Share News

హైదరాబాద్ మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

ABN , Publish Date - May 28 , 2026 | 07:57 PM

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ నగర నడిబొడ్డున కొలువుదీరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

హైదరాబాద్ మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
NTR Statue Hyderabad

హైదరాబాద్, మే 28: నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తాలో కొలువుదీరింది. నూతనంగా ఏర్పాటుచేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ఘనంగా ఆవిష్కరించారు. గతంలో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నగరంలోని ఎన్టీఆర్ అభిమానుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి మరీ ఆవిష్కరించారు.


ఈ విగ్రహ ఏర్పాటు ప్రక్రియ విజయవంతం కావడంలో స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ విగ్రహ స్థాపన పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, భారీ సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.


తెలుగుజాతికి స్ఫూర్తి నింపిన మహానాయకుడు ఎన్టీఆర్..

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పి, ప్రజల్లో ఒక కొత్త రాజకీయ, సామాజిక చైతన్యాన్ని నింపిన మహానాయకుడు నందమూరి తారకరామారావు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులలో ఎన్టీఆర్ ఒకరు అని అన్నారు. భారతదేశ చరిత్రను, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థను మలుపు తిప్పిన ముగ్గురు గొప్ప నాయకులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌లను భారతదేశ జాతిరత్నాలుగా అభివర్ణించిన ఆయన, ఈ ముగ్గురు నాయకులు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశాన్ని ప్రగతిపథంలో నడిపించాయని పేర్కొన్నారు. సమాజంలో ఎంతటి అట్టడుగున ఉన్న సామాన్యుడికైనా పాలకుడిని మార్చే శక్తినిస్తూ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను మనం ప్రతిక్షణం గుర్తుంచుకోవాలన్నారు. అలాగే పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఓటుహక్కు కల్పించి, వారిని రాజకీయంగా, సామాజికంగా సమాన భాగస్వాములను చేసిన ఘనత మన నాయకులకే దక్కుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 28 , 2026 | 09:28 PM