BRS: రాజేంద్రనగర్‌ను మూడు ముక్కలు చేయొద్దు..
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:16 AM
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మొత్తం మూడు ముక్కలుగా చేయడంపై భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వం తమ స్వార్ధ ప్రయోజనాలకోసం మూడు ముక్కలు చేస్తోందన్నారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేస్తూ కొంతభాగాన్ని హైదరాబాద్ జిల్లాలో, మరి కొంత భాగాన్ని సైబరాబాద్ ప్రాంతంలో కలపాలని చూస్తున్నారని, అలా కాకుండా రాజేంద్రనగర్(Rajendranagar) నియోజకవర్గాన్ని మొత్తంగా సైబరాబాద్ పరిధిలోనే ఉంచాలని బీఆర్‌ఎస్(BRS) రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన శివరాంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజేంద్రనగర్ నియోజకవర్గాన్నిసైతం హైదరాబాద్ జిల్లాలో కాకుండా రంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలన్నారు.
అందుకోసం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ పోరాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి నడుస్తున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ జిల్లాలో, గ్రేటర్ హైదరాబాద్‌లో కలుపుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. గ్రేటర్ విషయానికి వస్తే రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జోన్లను, సర్కిళ్లను, డివిజన్లను సైబరాబాద్ పరిధిలోనే ఉంచాలన్నారు. పోలీస్ డివిజన్లను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోనే ఉంచాలన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని సైతం రంగారెడ్డి జిల్లాలోనే ఉండేటట్లు చూడాలన్నారు. అలా కాకుండా హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని కలుపుతామంటే ఊరుకోమని, అన్ని పార్టీలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. జీహెచ్‌ఎంసీ విస్తరించి ఏర్పాటు చేసిన 300 డివిజన్లను ఇష్టానుసారంగా చేశారని, వాటిలో ఎలాంటి నిబంధనలను పాటించలేదన్నారు. అత్తాపూర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మైలార్‌దేవుప ల్లి డివిజన్‌లో మైలార్‌దేవుపల్లి బస్తీ లేదని, కాటేదాన్ డివిజన్‌లో కాటేదాన్ ప్రాంతం లేదన్నారు. మైసూర్ పాక్‌లో మైసూర్ లేనట్లు ఇక్కడి డివిజన్లు ఉన్నాయన్నారు.

నూతనం గా ఏర్పాటు చేసిన డివిజన్లు ఇష్టానుసారం గా ఉన్నాయన్నారు. రాజేంద్రనగర్, శంషాబా ద్ జోన్లను హైదరాబాద్ పరిధిలోకి తీసుకురావడంవల్ల ఈ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ తప్ప వేరే పార్టీలు మేయర్ పదవిని చేజిక్కించుకోలేవన్నారు. పన్ను లు కట్టేది రాజేంద్రనగర్ నియోజకవర్గ వాసులు అయితే నిధులు మా త్రం హైదరాబాద్‌లో ఖర్చు చేసే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోనే ఉండాలన్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మంజూరైన మెట్రోను రద్దు చేశారని ఆరోపించారు. వీటన్నింటి కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేస్తుందన్నారు.
కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్యమంత్రితో మాట్లాడి రాజేంద్రనగర్ ఉనికిని కాపాడటానికి ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి, మైలార్‌దేవుపల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్.వెంకటేశ్, నాయకులు కొత్త రాజశేఖర్‌రెడ్డి, సదాల వెంకట్‌రెడ్డి, పి.జీవన్ దాస్, గుమ్మడి కుమార్, బద్దం శ్రీకాంత్‌రెడ్డి, నోముల రాము యాదవ్, నయీమ్, జహీరుద్దీన్, ఎడ్లకాడి సూర్యం, వీర్లపల్లి నవీన్, లక్ష్మీరాజ్, సరిత, పి.మనోహర్, సరికొండ దుర్గేశ్, చిరంజీవి, పుంజాల సాయి గౌడ్, ఎస్.అశోక్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు
Read Latest Telangana News and National News