మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి!
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:21 AM
తెలంగాణ భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలియజేశారు.
తెలంగాణకు గోదావరి జలాలు కీలకం
తాగు, సాగు భవిష్యత్తు అవసరాలు వాటితోనే..
మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలను ఆమోదించండి
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి చేపట్టండి
బందరుపోర్టు ఎక్స్‌ప్రెస్‌వేకు అనుమతులు ఇవ్వండి
వరంగల్ విమానాశ్రయం పనులు త్వరగా ప్రారంభించండి
ఐఐఎంను మంజూరు చేయండి
ప్రధాని మోదీకి రేవంత్ విజ్ఞప్తులు
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలియజేశారు. రాష్ట్రం సాగు, తాగు నీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు విషయమై చర్చించేందుకు మహారాష్ట్రతో సమావేశం విషయంలో సహకరించాలని మోదీని కోరారు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‍కు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఫడణవీస్‍కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఆయన స్పందించలేదని, ఇది తెలంగాణకు అవమానమని.. దీనిని రాష్ట్ర రైతులు సహించరని ఇటీవల ఓ బహిరంగసభలో కూడా రేవంత్ తీవ్రంగా హెచ్చరించారు. ఈనేపథ్యంలోనే తాజాగా గురువారం నీతిఆయోగ్ భేటీకి హాజరుకావటానికి ఢిల్లీకి వచ్చిన సీఎం ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా.. ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయంలో విజ్ఞప్తులను ప్రధాని మోదీకి అందజేశారు.
మెట్రో విస్తరణ ప్రతిపాదనలు ఆమోదించండి
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. ఫేజ్-2లో భాగంగా ఏడు కారిడార్లలో రూ.38,595 కోట్ల వ్యయంతో చేపట్టే 122.9 కి.మీ.ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ వ్యయంలో 50శాతం వాటా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐకి రూ.626 కోట్లు విడుదల చేశామన్నారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్ మ్యాపులు, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని చెప్పారు. ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి, చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-అమరావతి-బందరుపోర్టు ఎక్స్‌ప్రెస్‌వేకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టును కలిపే 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేతో.. సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుందన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులను ప్రస్తావిస్తూ.. భూసేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత లబ్ధి చేకూరుతుందని, విమానాశ్రయం పనులను వీలైనంత త్వరలో ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, టీఐఎఫ్ఆర్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయని, ఐఐఎంను ఏర్పాటు చేేస్త నూతన విద్యావిధానం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని ప్రధాని మోదీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తోనూ సీఎం సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్-2 విస్తరణపై చర్చించారు.