Share News

అబద్ధాల కుటుంబం!

ABN , Publish Date - May 31 , 2026 | 05:33 AM

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్‌ రద్దుచేసినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని అన్నారు. తాము మాట మీద......

అబద్ధాల కుటుంబం!

  • కేసీఆర్‌ పరివారంలో అందరి డీఎన్‌ఏ అదే

  • ఎన్టీఆర్‌ విగ్రహం పెడితే బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ పెట్టినప్పుడు కేటీఆర్‌ ఎవరి చంక నాకారు? కమ్మ సంఘానికి 10 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఎన్టీఆర్‌ పేరు పెట్టుకుని కేటీఆర్‌ ఓట్లు అడుక్కోవడమెందుకు? ఆయన పేరు మార్చుకోవాలి.

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • ఉద్యమంలో వాళ్ల అబద్దాలను సమర్థించాం

  • సొంత రాష్ట్రం వచ్చినా అసత్యాలు మానలేదు

  • మోటార్లకు మీటర్‌ పెట్టం... ఉచితం ఎత్తేయం!

  • మాట నిలబెట్టుకుంటే బీఆర్‌ఎస్‌ తప్పుకుంటుందా?

  • డిస్కమ్‌ల వైఫల్యాలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు

  • జవాబుదారీతనం, పారదర్శకత కోసమే రైతు డిస్కమ్‌

  • స్మార్ట్‌ మీటర్ల ఒప్పందం చేసుకుంది బీఆర్‌ఎస్సే

  • మీటర్లు పెట్టకుండానే జగన్‌ అప్పు తెచ్చుకోలేదా?

  • చివరి గింజ వరకూ కొంటాం.. తడిసినా కొంటాం

  • కేంద్రం తీసుకోకుంటే కిషన్‌రెడ్డి ఇంటిముందు పోస్తాం

  • విగ్రహం వద్దన్న కేటీఆర్‌ తన పేరు మార్చుకోవాలి

  • ఎన్నికల్లోపు హరీశ్‌రావు పార్టీ మారడం పక్కా

  • ఆయన ఎవర్ని కలుస్తున్నాడో వాళ్లే నాకు చెప్పారు

  • క్రషర్ల నుంచి తను నెలకు 50 లక్షలు ఆశించారు

  • వాళ్లు కాదనడంతోనే మీడియా ముందుకొచ్చారు

  • మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మే 30(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్‌ రద్దుచేసినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని అన్నారు. తాము మాట మీద నిలబడితే బీఆర్‌ఎస్‌ పోటీ నుంచి తప్పుకుంటుందా? అని సవాలు విసిరారు.


‘‘రాష్ట్రంలో మూడేళ్లలో ఎప్పుడూ లేనట్లుగా అకాల వర్షాలు వచ్చాయి. రైతు బాధలో ఉన్నాడు. పరామర్శించడానికి వెళ్లే నేతలు రెండు లక్షలో, ఐదు లక్షలో సాయం చేయాలి కానీ మీరు చేస్తుందేంటి? ఓట్ల రాజకీయం. అదీ ఒక బతుకేనా?’’ అని బీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి ధ్వజమెత్తారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. చివరి ధాన్యం గింజ వరకు తడిసినదైనా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని, ఆ తర్వాత కేంద్రం వాటిని కొనకుంటే కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ల ఇళ్ల ముందు పోస్తామని హెచ్చరించారు. దేశంలో 54 డిస్కమ్‌లు ఉంటే తెలంగాణ డిస్కమ్‌లు రెండూ 52, 54వ స్థానాల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకప్పుడు అవి తొలి ఆరు స్థానాల్లో ఉండేవన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రూ.70వేల కోట్ల నష్టాలతో వాటిని కోలుకోకుండా చేశారని చెప్పారు. విద్యుత్‌ సంస్థలేవీ ప్రజలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వవని, ఆ సొమ్మును ప్రభుత్వమే విద్యుత్‌ సంస్థలకు చెల్లిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో బకాయిలు కొండల్లా పేరుకుపోయి డిస్కమ్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని చెప్పారు. జెన్‌కోలు సమయానికి డబ్బులు ఇవ్వవు కాబట్టి సింగరేణి అమ్మే బొగ్గుకు నాలుగింతల ధర వేస్తోందని చెప్పారు. ఇలా విద్యుత్తు సంస్థలు, సింగరేణి అన్నీ దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవేవీ పరిష్కరించుకుండా సింపుల్‌గా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ వల్ల విద్యుత్‌ సంస్థలు నష్టాల పాలవుతున్నాయనే సాకుతో అధికారులు తప్పించుకొనే అవకాశం ఏర్పడుతోందని చెప్పారు. వాస్తవానికి రైతులకు సరఫరా చేసిందెంతో తేలితే కానీ, అందులో పారదర్శకత వస్తేగానీ విద్యుత్‌ సంస్థలను నిలదీసి లాభాలబాట పట్టించడం కుదరదని అన్నారు. సౌర విద్యుత్‌ వచ్చాక పగటి సమయంలో ఒక్కోసారి ఉచితంగా కూడా డిస్కమ్‌లకు కరెంటు అందుతోందని గుర్తు చేశారు. టమాటా బాగా పండిన రోజుల్లో రైతు పది పైసలకు కిలో అమ్మినట్లే కరెంటు మార్కెట్లో ఒక్కోసారి ఉచితంగా లేదా పది పైసలకు యూనిట్‌ విద్యుత్‌ దొరుకుతోందని చెప్పారు. రాత్రిపూట పీక్‌ టైమ్‌లో విద్యుత్‌ కొనుగోలు చేస్తే యూనిట్‌కు రూ.10 చెల్లించాల్సి వస్తోందన్నారు. మొత్తం కరెంటు బిల్లును యావరేజ్‌ చేసి రైతులకు ఇంత ఖర్చవుతోందని ప్రభుత్వం ఖాతాలో విద్యుత్‌ సంస్థలు బిల్లు వేస్తున్నాయని చెప్పారు. ఇలా బాధ్యత నుంచి తప్పించుకొనే వ్యవహారం లేకుండా పారదర్శకంగా బిల్లింగ్‌ చేయించే లక్ష్యంతోనే రైతు డిస్కమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. రైతు డిస్కంలో ఎత్తిపోతల పథకాలు, పంపుసెట్లు, మెట్రో వాటర్‌ వర్క్స్‌, మిషన్‌ భగీరథ నీటి సరఫరాలను చేర్చామని వివరించారు. రైతు డిస్కమ్‌ ఏర్పాటు చేసిన తర్వాత రాత్రి సమయాల్లో యూనిట్‌ రూ.10కి కొనుగోలు చేసిన భారం రైతుల ఖాతాలో వేసేందుకు అవకాశం ఉండదని చెప్పారు.


రైతులు 90 శాతం పగటిపూటే విద్యుత్తును వాడుకుంటున్నారని, రాత్రి పూట కేవలం పదిశాతమే వాడుకుంటున్నారని తెలిపారు. రైతు డిస్కమ్‌ ఏర్పాటు చేసినా 24 గంటలూ రైతుకు కరెంటు సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్‌ సంస్థల్లో బాధ్యత, నాణ్యత, పారదర్శకత పెంచేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 2017లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అధికారులు కేంద్రంతో స్మార్ట్‌ మీటర్ల ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఆ ఏడాదే 30 వేల దాకా స్మార్ట్‌ మీటర్లు పెట్టారని తెలిపారు. అప్పుడైనా ఇప్పుడైనా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన కేంద్ర ప్రభుత్వ పథకంలో లేదని అన్నారు. కేసీఆర్‌ డంబాచారం కోసం తన మెడమీద కేంద్రం కత్తి పెడితే చావనైనా చస్తా కానీ మోటార్లకు మీటర్లు పెట్టనని హడావిడి చేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్‌ అదే పథకంలో చేరి అప్పు తెచ్చుకున్నారని, ఆయనేమీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని గుర్తు చేశారు. రైతు డిస్కంను ప్రైవేటీకరిస్తారని బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారంలో అర్థం లేదన్నారు. ఉచిత విద్యుత్‌ హామీని 1999 ఎన్నికలప్పుడు ఇచ్చామని, దాన్ని ఇరవయ్యేళ్లలో ఏడు గంటల నుంచి 24 గంటలకు తీసుకొచ్చామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని రెండు వేల మెగావాట్ల సరఫరా కోసం విద్యుత్‌ లైన్‌లకు ఛార్జీలు చెల్లిస్తామని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద ఇప్పుడు ఛత్తీస్గఢ్‌ ప్రభుత్వం వెయ్యి కోట్లు కట్టాలని డిమాండ్‌ చేస్తోందన్నారు. వేల కోట్ల విద్యుత్‌ కుంభకోణాలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు రైతు డిస్కమ్‌ వద్దంటూ వచ్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాజస్థాన్‌తో సోలార్‌ విద్యుత్‌ ఒప్పందంపై రూ,.800 కోట్ల నష్టమంటూ హరీశ్‌రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అందులో ఒక్కపైసా నష్టం లేదని సీఎం చెప్పారు. ఉద్యమంలో ఎడాపెడా అబద్దాలాడారని, పక్క రాష్ట్రం వారున్నారు కాబట్టి అప్పుడు మద్దతిచ్చామని, సొంత రాష్ట్రం అయ్యాక కూడా అబద్ధాలేనా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం డీఎన్‌ఏనే అబద్ధమని వ్యాఖ్యానించారు. హిల్ట్‌లో స్కాం అన్నారని, విచారణ వేస్తామంటే పారిపోయారని చెప్పారు. క్రషర్స్‌లో నెలకు రూ.50 లక్షలు ఇవ్వాలని పొడుగాయన ఒక ఎమ్మెల్సీని ముందు పెట్టి వాటి దగ్గర బేరాలాడారని, ఇవ్వనందున ఏదేదో మాట్లాడారని చెప్పారు. హైడ్రా వెళ్లి వాటన్నింటినీ కూల్చేసిందని చెప్పారు. వాటిపై విచారణ కూడా వేశామన్నారు. కూకట్‌పల్లిలో ఈదుల కుంట చెరువు భూమి విషయంలో హరీశ్‌రావు, కేటీఆర్‌, నవీన్‌లు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో పేపర్‌ లీకేజీతో విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు కారణమైన గ్లోబరీనా కంపెనీ కేటీఆర్‌ బినామీదేనన్నారు. దాన్నే ఇప్పుడు దేశమంతా రుద్దారని ఆరోపించారు. కేటీఆర్‌, హరీ్‌షరావులు ఆ కంపెనీపై విచారణ చేయించాలని మోదీని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.


కేంద్రం కొనకుంటే...

పంజాబ్‌లో 86 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 67 శాతం, హర్యానాలో 65 శాతం ధాన్యం కేంద్రం మద్దతు ధరతో కొంటోందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో 38 శాతమే ఎందుకు కొంటోందని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ వైపే మాట్లాడుతున్నారని, ఆయన కల్వకుంట్ల కిషన్‌రావు అని వ్యాఖ్యానించారు. జూన్‌ రెండో వారానికి గ్రామసభలుంటాయని, అప్పటికల్లా రైతు అమ్మడానికి సిద్ధపడిన చివరి గింజ వరకు కొంటామని చెప్పారు.

మహిళలకే గోదాములు

భవిష్యత్తులో భారీ ఎత్తున గోదాములు నిర్మించనున్నామని, మండల మహిళా సమాఖ్యలకే ఆ బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. గోదాంలు, ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ బాధ్యతల్నీ అప్పచెప్తామన్నారు. రాష్ట్రంలో పంట మార్పిడి పైనా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

హరీశ్‌ బీఆర్‌ఎస్‌లో ఉండరు

హరీశ్‌రావు ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామన్నారుగా? అని విలేకరులు ప్రశ్నించగా గుండెల మీద చేయి వేసుకుని కేసీఆర్‌తో ఉంటా? అని చెప్పగలరా? అని బదులిచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి హరీశ్‌రావు కచ్చితంగా ఆ పార్టీలో ఉండరు అన్నారు. ఆయన ఎవరిని కలుస్తున్నారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారో వాళ్లే తనకు చెబుతున్నారని తెలిపారు. జగిత్యాలలో మీటింగ్‌ ఉంటే ఢిల్లీ ఎందుకు వెళ్లారు? లీక్‌ కావడంతో అడ్వకేట్‌తో మాట్లాడేందుకని ఫోటో రిలీజ్‌ చేశారు. అంతకుముందు అడ్వకేట్‌తో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఫోటోలిచ్చారా? అని ప్రశ్నించారు. 2008లో హరీశ్‌ వైఎస్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడుకోలేదా? అని ప్రశ్నించారు. తాము ఏడాదికి రూ.70 వేల కోట్ల అప్పు చేస్తే రూ.95 వేల కోట్ల అప్పు తీరుస్తున్న విషయం హరీశ్‌ ఎందుకు చెప్పరని అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేయడానికి అవకాశం లేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహం పెడితే బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోందని, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ పెట్టినప్పుడు కేటీఆర్‌ ఎవరి చంక నాకారు? కమ్మ సంఘానికి 10 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టుకుని కేటీఆర్‌ ఓట్లు అడుక్కోవడమెందుకు? పేరు మార్చుకోవాలి అని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ బ్రాంచ్‌ ఏపీలో పెట్టినపుడు తెలంగాణ నేతల విగ్రహాలను ఎందుకు అక్కడ ప్రతిష్ఠించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఏపీలో అధికారంలోకి వస్తే అక్కడ పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబంలో ఎవరినైనా అరెస్టు చేస్తారా? అన్న ప్రశ్నకు మోదీ, కిషన్‌రెడ్డిలు చెప్పాలన్నారు. జుట్టు వారికే ఇచ్చామని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ హయాంలో అనేక అక్రమాలు చేశారని, ఆయన ‘‘మెక్కేశారు... బొక్కేశారు... బొక్కబోర్లా పడుకున్నారు’’ అని ఎద్దేవా చేశారు.


వచ్చే ఎన్నికల్లోనూ కలిసి విజయం సాధిస్తాం

మహేశ్‌ గౌడ్‌ది, తనది విజయవంతమైన జోడీ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇద్దరం కలిసి అన్ని ఎన్నికలూ గెలుస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే మహే్‌షకు మంచి పదవి వస్తుందన్నారు. తాను మాత్రం 2034 వరకు రాష్ట్రంలోనే ఉంటానని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రభుత్వం సేకరించిన మొక్కజొన్నలు క్వింటా రూ.1,300కు అమ్మేశారని సీఎం ప్రస్తావించారు. తమ హయాంలోనూ కొనుగోలుదార్లు రింగ్‌ అయ్యే ప్రయత్నం చేశారని అందుకే రెండుసార్లు టెండర్లు రద్దు చేశామని తెలిపారు. చివరకు క్వింటా రూ.1,960కి అమ్మామని గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణ గురించి అడగ్గా, ముందు రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు. నీటి ప్రాజెక్టులపై మాట్లాడేందుకు మహారాష్ట్ర సీఎం సమయం ఇచ్చారా? అని అడగ్గా, మోదీ ఏమో అంతరాష్ట్ర వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని అంటారని, బీజేపీ సీఎం సమయం ఇవ్వడం లేదు అని బదులిచ్చారు.

Updated Date - May 31 , 2026 | 05:33 AM