తెలంగాణ విద్యా రంగంలో చరిత్రాత్మక మార్పు.. డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో 'హార్వర్డ్' కోర్సులు!
ABN , Publish Date - Sep 17 , 2026 | 09:19 PM
హైదరాబాద్, తెలంగాణను 'గ్లోబల్ నాలెడ్జ్ హబ్'గా తీర్చిదిద్దే లక్ష్యంతో UK బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తెలంగాణ విద్యా వ్యవస్థ, పరిశ్రమలు, భవిష్యత్తు పెట్టుబడులపై సీఎం కీలక ప్రకటనలు చేశారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 17: హైదరాబాద్, తెలంగాణను 'గ్లోబల్ నాలెడ్జ్ హబ్'గా తీర్చిదిద్దే లక్ష్యంతో యునైటెడ్ కింగ్‌డమ్ (UK) బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా వ్యవస్థ, పరిశ్రమలు, భవిష్యత్తు పెట్టుబడులపై సీఎం సంచలన ప్రకటనలు చేశారు.
ఈ ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్ వేదికగా ప్రముఖ ‘హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు’ ప్రారంభం కానున్నాయని సీఎం స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఎంఐటీ (MIT), పర్డ్యూ వంటి అగ్రగామి వర్సిటీల ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలిపారు. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ యూనివర్సిటీలతో కలసి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీలు, ఫ్యాకల్టీ ట్రైనింగ్, సంయుక్త పరిశోధనలకు భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్లు వివరించారు.
'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' ద్వారా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని.. టీసీఎస్ (TCS) రూ. 70,000 కోట్లతో ఏఐ (AI) డేటా సెంటర్ నిర్మించనుందని వెల్లడించారు. అలాగే అమెజాన్ ఇప్పటికే భారీ పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, ఫార్చ్యూన్-500 కంపెనీలను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ధ్యేయమని సీఎం పునరుద్ఘాటించారు.
డిసెంబర్‌లో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026'కు యూకే ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. విద్య, ఆధునిక నైపుణ్యాలు, పారిశ్రామిక అనుసంధానంతో తెలంగాణ రూపురేఖలు మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News