పట్టణం హస్తానిదే
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:46 AM
అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను కొనసాగిస్తూ.. మునిసిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది.
74 మునిసిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో విజయబావుటా
24 మునిసిపాలిటీల్లో నెలకొన్న హంగ్
వీటిలోనూ అత్యధికం ఎంఐఎం, స్వతంత్రుల మద్దతు, ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రె్‌సకే దక్కే చాన్స్
17 చోట్ల బీఆర్‌ఎ్‌సకు మెజారిటీ, బీజేపీకి ‘సున్నా’
వడ్డేపల్లి మునిసిపాలిటీని దక్కించుకున్న ఫార్వర్డ్ బ్లాక్
నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం కార్పొరేషన్లలో హంగ్!
ఎంఐఎంతో కలిసి నిజామాబాద్, సీపీఐతో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్లను అధికార పార్టీ దక్కించుకునే అవకాశం
ఉత్తరం నుంచి దక్షిణ తెలంగాణ దాకా హస్తం హవా
రెండో స్థానంలో బీఆర్‌ఎస్.. పరిమితంగానే బీజేపీ ప్రభావం
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను కొనసాగిస్తూ.. మునిసిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే.. 74 మునిసిపాలిటీల్లో విజయబావుటా ఎగరేసింది. ఇక ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా.. నాలుగింటిని స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకుంది. మరో మూడు కార్పొరేషన్లలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో.. వాటిలోనూ రెండు చోట్ల మిత్రపక్షాలు, స్వతంత్రుల మద్దతుతో పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కేవలం 17 మునిసిపాలిటీల్లో మాత్రమే స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఏడు కార్పొరేషన్లలో ఒక్క చోట కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో డివిజన్లను గెలవలేకపోయింది. కాగా, బీజేపీ ఒక్క మునిసిపాలిటీలో కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. కార్పొరేషన్లలోనూ కరీంనగర్, నిజామాబాద్‌లో మెజారిటీ డివిజన్లను గెలుచుకుంది. ఈ రెండు చోట్ల పాలకవర్గాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అయితే నిజామాబాద్‌లో ఎంఐఎం, స్వతంత్రులతో కలిసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోంవది. మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, రామగుండం కార్పొరేషన్లను హస్తం పార్టీ స్పష్టమైన మెజారిటీతో దక్కించుకోగా.. కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడింది. అక్కడ కాంగ్రెస్, సీపీఐ సమాన సంఖ్యలో డివిజన్లను గెలుచుకున్నాయి. అయితే సీపీఐ ఇప్పటికీ అసెంబ్లీలో కాంగ్రె్‌సకు మిత్రపక్షంగా ఉన్నందున ఆ పార్టీతో కలిసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. మరోవైపు 24 మునిసిపాలిటీల్లోనూ ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ మునిసిపాలిటీలను కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మునిసిపాలిటీని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది.
ఉమ్మడి మెదక్ మినహా అన్ని జిల్లాల్లోనూ..
హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో మునిసిపల్ ఎన్నికలు జరగగా.. మెదక్ మినహా అన్ని జిల్లాల్లోనూ అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. దాదాపు 63.79 శాతం మున్సిపాలిటీలను అధికార పార్టీ దక్కించుకుంటే.. కేవలం 14.65 శాతం మాత్రమే ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ దక్కించుకోగలిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మాత్రమే బీఆర్‌ఎస్ పట్టు నిలబెట్టుకోగలిగింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని గజ్వేల్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంలోని సిరిసిల్ల మునిసిపాలిటీల్లో మెజారిటీ సాధించడం గులాబీ పార్టీకి ఊరటనిచ్చింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా.. మునిసిపాలిటీల్లో మాత్రం నిలవలేకపోయింది.
పక్కా వ్యూహంతో..
పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీఎం, మంత్రులు పక్కా వ్యూహంతో ఈ ఎన్నికల్లో పని చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయా నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను వారిపై పెట్టారు. ఎప్పటికప్పుడు జూమ్ ద్వారా, ప్రత్యక్షంగానూ సమావేశమై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత తీసుకున్న మంత్రులు.. సాధ్యమైనంత మేరకు రెబల్ అభ్యర్థులు లేకుండా చూసుకున్నారు. ఎన్నికలు జరగని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను సమన్వయకర్తలుగా నియమించడంతో పార్టీ యంత్రాంగం మొత్తం ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మకాం వేసి పని చేశారు. జనవరి 3 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు, మంత్రులు, నేతల ప్రచారంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అన్నింటికి తోడు అధికార పార్టీ కావడమూ కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. పట్టణాల అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమన్న ప్రచారాన్ని పార్టీ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. అనేక మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు.. బీజేపీ, బీర్‌ఎ్‌సల మధ్య చీలిపోవడంతో ఆ రెండు పార్టీలూ భారీగా నష్టపోయాయి.
ఉత్తరం నుంచి దక్షిణం దాకా హస్తం హవా..
మునిసిపల్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఎన్నికలు జరిగిన మొత్తం వార్డుల్లో సగానికి పైగా కైవసం చేసుకుంది. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల కుమ్రం భీం, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట భద్రాది, మహబూబాబాద్, వరంగల్ వరకు విస్తరించిన ఉత్తర భాగంలో కాంగ్రెస్ గట్టి పట్టు సాధించింది. పలు మునిసిపాలిటీల్లో ఆధిక్యాన్ని చాటుకోవడం ద్వారా పట్టణ ప్రజల ఆశీస్సులు తమకే ఉన్నాయని మరోసారి రుజువు చేసుకుంది. ఈ ప్రాంతంలో బీఆర్‌ఎస్ కొన్ని మునిసిపాలిటీల్లోనే ప్రభావం చూపింది. దక్షిణ తెలంగాణలో మిశ్రమ ఫలితాలు కనిపించినా.. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, ములుగు, నారాయణపేట వంటి జిల్లాల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ వంటి అర్బన్ ప్రాంతాల్లో మాత్రం అధికార పార్టీ కంటే బీఆర్‌ఎస్ ప్రాబల్యం చాటింది. బీజేపీ కొంత మేర పోటీ ఇచ్చింది. ఉత్తర తెలంగాణలో మొత్తం 1540 వార్డులకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 820 గెలుచుకుంది. బీఆర్‌ఎస్ 430, బీజేపీ 170, ఎంఐఎం, ఇతరులు, స్వతంత్రులు కలిపి 120 వార్డులను గెలుపొందారు. ఇక దక్షిణ తెలంగాణలో మొత్తం 1313 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 677 వార్డుల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ 334, బీజేపీ 108, ఇతరులు, స్వంతంత్రులు కలిపి 194 వార్డులు దక్కించుకున్నారు.


