Share News

బొల్లారం చిన్నారి హత్య కేసులో కీలక మలుపు.. సెక్యూరిటీ పాత్రపై అనుమానాలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:41 PM

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ బొల్లారంలో చిన్నారి అరేలియా కిడ్నాప్‌.. హత్య కేసులో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

బొల్లారం చిన్నారి హత్య కేసులో కీలక మలుపు.. సెక్యూరిటీ పాత్రపై అనుమానాలు
Bollaram Child Case

హైదరాబాద్, అక్టోబర్ 11: నగరంలోని సికింద్రాబాద్‌ బొల్లారంలో చిన్నారి అరేలియా కిడ్నాప్‌.. హత్య కేసులో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్‌ చిన్నారిని కిడ్నాప్‌ చేసి.. ఆమె ద్వారా డబ్బులు డిమాండ్‌ చేయాలని పథకం వేసినట్లు తెలుస్తోంది.

వారం క్రితమే విక్రమ్‌ ప్రవర్తన సరిగా లేదనే కారణంతో విల్లాస్‌ అసోసియేషన్‌ అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ క్రమంలో కక్ష పెంచుకున్న విక్రమ్‌ పక్కా ప్రణాళికతో చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. పాపను కిడ్నాప్‌ చేసే సమయంలో విల్లా కమ్యూనిటీలో బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా.. చిన్నారి అరుపులు వినిపించకుండా ఎలక్ట్రిషియన్‌ స్పీకర్‌ సౌండ్‌ పెంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. విక్రమ్‌కు మరో సెక్యూరిటీ గార్డు కూడా సహకరించినట్లు సమాచారం. కిడ్నాప్‌ అనంతరం చిన్నారి తండ్రికి సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌ నుంచి విక్రమ్‌ కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్‌ను మరో సెక్యూరిటీ సిబ్బంది వద్ద గుర్తించిన విల్లాస్‌ యజమానులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది.


గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం..

చిన్నారిని బయటకు తీసుకెళ్లలేకపోయిన విక్రమ్‌.. పోలీసులు వస్తారనే భయంతో ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని నీటి సంపులో పడేసినట్లు సమాచారం. చిన్నారి మెడకు తాడు చుట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో విక్రమ్‌కు సహకరించిన మరో సెక్యూరిటీ గార్డు.. ఎలక్ట్రిషియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు విక్రమ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు.. చిన్నారి మృతదేహానికి గాంధీ ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. చిన్నారి కిడ్నాప్‌, హత్యకు సంబంధించి నిందితుల పాత్ర, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...

అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 04:23 PM