CM Revanth Reddy: నాకు శత్రువుల్లేరు
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:02 AM
తనకు శత్రువులంటూ ఎవరూ లేరని, సమాజంలోని నిరక్షరాస్యత, పేదరికం, కరువే తన శత్రువులు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
నడుము విరిగి ఫాంహౌస్‌లో పడుకున్న వ్యక్తిని శత్రువని నేనెందుకు అనుకుంటాను? ఆయన లేచి సరిగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది? అందుకే నాకెవరూ శత్రువులు లేరు.
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నిరక్షరాస్యత, పేదరికం, కరువే నా శత్రువులు
ఉన్న ఒక్క శత్రువునూ ఎన్నికల్లో ఓడించాను
మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టిపడేస్తాం
జైపాల్‌రెడ్డి, జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు.. దెబ్బకు దెబ్బ తీస్తాం
పంచడానికి భూముల్లేవు.. విద్యను మాత్రమే పంచగలుగుతాం: పాలమూరు సభలో సీఎం
1,463 కోట్లతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సహా వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
మహబూబ్‌నగర్/జడ్చర్ల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తనకు శత్రువులంటూ ఎవరూ లేరని, సమాజంలోని నిరక్షరాస్యత, పేదరికం, కరువే తన శత్రువులు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శత్రువు అనుకునే ఒక్క వ్యక్తినీ 2023లోనే ఓడించానని తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి.. ట్రిపుల్ ఐటీ సహా రూ.1,463 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి బాట బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘రాజకీయ ప్రత్యర్థులు ఉంటే ఎన్నికల్లో ఓడించినం. 2024లో పార్లమెంట్‌లో గుండు సున్నా ఇప్పించిన. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో వాళ్ల ఎమ్మెల్యేలు చనిపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న. సర్పంచ్ ఎన్నికల్లో 66 శాతం గెలిపించుకున్న. నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం, పేదరికం, మహిళలకు అన్యాయం. విద్యార్థులకు నష్టం చేసేటోళ్లు, చదువుకోకుండా ఊరిమీద తిరిగేటోళ్లు నా శత్రువులు’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు బిడ్డకు వ్యూహం తెలుసునని, ఎత్తుగడ, దెబ్బకు దెబ్బతీయడమూ తెలుసునని అన్నారు. ఆనాడు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదని హెచ్చరించారు. మాయలేడి ఏ రూపంలో వచ్చినా పాలమూరు ప్రజలు గుర్తు పడతారని, కర్రుకాల్చి వాత పెడతారని చెప్పారు.
మారీచ, సుబాహుడిలా బావబామ్మర్దులు..
తాను ఆదిలాబాద్‌లో చనకా-కొరాటా, సదర్‌మాట్ బ్యారేజీలను ప్రారంభిస్తే.. తాము సిద్ధం చేసిన ప్రాజెక్టుల వద్ద రేవంత్ ఫొటోలు దిగుతున్నాడంటూ ఒక మారీచుడు మాట్లాడుతున్నాడని సీఎం మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్న శుక్రాచార్యుడు అసెంబ్లీకి రమ్మంటే రారని, ఫాంహౌ్‌సలో ఉండి మారీచుడు, సుబాహులను బావబామ్మర్దుల ముసుగులో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకొమ్మని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ, మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడి బాణంతో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు. శుక్రాచార్యుడు, మారీచ, సుబాహులను కట్టిపడేసే శక్తి పాలమూరు బిడ్డకు ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 3.16 కోట్ల మందికి 6 కిలోల ఉచిత సన్నబియ్యం, 65 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు, 52 లక్షల మంది కుటుంబాలకు ఉచిత విద్యుత్, రెండేళ్లలో రూ.27 వేల కోట్ల ఖర్చుతో ఉచిత ప్రయాణం, మహిళలకు వెయ్యి ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు పెట్టామని తెలిపారు. అయినా.. రెండేళ్లు కూడా కాకముందే దిగిపో దిగిపో అంటున్నారని మండిపడ్డారు. ‘‘దిగిపోవడానికి మీ అయ్య జాగీరు కాదు. నాలుగున్నర కోట్లమంది ప్రజ లు ఆశీర్వదిస్తే కుర్చీలో కూర్చున్నాం. పదేళ్లలో ఏం చేయాలో మాకు తెలుసు. మా మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దు’’ అని సీఎం హెచ్చరించారు.
ప్రాజెక్టులపై చర్చ పెడితే పారిపోయారు..
పదేళ్లలో పాలమూరుకు ఏదో చేశామని పదే పదే చెప్పుకొంటున్న బీఆర్‌ఎస్ నేతలు.. తాను వచ్చాక ప నులు ఆపానంటూ ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టయినా పూర్తిచేశారా? అని ప్రశ్నించారు. వారి హయాంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులెన్నో, పూర్తిచేసిన ప్రాజెక్టులెన్నో చెప్పాలన్నారు. పాలమూరు-రంగారెడ్డికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు తప్ప.. ఉదండాపూర్ నిర్వాసితులకు ఇవ్వలేదన్నారు. పాలమూరుకు చెందిన మాజీ మంత్రులు పొంకనాలు కొడుతున్నారని, మరి పదేళ్లలో ఏ ప్రాజెక్టునూ ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు. అనుమతి లేకుండా ఫాంహౌస్‌కు వెళ్లే ధైర్యం కూడా లేనోళ్లు.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చెత్త ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో దొరలు, భూస్వాముల వద్ద ఉన్న భూములను పేదలకు పంచినట్లుగా.. ప్రస్తుతం పేదలకు పంచేందుకు భూములు లేవని అన్నారు. ఇప్పుడు పంచగలిగిందల్లా విద్యనేనని ఆయన పేర్కొన్నారు.
పాలమూరు అభివృద్ధిని చూపిస్తాను..
తాను ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌ను ప్రాధాన్యంగా తీసుకొని పనిచేస్తున్నానని సీఎం రేవంత్ అన్నా రు. భవిష్యత్తులో పాలమూరు అభివృద్ధిని రోల్ మోడల్‌గా చూపిస్తానని ప్రకటించారు. మెడికల్, ఇంజనీరింగ్, లా కాలేజీలను ఇప్పటికే స్థాపించామని, ట్రిపుల్ ఐటీ క్యాంప్‌సకు శంకుస్థాపన చేశామని చెప్పారు. కేంద్రం, ఎంపీ డీకే అరుణ సహకారంతో రాష్ట్రానికి రాబోయే ఐఐఎంను పాలమూ రు జిల్లాలోనే ఏర్పాటు చేయిస్తానన్నారు. తనది ఇచ్చిపుచ్చుకునే ధోరణి అని, అభివృద్ధి విషయంలో బేషజాలకు వెళ్లనని స్పష్టం చేశారు. మోదీని ప్రధానిగా గౌరవిస్తామని, నిధులు తెచ్చుకుంటామని, ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడతామని అన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాపోటీలకు సంబంధించిన కప్‌ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన బ్రోచర్‌ను వి డుదల చేశారు. అంతకుముందు జడ్చర్ల మండ లం చిట్టబోయినపల్లి రూ.200 కోట్లతో నిర్మించనున్న ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు డీకే అరుణ, డాక్టర్ మల్లురవితోపాటు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Majlis Party president Asaduddin Owaisi: మునిసిపోల్స్‌కు రెడీ: అసదుద్దీన్
Hyderabad Gets General Woman Mayor: జనరల్ మహిళకు హైదరాబాద్!