్‌ఫ్లోను ప్రస్తుతం నిలిపివేశారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 830.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 50.2658 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో ఇంకా విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.


ఈ వార్తలు కూడా చదవండి

పెట్టుబడుల ఆకర్షణకు ఏఐ అస్త్రం!

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

Updated Date - Jul 31 , 2026 | 09:31 AM