Share News

సినీ హబ్‌గా హైదరాబాద్‌!

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:56 AM

భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా అని, దానికి అసలైన వేదిక హైదరాబాద్‌’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ అంటే కేవలం ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్‌ బిర్యానీకి మాత్రమే .....

సినీ హబ్‌గా హైదరాబాద్‌!

  • భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా

  • సినీ పరిశ్రమకు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామానాయుడు, కృష్ణలు.. నాలుగు మినార్‌లు!

  • ప్రభాకర్‌రెడ్డి ‘కార్మిక బంధు’గా నిలిచారు

  • ఐటీ, ఫార్మా మాదిరిగా సినీ పరిశ్రమనూ గుర్తించాం

  • అందుకే నిలిచిపోయిన నంది అవార్డులను గద్దర్‌ పేరుతో పునరుద్ధరించాం

  • కథతో హైదరాబాద్‌కు వచ్చి రీల్‌తో వెళ్లొచ్చు

  • సినిమా అంటే రెండువైపులా పదునున్న ఆయుధం

  • దాన్ని సమాజహితానికే ఉపయోగించండి

  • డ్రగ్స్‌పై పోరులో సహకరించండి

  • తెలంగాణ కంటే సురక్షిత ప్రాంతం మరొకటి లేదు

  • గద్దర్‌ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా అని, దానికి అసలైన వేదిక హైదరాబాద్‌’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ అంటే కేవలం ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్‌ బిర్యానీకి మాత్రమే గుర్తింపు కాదని.. జాతీయ స్థాయిలో సినీ పరిశ్రమకు వేదికగా రాణించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులు-2025 ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామానాయుడు, కృష్ణ కలిసి చార్మినార్‌కు ఉన్న 4 మినార్‌ల లాగా కృషి చేశారని చెప్పారు. సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్‌రెడ్డి తన సొంత స్థలాన్ని దానం చేసి, కార్మిక బంధుగా నిలిచారని కొనియాడారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా పెద్దన్నగా నిలబడి, సమస్యలను పరిష్కరించి శాశ్వతంగా సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో నిలదొక్కుకోవడానికి, గుర్తింపు తేవడానికి పెద్దలంతా కృషి చేశారని చెప్పారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినీ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కాగా, ఐటీ, ఫార్మా పరిశ్రమల మాదిరిగానే సినీ పరిశ్రమను కూడా గుర్తించామని.. అందుకే ఆగిపోయిన నంది అవార్డులను గద్దర్‌ పేరుతో తిరిగి ప్రవేశపెట్టామని రేవంత్‌ చెప్పారు.


కొత్త ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాన బాధ్యత అని పేర్కొన్నారు. జపాన్‌, కొరియా సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయంటే అది అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, విధానాల వల్లేనని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నలుపు-తెలుపుతో మొదలైన సినీ ప్రస్థానం నేడు డాల్బీ థియేటర్లను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌ తమ స్టూడియోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ కూడా వచ్చినట్లేనని పునరుద్ఘాటించారు. ఎవరైనా సినిమా నిర్మించాలనుకునే వారు కథతో వచ్చి రీల్స్‌తో వెళ్లేలా హైదరాబాద్‌లో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సినీ రంగానికి ఉపయోగపడే పరిశ్రమలను ఏకగవాక్ష విధానం ద్వారా తమ ప్రభుత్వం అనుమతులిస్తోందన్నారు.

గద్దర్‌ అంటేనే ఒక చైతన్యం..

‘‘గద్దర్‌ అంటే ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి. తన పాటతో వేలాది మందిలో చైతన్యం తీసుకొచ్చిన ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సినిమా అనేది ప్రభావవంతమైన, శక్తిమంతమైన ఆయుధమని అన్నారు. అలాగే సినిమా అనేది రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటిదని, దీన్ని సమాజాన్ని చైతన్యపరిచేందుకు ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని సూచించారు. గద్దర్‌ స్ఫూర్తితో సామాజిక రుగ్మతలను, సమస్యలను రూపుమాపేందుకు సినిమాల ద్వారా సందేశం అందించాలని కోరారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలను మన సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌తో అణచివేసిందని.. ఆ సమయంలోనే తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహించామని గుర్తుచేశారు. ఏ ప్రాంతంలో ఏం జరిగినా తెలంగాణలో మాత్రం కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణను మించిన సురక్షితమైన ప్రాంతం మరొకటి ఉండదని చెప్పారు. అందుకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు ఇస్తున్నామన్నారు.

6.jpg


డ్రగ్స్‌పై యుద్ధంలో ముందుండాలి..

‘‘డ్రగ్స్‌ మహమ్మారి వల్ల ఒక తరం నాశనమైపోతోంది. దీనికి వ్యతిరేకంగా పోరాడడంలో సినీ పరిశ్రమ ముందుండాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. థియేటర్లలో డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహనా వీడియోలు ప్రదర్శించాలని నిర్మాతలకు సూచించారు. డ్రగ్స్‌ సరఫరా చేసే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమకు హామీలు..

తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ‘విజన్‌ 2047’లో సినీ రంగాన్ని ప్రత్యేక అధ్యాయంగా చేరుస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సినీ పరిశ్రమకు పలు హామీలు ఇచ్చారు.

  • షూటింగ్‌ అనుమతుల కోసం వేగవంతమైన ఏకగవాక్ష విధానం అమలు.

  • చిన్న సినిమాలకు థియేటర్ల లభ్యత, పన్ను మినహాయింపులు, పరిశ్రమల తరహాలో విద్యుత్తు రాయితీలు.

  • సినీ కార్మికులకు హెల్త్‌ కార్డులు, ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్పష్టమైన విధానం.

  • హైదరాబాద్‌ చుట్టుపక్కల అంతర్జాతీయ స్థాయి స్టూడియోల ఏర్పాటుకు భూముల కేటాయింపు.

7.jpg


తెలంగాణ ఆత్మను ప్రపంచానికి వ్యాప్తి చేసిన వ్యక్తి గద్దర్‌: భట్టి

గద్దర్‌ ఒక వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా తన ఆట, పాటలతో తెలంగాణ ఆత్మను ప్రపంచానికి తెలియజెప్పారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అందుకే ఆయన పేరుమీదుగా తమ ప్రభుత్వం ఫిలిం అవార్డులను అందిస్తోందని తెలిపారు. తెలుగు సినిమా కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా.. దేశానికే తలమానికంగా ఎదగాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఈ అవార్డులను ప్రవేశపెట్టారని కొనియాడారు. తెలుగు సినిమాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, దక్షిణ భారత రాష్ట్రాలకు, బాలివుడ్‌తో పాటు, హాలివుడ్‌ స్థాయికి ఎదిగిన తీరును మనమంతా చూస్తున్నామని ప్రశంసించారు. సినిమా అంటే కేవలం కళల కోసమే కాదు, ప్రజల కోసం అని చాటిన అనేక తెలుగు సినిమాలను చూశామన్నారు. సత్యహరిశ్చంద్ర, కన్యాశుల్కం, రోజులు మారాయి, మరో ప్రపంచం, కాలం మారింది, దానవీర శూరకర్ణ లాంటి అనేక చిత్రాలు సందేశాన్నివ్వడమేకాక, సమాజ మార్పు కోసం కృషి చేశాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సందేశాత్మక చిత్రాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, పారదర్శకంగా విజేతలను ఎంపిక చేసిన చైర్మన్‌ దిల్‌రాజుకు మంత్రి భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.

2.jpg

Updated Date - Mar 20 , 2026 | 06:27 AM