మా పార్టీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు: హరీశ్ రావు
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:59 PM
ప్రశ్నించిన వాళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ రోజు(ఆదివారం)యాదాద్రిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
యాదాద్రి, సెప్టెంబర్ 20: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు యాదాద్రి జిల్లాలోని మోటకొండూరులో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.
‘కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికీ లాభం చేకూరలేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఆపేశారు. రైతులు కరెంట్ కోసం గోస పడుతున్నారు. రుణమాఫీ కానోళ్లు సగానికి సగం మంది ఉన్నారు. యూరియా కోసం రైతులకు బాధలు తప్పటం లేదు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క కాల్వ కూడా తవ్వలేదు. కాంగ్రెస్ హయాంలో ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లు అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఎల్‌నినో కంటే రేవంత్ రెడ్డి డేంజర్ అయ్యాడు. తెలంగాణ ఎంపీలు నీటికోసం కేంద్రంలో యాత్ర చేయాల్సింది పోయి.. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ’అంటూ హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజలందరూ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టిందని.. దానిపై పోరాటం చేస్తున్నందుకు కక్ష కట్టి తమని టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే వస్తుందని.. అప్పుడు ఎవరినీ వదిలిపెట్టమని హరీశ్ రావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి సజీవ దహనం..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్