Share News

ఎమ్మెల్సీలంతా పార్టీలైన్‌కు కట్టుబడాలి: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

ABN , Publish Date - Sep 08 , 2026 | 08:15 AM

శాసనమండలి సమావేశాల వేళ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్సీలకు మూడు లైన్ల విప్ జారీ చేస్తూ.. సభకు తప్పనిసరిగా హాజరై, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

ఎమ్మెల్సీలంతా పార్టీలైన్‌కు కట్టుబడాలి: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Deshapathi Srinivas

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ శాసనమండలి సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్సీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. పార్టీ విప్ దేశపతి శ్రీనివాస్ పేరుతో ఈ మేరకు లేఖ విడుదలైంది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే శాసనమండలి సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని విప్‌లో స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడే వరకు రోజంతా మండలిలోనే ఉండాలని ఆదేశించారు. అలాగే సభలో జరిగే చర్చల్లో సభ్యులందరూ పార్టీ ఆదేశాలకు.. నిర్ణయాలకు అనుగుణంగా పాల్గొనాలని సూచించారు. ఏ అంశంపై చర్చ జరిగినా పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీలకు ముందుగానే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ.. సభా వ్యవహారాల్లో పార్టీ నిర్ణయాన్ని పక్కాగా పాటించాలని సూచించింది.


ఇక శాసనమండలిలో జరిగే ఏ బిల్లు.. తీర్మానం లేదా ఓటింగ్‌లోనైనా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలందరూ పార్టీ వైఖరికి అనుకూలంగా ఓటు వేయాలని మూడు లైన్ల విప్‌లో స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించడానికి ఎలాంటి అవకాశం లేదని బీఆర్ఎస్ తేల్చిచెప్పింది. విప్‌ను పాటించడంలో ఏ సభ్యుడైనా విఫలమైతే.. దాన్ని పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామని హెచ్చరించింది.

అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని ఫిరాయింపుల నిరోధక చట్టం.. అలాగే శాసనమండలి నియమ నిబంధనల ప్రకారం సంబంధిత సభ్యుడిపై అనర్హత వేటు వేసే ప్రక్రియను ప్రారంభిస్తామని విప్‌లో పేర్కొన్నారు. దీంతో శాసనమండలి సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సభలో కీలక బిల్లులు, తీర్మానాలు, ఓటింగ్ అంశాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ జారీ చేసిన ఈ మూడు లైన్ల విప్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ పోలీస్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 11:37 AM