ఒంటరి పోరుకే సై?
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:22 AM
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఒంటరిగా పోటీ చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీ సంస్థాగత కార్యాచరణ ....
రాష్ట్రంలో అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ కార్యాచరణ
క్షేత్రస్థాయి పోరు ముమ్మరం చేయాలని నిర్ణయం.. రంగంలోకి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్
అగ్రనేతల విస్తృత పర్యటనలు.. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లపై ప్రత్యేక నజర్
అన్నింటినీ గెలుచుకునేందుకు వ్యూహం.. కోవర్టు రాజకీయాలపై అగ్రనాయకత్వం సీరియ్‌స
ఆ నేతలకు పార్టీ అధ్యక్షుడు నబీన్ హెచ్చరిక!
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఒంటరిగా పోటీ చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీ సంస్థాగత కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. అంతర్గత కార్యాచరణకు శ్రీకారం చుట్టారని తెలిపాయి. సంస్థాగత బలోపేతంతోపాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలను పార్టీ ముమ్మరం చేయనుందని, ప్రజాప్రతినిధులకు టైం టేబుల్ కూడా సిద్ధమవుతోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ‘ఈ రోజు తేదీ గుర్తు పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక ఈ తేదీని గుర్తుచేసుకోవాలి. అధికారంలోకి రావడమే మన టార్గెట్’ అని నితిన్ నబీన్.. పార్టీ ముఖ్యనేతల సమావేశంలో స్పష్టం చేశారని పేర్కొన్నాయి. దీంతోపాటు పార్టీ ప్రజాప్రతినిధులు ఏయే కార్యక్రమాలు చేయాలో కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలిపాయి. ‘బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు’ అంటూ తమ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఒట్టి మాటేనని పార్టీ ముఖ్యనేతలు అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ రోజురోజుకీ బలపడుతోందని వారు పేర్కొంటున్నారు. అయితే చివరి ఆరు నెలల్లో ఏమవుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని మరికొందరు నేతలు అంటున్నారు. కర్ణాటకలో జరిగే ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ‘అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతే.. తెలంగాణలో ఒంటరిగా వెళ్లడం పక్కా. లేనిపక్షంలో అప్పటి పరిస్థితులను బట్టి పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని బీజేపీ మరో కీలక నేత ఒకరు చెప్పారు. కర్ణాటకలో 2023 మే నెలలో.. అంటే మన రాష్ట్రంలో కంటే ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం 2028 మే లోగా అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
బన్సల్ ఇక పూర్తిస్థాయి పర్యవేక్షణ...
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జిగా కొనసాగుతున్న సునీల్ బన్సల్ ఇక పూర్తిస్థాయిలో తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారని పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. ‘‘ బన్సల్ తెలంగాణతోపాటు బెంగాల్, ఒడిసాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఇక తెలంగాణకు పూర్తి సమయం కేటాయించబోతున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జిగా కొనసాగుతున్న అభయ్ పాటిల్‌కు పార్టీ జాతీయ నాయకత్వం కార్యక్రమాల పర్యవేక్షణకు సంబంధించి మరో కీలక బాధ్యత అప్పగించింది’’ అని ఆ నేత వివరించారు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రోజువారీ కార్యక్రమాలపై ఢిల్లీకి ఎప్పటికప్పుడు నివేదికలు వెళుతున్నాయని మరో ముఖ్యనేత పేర్కొన్నారు. పార్టీలో సాగుతున్న కోవర్టు రాజకీయాలపై అధినాయకత్వం వద్ద సమగ్ర సమాచారం ఉందన్నారు. ‘‘ముఖ్యంగా ఇటీవలి మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుసరించిన వైఖరి పట్ల అగ్రనాయకత్వం సీరియ్‌సగా ఉంది. అందుకే.. నితిన్ నబీన్ పరోక్షంగా సదరు నేతలకు వార్నింగ్ ఇచ్చారు’’ అని ఆ నేత తెలిపారు.

నాలుగు కార్పొరేషన్‌లపై ప్రత్యేక నజర్..
వచ్చే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే.. అందుకు ముందుగా ఎన్నికలు జరిగే నాలుగు మునిసిపల్ కార్పొరేషన్‌లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్, వరంగల్ మునిపల్ కార్పొరేషన్‌ల ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ నాయకత్వం.. మహారాష్ట్ర మంత్రి ఆశిశ్, రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మకు అప్పగించింది. ‘‘జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లలో మెజారిటీ డివిజన్లు మా పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల (సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మెదక్) పరిధిలో ఉన్నాయి. ఇక వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ బాధ్యతను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కి అప్పగించే అవకాశం ఉంది. ఇటీవలి మునిసిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌ను పార్టీ తొలిసారిగా గెలుచుకున్న నేపథ్యంలో.. సంజయ్‌కి వరంగల్ బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదన ఉంది. మరోవైపు గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విస్తృత ప్రచారం చేసి అనూహ్య ఫలితాలు సాధించడంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు. సంజయ్ స్పీచ్‌లు, ప్రచార తీరుతో క్యాడర్‌లో సైతం జోష్ వచ్చింది. వివిధ సామాజికవర్గాలను ఆకర్షించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో పూర్వపు జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా సంజయ్‌ని ప్రచారంలోకి దింపాలన్న ప్రతిపాదన ఉంది’’ అని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఈ నాలుగు కార్పొరేషన్‌లలో ప్రచార వ్యూహంపై పార్టీ నాయకత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతోందన్నారు.
రోడ్‌మ్యాప్ మరింత సులువయ్యేలా..
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 111 స్థానాలకు పోటీచేసి 8 చోట్ల మాత్రమే విజయం సాధించిన బీజేపీ.. ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 50 శాతం సీట్లు (8 ఎంపీ స్థానాలు) కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిని కైవసం చేసుకుని ఓటు బ్యాంకు పెంచుకుంది. ఆపై ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో గట్టి పట్టు సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాలుగు మునిసిపల్ కార్పొరేషన్‌లను సైతం కైవసం చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రోడ్‌మ్యాప్ మరింత సులువు చేసుకునే దిశగా కార్యాచరణ సిద్ధమవుతోందని పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ అగ్రనేతల విస్తృత పర్యటనలు ఉండబోతున్నాయని అన్నారు. ‘‘రెండు నెలల వ్యవధిలో ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ఇకముందు కూడా కొనసాగుతాయి. కేంద్ర మంత్రులు, పార్టీ సంస్థాగత ముఖ్యుల పర్యటనలు మరిన్ని ఉండబోతున్నాయి’’ అని ఆయన చెప్పారు.