Share News

సు‘జలం’.. సు‘ఫలం’

ABN , Publish Date - May 21 , 2026 | 03:20 AM

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్న గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సమ్మక్క సాగర్‌ నుంచి నాగార్జున సాగర్‌ దాకా కాగా.. రెండోది పోలవరం నుంచి చేపట్టేది...

సు‘జలం’.. సు‘ఫలం’

  • జల జగ డాలకు చెక్‌ పెట్టేలా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఫార్ములా

  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్‌, గోదావరి-కావేరి అనుసంధానానికి తెలంగాణ ఓకే

  • కేంద్రం ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం!.. రెండు భాగాలుగా గోదావరి-కావేరి అనుసంధానం

  • రెండు ప్రాజెక్టులకూ నికర జలాలు, కేంద్రం నిధులు

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్న గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సమ్మక్క సాగర్‌ నుంచి నాగార్జున సాగర్‌ దాకా కాగా.. రెండోది పోలవరం నుంచి చేపట్టేది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు కీలక అడుగులు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. 88 టీఎంసీలతో తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకారం తెలపాలి. దానికి బదులుగా 167 టీఎంసీలతో పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలియజేయాలని కేంద్రం షరతు పెట్టింది. ఇందుకు రెండు రాష్ట్రాలూ సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇవి కార్యరూపం దాల్చితే తెలుగు రాష్ట్రాలకు జల వివాదాల విషయంలో శాశ్వతంగా మేలు జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) వద్ద పెండింగ్‌లో ఉంది. 90 టీఎంసీలతో డీపీఆర్‌ సమర్పించగా.. నీటి కేటాయింపులపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ 90 టీఎంసీల్లో 45 టీఎంసీలు పోలవరం నుంచి వచ్చే వాటా కాగా.. మరో 45 టీఎంసీలు తెలంగాణలో మైనర్‌ ఇరిగేషన్‌లో చేసిన పొదుపు ఖాతాలోనివి. ఈ పథకానికి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ ఇటీవలే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి.. జలవివాదాల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ విజ్ఞప్తితోనే పాలమూరు-రంగారెడ్డికి ఆమోదం తెలుపాలని ఏపీ సీఎం చంద్రబాబును సీఆర్‌ పాటిల్‌ ప్రత్యేకంగా కోరారు. పాలమూరుకు ఆమోదం తెలుపడానికి చంద్రబాబు అంగీకారం వ్యక్తం చేశారని.. అదే సమయంలో పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలిపేలా చూడాలని ఆయన కోరారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీలు వాడుకోవాలని బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఉంది.


ఆ తీర్పు మేరకు దక్కే 45 టీఎంసీలతో పాటు గోదావరి-కావేరి అనుసంధానంలో తెలంగాణకు వాటాగా ఇవ్వదలుచుకున్న 43 టీఎంసీలు కలుపుకొని 88 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ ఆమోదం తెలపాలి. అలాగే, సమ్మక్కసాగర్‌లో తెలంగాణ తన వాటా 47 టీఎంసీలు వదులుకోవాలి. గోదావరి-కావేరీ అనుసంధానంలో ఏపీ వాటాగా లభించే 45 టీఎంసీలు, కర్ణాటక వాటా 16 టీఎంసీలు(దీనికి బదులుగా బెడ్తి- హీరేవడ్డెటి లింక్‌ కింద 16టీఎంసీలు కర్ణాటకకు ఇవ్వడం), గోదావరిలో ఏ రాష్ట్రమూ వినియోగించుకొని వాటా కింద 15 టీఎంసీలు, జీసీ లింక్‌లో తమిళనాడు వాటా 44 టీఎంసీలు కలుపుకొని 167 టీఎంసీలతో పోలవరం నుంచి గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టడానికి తెలంగాణ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలి.

రెండు కీలక భేటీలు

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏప్రిల్‌ మూడోవారంలో, ఈ నెల తొలివారంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు అధ్యక్షతన న్యూఢిల్లీలో కీలక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా హాజరయ్యారు. కేంద్రం ప్రతిపాదనలపై ప్రాథమిక అంగీకారం కుదిరిందని.. మలిదశలో అపెక్స్‌ కౌన్సిల్‌లో ఒప్పందం జరిగే అవకాశాలు లేకపోలేదని సమాచారం.

నదుల అనుసంధానంతో...

నీటి లభ్యత ఉన్నచోటి నుంచి జలాలు తీసుకెళ్లి కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో 1980లో నేషనల్‌ పర్‌ స్పెక్టివ్‌ ప్లాన్‌లో భాగంగా హిమాయలన్‌ కాంపోనెంట్‌ నుంచి పెనిన్సులర్‌ కాంపోనెంట్‌కు నీటిని తరలించే ప్రతిపాదన వచ్చింది. ఇదే క్రమంలో మహానది(ఒడిశా)-గోదావరి అనుసంధానం కూడా తెరమీదికి తెచ్చారు. ఈ పథకంలో కాటన్‌ బ్యారేజీ(ధవళేశ్వరం) ఎగువన 230 టీఎంసీలు తెచ్చి వేయాలనేది ప్రతిపాదన. ఇదే క్రమంలో గోదావరిలో 500 టీఎంసీల మిగులు జలాలకు సంబంధించి.. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్‌తో పాటు మరో నాలుగు అనుసంధాన ప్రతిపాదనలు తెరమీదికి వచ్చాయి. 2014లో రాష్ట్ర అవతవరణ అనంతరం తెలుగు రాష్ట్రాలు గోదావరిలో ఒక్క చుక్కకూడా మిగులు జలాలు లేవని వాదించడంతో ఈ ప్రతిపాదనలన్నీ పక్కనపెట్టారు. ఆ తర్వాత గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌ మరో 50 ఏళ్లయినా వాడుకోని వాటా(148 టీఎంసీల)తో గోదావరి-కావేరీ అనుసంధానం తొలిదశను ప్రతిపాదించారు. దీనికి ఏపీ తప్ప అన్ని రాష్ట్రాలూ సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఇచ్చంపల్లికి బదులుగా పోలవరం నుంచే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలని ఏపీ బలంగా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.


అంతేకాక.. తాజాగా పోలవరం-బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ ప్రాజెక్టును ఏపీ తెరమీదికి తెచ్చింది. దీనికి కొనసాగింపుగానే గోదావరి-కావేరీ అనుసంధానాన్ని రెండు భాగాలుగా ప్రతిపాదించారు. ఒకటి.. సమ్మక్కసాగర్‌(తుపాకులగూడెం) నుంచి సాగర్‌ దాకా 43 టీఎంసీల తరలింపు. ఈ 43 టీఎంసీలూ సాగర్‌ ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి పాలమూరు-రంగారెడ్డిలో వాడుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు. రెండోది పోలవరం నుంచి చేపట్టే గోదావరి-కావేరి అనుసంధానం. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరుజిల్లాలోని బొల్లాపల్లిలో రిజర్వాయర్‌ నిర్మించి, అక్కడి నుంచి టన్నెల్స్‌ తవ్వడం ద్వారా నీటిని తీసుకెళ్లి.. బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌లో వేయనున్నారు. ఆ తర్వాత నీటిని సోమశిలకు తరలించి, అక్కడి నుంచి కావేరి గ్రాండ్‌ ఆనికట్‌కు తమిళనాడు వాటా కింద 44 టీఎంసీలు ఇవ్వనున్నారు.

శ్రీశైలంపై తగ్గనున్న భారం

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రాయలసీమతో పాటు చెన్నైకి తాగునీటిని అందించడానికి శ్రీశైలం నుంచే నీటిని తరలిస్తోంది. దీనిపై ఏటా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు, ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. అయితే, పోలవరం నుంచి చేపట్టే గోదావరి-కావేరి అనుసంధానంలో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు అత్యధికంగా నీటిని కేటాయించనున్నారు. దాంతో శ్రీశైలంపై భారం క్రమంగా తగ్గి.. ఆ జలాలు అత్యధికం పాలమూరు-రంగారెడ్డితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల అవసరాలు తీర్చుతాయని కేంద్రం యోచిస్తోంది.


నికర జలాలే..

పోలవరం నుంచి వరద జలాల ఆధారంగా గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టాలని గత కొంతకాలంగా ఏపీ పట్టుబడుతున్న విషయం విదితమే. తాజా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధానంలో తరలించే ప్రాజెక్టులను నికర జలాలతోనే చేపట్టనున్నారు. అదే జరిగితే రెండు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఆమోదం లభించడమే కాకుండా కేంద్ర నిధులు కూడా విడుదల కానున్నాయి.

దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం..

పాలమూరు-రంగారెడ్డి హెడ్‌వర్క్‌లు ఇప్పటికే పూర్తికాగా.. జలాశయాల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తికావస్తోంది. నీటి లభ్యత లేని కారణంగా ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపడుతున్నారు. తొలిదశలో 7.5 టీఎంసీలతో 1226 గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చడం, రెండో దశలో 12.3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం దీని లక్ష్యాలు. అయితే వివిధ కారణాలతో పాటు నిధుల లభ్యత లేక నిరాశజనకంగా సాగుతున్న ఈ ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. ఈ పథకానికి నీటి కేటాయింపుల కోసం జస్టిస్‌ బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌లో కూడా తెలంగాణ వాదనలు వినిపిస్తోంది. కేంద్రం ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ట్రైబ్యునల్‌ బయటే నీటి కేటాయింపులకు పరిష్కారం దొరుకుతుంది. పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది.

Updated Date - May 21 , 2026 | 03:20 AM