Share News

మరిచిపోలేని విషాదం.. దివిసీమ ఉప్పెన!

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:59 AM

దివిసీమ ఉప్పెన! ఆ జల ప్రళయ తీవ్రతకు ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకుపోయాయి. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

మరిచిపోలేని విషాదం.. దివిసీమ ఉప్పెన!

  • మహా జలప్రళయానికి 49 ఏళ్లు

  • స్వయం సేవకులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నా

  • పునర్నిర్మాణం కోసం మూలపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాం

  • మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): దివిసీమ ఉప్పెన! ఆ జల ప్రళయ తీవ్రతకు ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకుపోయాయి. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్తు, సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ మహావిపత్తు గుర్తుకొస్తే ఆ తరంవాళ్లు భయంతో వణికిపోతారు! బాధతో వారి గుండెలు బరువెక్కుతాయి! కళ్లెమ్మట నీళ్లొస్తాయి. ఈ మహా విషాదానికి గురువారంతో 49ఏళ్లు! 1977 నవంబరు 19న దివిసీమను అతలాకుతలం చేసిన పెను ఉప్పెన తాలూకు జ్ఞాపకాలు మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయనూ వెంటాడతాయి. స్వయం సేవకుల్లో ఒకరిగా తాను అక్కడి సహాయక చర్యల్లో భాగమయ్యానని దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. దివిసీమ ఉప్పెన మిగిల్చిన చేదు జ్ఞాపకాలను తాను జీవితంలో మరిచిపోలేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఉప్పెన సంభవించిన మూడోరోజు అంటే 1977 నవంబరు 21న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ప్రాంత ప్రచారక్‌ సోంపల్లి సోమయ్య సూచనల మేరకు తాను.. కొంతమంది స్వయం సేవకులతో కలిసి అవనిగడ్డ ప్రాంతానికి చేరుకొని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నానని దత్తాత్రేయ చెప్పారు. ఆ ప్రాంతమంతా మరుభూమిని తలపించిందని.. ఎక్కడపడితే అక్కడ గుర్తుపట్టలేని స్థితిలో కుప్పలుగా మృతదేహాలు కనిపించాయని.. అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు కూడా ముందుకురాలేని హృదయ విదారకమైన పరిస్థితి నెలకొందని వెల్లడించారు.


మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన బాధ్యతను తాము స్వీకరించామని చెప్పారు. సహాయక చర్యలను పరిశీలించేందుకు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కోడూరు ప్రాంతానికి వచ్చారని, అక్కడ తాము చేపట్టిన పనులను చూసి ఎంతో అభినందించారని గుర్తు చేసుకున్నారు. బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించాలని భావించామని.. మూలపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకుని, ఆ గ్రామ పునర్నిర్మాణ బాధ్యతను చేపట్టామని వివరించారు. దివిసీమ ఉప్పెనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 05:00 AM