Share News

భారతి సిమెంట్స్‌కు చెక్‌!

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:46 AM

ప్రభుత్వం చట్టపరమైన అంశాలనన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తమకు కేటాయించిన సున్నపురాయి లీజులను ఎలా రద్దుచేస్తారని భారతి సిమెంట్స్‌ ప్రశ్నిస్తోంది.

భారతి సిమెంట్స్‌కు చెక్‌!

  • రద్దుబాటలో సున్నపురాయి లీజులు?

  • ఆ రూల్స్‌ మాకు వర్తించవు

  • ప్రభుత్వం ఇచ్చినవాటిని ఎలా కాదంటారు?

  • షోకాజ్‌ నోటీసును వెనక్కి తీసుకోండి

  • భారతి సిమెంట్స్‌ వాదన.. తోసిపుచ్చిన సర్కారు

చీ(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం చట్టపరమైన అంశాలనన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తమకు కేటాయించిన సున్నపురాయి లీజులను ఎలా రద్దుచేస్తారని భారతి సిమెంట్స్‌ ప్రశ్నిస్తోంది. జగన్‌ ప్రభుత్వ హయాం లో తమకు నిబంధనల ప్రకారమే లీజులు ఇచ్చారని, అవి తప్పని ఇప్పుడు ఎలా అంటారని వాదిస్తోంది. లీజులు రద్దు చేయాలన్న ముందస్తు ఉద్దేశాలతోనే తమకు నోటీసులు ఇచ్చారని, ఆ చర్య చట్టవిరుద్ధమైనదని అంటోంది. ఇది సహజ న్యాయసూత్రాలు, చట్టబద్ధ పాలనకు విరుద్ధమంటూ ఆ కంపెనీ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. లీజుల రద్దుకోసం చూపిస్తున్న కారణాలు, నిబంధనలు తమకు వర్తించవని, తక్షణమే లీజుల రద్దు షోకాజ్‌ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. నోటీసుపై వ్యక్తిగతంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని గనులశాఖను కోరింది. దీనిపై గనుల శాఖ దీటుగా స్పందించింది. నోటీసు వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చిచెప్పింది. కేంద్ర గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం (ఎంఎండీఆర్‌) 1957లోని సెక్షన్‌ 10 (ఏ)(2)(సి) ప్రకారం లీజులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానిదే తప్పంటూ భారతి సిమెంట్స్‌ సరికొత్త వాదన చేస్తోంది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ఆ కంపెనీ లీజులను రద్దుచేసేందుకు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇదే బాటలో ఏసీసీ, రామ్‌కో సిమెంట్స్‌కి ఇచ్చిన లీజులను కూడా రద్దు చేసేందుకు ఫైలు కదిలింది.

ఎన్నికల సమయంలో లీజులు..

2024 ఎన్నికల సమయంలో నాటి సీఎం జగన్‌ కడప జిల్లా కమలాపురం మండలంలోని 3 గ్రామాల పరిధిలో భారతి సిమెంట్స్‌కు 235.56 ఎకరాల మేర సున్నపురాయి లీజులను ఇచ్చారు. లీజు కాలపరిమితి 50 ఏళ్లుగా ఖరారుచేస్తూ 2024 ఫిబ్రవరి 2న జీవో 4 జారీచేశారు. భారతి సిమెంట్స్‌కు ఎంఎండీఆర్‌ యాక్ట్‌-1957కు విరుద్ధంగా లీజులు ఇచ్చారని, దీనిపై విచారణ చేయాలంటూ కడప జిల్లాకు చెందిన వ్యక్తే కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖలోని అంశాలు ప్రాఽథమికంగా నిర్ధారణ కావడంతో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రం 2024లోనే రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గనుల శాఖ లీజుల ఫైళ్లను పరిశీలించింది. ఎంఎండీఆర్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 10 (ఏ)(2)(సి)కి విరుద్ధంగా భారతి సిమెంట్స్‌కు లీజులు ఇచ్చారని నిర్ధారించారు. ఇది చట్ట ఉల్లంఘన పరిఽధిలోకి వస్తుందని, కాబట్టి ఆ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని గనుల శాఖ గత ఏడాది డిసెంబరు 11న భారతి సిమెంట్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. భార తి సిమెంట్స్‌ డైరెక్టర్‌ ఈ నెల 5న వివరణ పంపించారు.


వెనక్కి తీసుకోవాలి: భారతి సిమెంట్స్‌

షోకాజ్‌ నోటీసు అసంబద్ధంగా, అసంపూర్ణంగా ఉందని భారతి సిమెంట్స్‌ పేర్కొంది. ‘‘ఎంఎండీఆర్‌-1957లోని సెక్షన్‌ 10 (ఏ)(2)(సి) కింద మా లీజులు రద్దు చేయడం న్యాయబద్ధం కాబోదు. మాకు ఆ రూల్స్‌ వర్తించవు. మా లీజులు ఆ రూల్స్‌కు లోబడే ఇచ్చారు. కాబట్టి ఆ రూల్స్‌ను ఉల్లంఘించారని చెప్పడం సరైనది కాదు. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నాటి ప్రభుత్వం మాకు లీజులు ఇచ్చింది. నాటి ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయాన్ని సమీక్షించడం హేతుబద్ధమైన చర్య కాబోదు. లీజుల రద్దు ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే జరగాలి. నిబంధనలు ఉల్లంఘించి, మోసపూరితంగా, వాస్తవ విరుద్ధంగా లీజులు తీసుకుంటేనే రద్దుచేయాలి. కానీ భారతి సిమెంట్స్‌కు అలా లీజులు రాలేదు. మీ నోటీసులో అలాంటి అంశాలు కూడా లేవు. లీజులు రద్దు చేయాలన్న ఉద్దేశంతోనే నోటీసులు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. లీజుల రద్దుకు మీరు చూపిస్తోన్న కారణాలు ఏవీ సహేతుకంగా, న్యాయబద్ధంగా లేవు. ఆ రూల్స్‌, కారణాలేవీ మాకు వర్తించవు. కాబట్టి లీజుల రద్దుకు ఇచ్చిన నోటీసును ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాలి’’ అని తన వివరణలో పేర్కొంది.

అదేం కుదరదు: గనుల శాఖ

భారతి సిమెంట్స్‌ సుదీర్ఘ వివరణపై గనుల శాఖ తీవ్ర ంగా స్పందించింది. తాము ఎంఎండీఆర్‌ చట్టంలోని అంశాలను, ఇతర చట్టపరమైన విషయాలను పరిగణనలోకి తీసుకొనే షోకాజ్‌ నోటీసు ఇచ్చామని, అందులోనే కీలకమైన అంశాలున్నాయని గనుల శాఖ పక్షం రోజుల క్రితమే భారతి సిమెంట్స్‌కు పంపిన రెండో నోటీసులో స్పష్టం చేసింది. ఎంఎండీఆర్‌ చట్టం-1957లోని సెక్షన్‌ 10 (ఏ)(2)(సి)కింద భారతి సిమెంట్స్‌కు ఇచ్చిన లీజులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనవని పేర్కొంది. ఆ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో బదులివ్వాలని స్పష్టం చేసింది.

లీజుల రద్దుకు సిఫారసు

షోకాజ్‌ నోటీసుపై భారతి సిమెంట్స్‌ వాదన గనుల శాఖను విస్మయానికి గురిచేసింది. నోటీసులు వెనక్కి తీసుకోవాలన్న వాదనకే భారతి సిమెంట్స్‌ కట్టుబడి ఉందా? అంటే అదీలేదు. వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. లీజులు ఎందుకు రద్దుచేయకూడదో భారతి సిమెంట్స్‌ హేతుబద్ధ కారణాలు చెప్పలేదని గనుల శాఖ నిర్ధారణకు వచ్చింది. ఎఎండీఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 10 (ఏ)(2)(సి)కి విరుద్ధంగా లీజులు పొందినందున వాటిని రద్దు చేయాలని గనులశాఖ డైరెక్టర్‌ సిఫారసు చేసినట్లు తెలిసింది.

Updated Date - Jan 31 , 2026 | 05:46 AM