శంకర్‌దాదా జీహెచ్‌ఎంసీ..!
ABN , Publish Date - Jan 31 , 2026 | 09:06 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటిదొంగలు ఎక్కువయ్యారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన కొంతమంతి అధికారులు వాటిని ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఓ వ్యవహారం అధికారుల పనితీరును ప్రశ్నించేలా చేస్తోంది.
అక్రమ నిర్మాణమని తెలిసీ ప్రొత్సహిస్తున్న డిప్యూటీ కమిషనర్
నిర్మాణాన్ని సీజ్ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశించినా బేఖాతరు
50 గజాల్లో అడ్డదిడ్డంగా 4 అంతస్తులు
హైదరాబాద్: ఆయనకున్నది 50 గజాల స్థలం. అందులోనే అంగుళం వదలకుండా నిర్మాణం చేస్తుండటంతో కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్(GHMC Commissioner) ఆదేశాలతో సిబ్బంది నిర్మాణాన్ని సీజ్ చేసినా నిర్మాణదారు పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని గాయత్రీహిల్స్, రోడ్డు నంబరు 10సిలో ఈహెచ్‌ఎస్‌సీజీ, ఇంటి నంబరు 97/ఎ వెనుక భాగంలో 50 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ హద్దుగా ఉన్న ప్రహరీ ఆనుకొని అంగుళం వదలకుండా నిర్మిస్తున్నారు.
దీన్ని అడ్డుకోవాలని జనవరి 21న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా పనులు ఆగడం లేదు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆ భవన నిర్మాణ పనులు ఆపేయాలని విజిలెన్స్ డీఎస్పీ నరసింహారెడ్డిని ఆదేశించారు. ఆ తరువాత నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీహెచ్‌ఎంసీ చట్టం 1955, సెక్షన్ 461-ఎ కింద సీజ్ చేస్తున్నట్లు నోటీసు అంటించారు. అయినా సెంట్రింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ భవనానికి ఆనుకునే ఉన్న ఇంటికి కిటికీలు కూడా తెరుచుకునే వీలు కూడా లేకుండా నిర్మాణం చేపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

డిప్యూటీ కమిషనర్ అండ!
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలతో భవనాన్ని సీజ్ చేసినా నిర్మాణదారుడు పనులు కొనసాగిస్తున్నాడు. ఇందుకు కారణం జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ ఎన్. శంకర్, కింది స్థాయి అధికారులు, పట్టణ ప్రణాళిక అధికారుల అండదండలు ఉండడమే అని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం వల్ల తన నివాసానికి భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయని మొత్తుకుంటున్నా లెక్కచేయడం లేదని సమీప భవన యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు తనిఖీ చేసి అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని కోరినా నిర్మాణ పనులు ఆగడం లేదని వాపోతున్నారు. చిన్న స్థలంలోనే నిబంధనలకు విరుద్ధంగా నాలుగు అంతస్తుల నిర్మాణానికి నిర్మాణదారు పూనుకున్నారని కాలనీ వాసులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ధరలు రికార్డు స్థాయిలో డౌన్! నేటి రేట్స్ ఇవీ
Read Latest Telangana News and National News