Share News

కేంద్రాన్ని ఒప్పిస్తే..

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:48 AM

ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేద్దాం. చివరి ఆర్నెల్లు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ రెండేళ్లు రాజకీయాలకు, జెండాలకు అతీతంగా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం....

కేంద్రాన్ని ఒప్పిస్తే..

  • రేవంత్‌రెడ్డికి పేరొస్తుందని కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నడు

  • నేను మోదీని, మంత్రులను కలిసి వచ్చిన 3 రోజులకే కిషన్‌రెడ్డి వెళ్లి ఏమీ చేయొద్దని వాళ్లకు చెబుతున్నడు

  • కిషన్‌రెడ్డీ నువ్వెంత లడాయి కోతివో ప్రజలకు తెలుసు

  • తెలంగాణ ప్రగతికి అడ్డుపడినోడికి పుట్టగతులుండవ్‌

  • 8 మందిని గెలిపిస్తే ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత లేదా?

  • రాష్ట్రానికి మీరేం తెచ్చిర్రో అసెంబ్లీలో చర్చిద్దామా?

  • బీజేపీ నేతలపై భగ్గుమన్న సీఎం రేవంత్‌రెడ్డి

  • నగరంలో లక్ష ఎల్‌ఐజీ, ఎంఐజీ ఇళ్లు కట్టిస్తా

  • రెండేళ్లు జెండాలకతీతంగా అభివృద్ధి చేసుకుందాం

  • మియాపూర్‌ శంకుస్థాపనల్లో సీఎం వ్యాఖ్యలు

  • తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం.. 148 మీ. ఎత్తు చాలదు

  • మీ రాష్ట్రంలో మునిగేది స్వల్పమే.. సహకరించండి

  • మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేద్దాం. చివరి ఆర్నెల్లు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ రెండేళ్లు రాజకీయాలకు, జెండాలకు అతీతంగా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ రెండేళ్లు రోజుకు 18 గంటలు కష్టపడతానని చెప్పారు. సోమవారం ఆయన సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. బాచుపల్లి ప్లైఓవర్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘‘కిషన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావులకు ఒక్కటే విజ్ఞప్తి. చేతనైతే సహకరించండి. మీ అనుభవంతో సూచన చేయండి. మీ అహకారంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు.. మీ గూడుపుఠాణిని తెలంగాణ యువత గమనిస్తున్నారు. నేను ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినా, వేరే ఏ మంత్రిని కలిసినా మూడు రోజుల తేడాతో కిషన్‌రెడ్డి కలుస్తారు. నాతో కలిసి రమ్మంటే మాత్రం రాడు. నేను మంత్రులతో కూర్చొని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే కాచిన పాలల్లో ఉప్పు వేసిన్నట్లుగా పొయి చెబుతాడు. నువ్విచ్చినవంటే రేవంత్‌రెడ్డికి పేరొస్తది. మళ్ళీ వాళ్ల ప్రభుత్వమే వస్తది. నువ్వు చేయకు అని కిషన్‌రెడ్డి కాళ్లలో కట్టె పెడుతున్నడు. ఇట్లాంటి బుద్దులు మానుకొండి కిషన్‌రెడ్డీ.

10.jpg


తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డోనికి పుట్టగతులు లేకుండా ప్రజలు తీర్పునిస్తారు. మీరు ఒక్కరూ కూడా బతికి బట్టకట్టి ఢిల్లీకి పోరు’’ అని హెచ్చరించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే మోదీ ప్రధాని అయ్యారని, మోడీని అడిగి మెట్రోను తెచ్చే తెలివితేటలు లేవా? అని రేవంత్‌ ప్రశ్నించారు. ’రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు నిధులు అడగాల్సిన అవసరం లేదా.? గోదావరి, సింగూరు జలాలు హైదరాబాద్‌కు తేవాల్సిన అవసరం లేదా? మూసీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే చేతకాదు. పొంకనాల పోసిగానికి మూడు ఎడ్లుంటే ముప్పై ఆరు దొడ్లున్నాయని. అయ్యా కిషన్‌రెడ్డి, నువ్వు ఎంత మొనగాడివో.. ఎంత లడాయి కోతివో తెలంగాణవాళ్లకు తెలుసు. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎంతో చర్చించడానికి అడ్డుపడుతున్నది నువ్వు కాదా? గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తెచ్చే పనులకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నది నువ్వు కాదా?’’ అని నిలదీశారు. ‘‘మోడీ సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అంటావ్‌. మనకున్న మూసీని ప్రక్షాళన చేసుకోవద్దా?’’ అని ప్రశ్నించారు. గుజరాత్‌కు గులాంలుగా ఎందుకు పని చేస్తున్నారని బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు. ‘‘గుజరాత్‌ అభివృద్ధి మోదీ బాధ్యత అయితే తెలంగాణ అభివృద్ధి బాధ్యత కిషన్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌, విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్‌లకు లేదా? ఇక్కడి ప్రజలు మీకు ఓటేయ్యలేదా? మీరు కేంద్ర ప్రభుత్వంలో లేరా?’’ అని అడిగారు. రెండేళ్లలో రాష్ట్రం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఏం చేశారో శాసనసభలో చర్చిద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు తప్పించుకోవాలని చూస్తే పొగబెట్టి ఎలుకను బయటకు ఎలా తీసుకురావాలో తమ కార్యకర్తలకు తెలుసని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో చిన్న వార్డు మెంబర్‌ గెలిపించుకోవాలన్నా మోదీ మొహం చూపించి ఓట్లు అడిగే దయనీయ పరిస్థితి బీజేపీ నేతలదని ఎద్దేవా చేశారు.

7.jpg


హైదరాబాద్‌ జనాభా ఏటా 3శాతం పెరుగుతోంది

హైదరాబాద్‌ జనాభా ఏటా మూడు శాతం చొప్పున వేగంగా పెరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకప్పుడు నగరంలోనే కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, పంచాయితీ మూడు రకాల పాలనలు ఉండేవని, సమస్య వస్తే ఎవర్ని అడగాలో అర్థం కాని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. నిపుణుల సూచన మేరకే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓఆర్‌ఆర్‌ లోపల మూడు కార్పొరేషన్లు చేశామని చెప్పారు. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీకి ఎంత పేరుందో సైబరాబాద్‌కు అంతే పేరు వస్తుందన్నారు. రాష్ట్రం ఐటీ ఎగుమతుల్లో 60 శాతం సైబరాబాద్‌ పరిధిలో ఉందని, దేశంలో 16.77 శాతం ఉందని చెప్పారు. రాజధాని నగరంలో లక్ష ఎల్‌ఐజీ, ఎంఐజీ ఇళ్లు కట్టి అల్పఆదాయ వర్గాలకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పేదలకు ఇళ్లు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే ఇళ్లు కట్టించడానికి ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే వంద ఎకరాల్లో గాజులరామారంలో అంతర్జాతీయ బస్‌ టెర్మినల్‌ నిర్మిస్తామని చెప్పారు. మెట్రోను రాయదుర్గం నుంచి నియో పోలీసు వరకు విస్తరిస్తామని ప్రకటించారు. ఎకరం 200 కోట్లు పలికేచోట అందుకు అనుగుణమైన సౌకర్యాలు కల్పించే బాధ్యత తమకు ఉందని చెప్పారు. ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కలకత్తా, బెంగుళూర్‌, హైదరాబాద్‌లే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధాని నుంచి చీఫ్‌ జస్టిస్‌ వరకు ప్రముఖులుండే ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించలేక పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్‌, ప్రధాని ఆఫీసు బంద్‌ పెట్టే పరిస్థితి దాపురించిందని తెలిపారు. ముంబాయిలో వర్షాలు వస్తే పది అడుగుల ఎత్తున నీళ్లు నిలబడే పరిస్థితి వచ్చిందని, బెంగుళూర్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులతో పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని తెలిపారు. చెన్నైలో వర్షాలు వస్తే అపార్ట్‌మెంట్స్‌, ప్రభుత్వ కార్యాలయాలు నీళ్లలో నిండిపోయి పది రోజులు స్తంభించిందన్నారు. కోల్‌కతాలో బయటకు వస్తే ప్రాణాలతో తిరిగి వస్తామా? అనే పరిస్థితి ఉందని చెప్పారు. ఆయా నగరాల్లో సమస్యను తీవ్రతను అర్థం చేసుకొని, ప్రపంచ స్థాయి నిపుణులతో ఎక్స్‌పర్ట్‌ కమిటీ చేసి, తెలంగాణ రైజింగ్‌ 2045 పాలసీ రూపొందించామని వివరించారు.

Updated Date - Jun 09 , 2026 | 05:10 AM