Share News

బండి భగీరథ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. మధ్యంతర బెయిల్‌పై రేపు నిర్ణయం!

ABN , Publish Date - May 14 , 2026 | 05:50 PM

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ సుదీర్ఘ విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్‌పై నిర్ణయాన్ని రేపటికి, ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వారం రోజుల పాటు కోర్టు వాయిదా వేసింది.

బండి భగీరథ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. మధ్యంతర బెయిల్‌పై రేపు నిర్ణయం!
Telangana High Court Hears Bandi Bhagirath Bail Plea

హైదరాబాద్, మే 14: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ (గురువారం) సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, మధ్యంతర బెయిల్‌పై నిర్ణయాన్ని రేపటికి (శుక్రవారం) వాయిదా వేయగా, ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.

కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) వాదనలు:

విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీలక అంశాలను లేవనెత్తారు. కరీంనగర్‌లో బాధితురాలిపై తప్పుడు కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. బాధితురాలి తల్లి పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో, కరీంనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారని వివరించారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో ఈ కేసులో సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పీపీ వాదించారు. అయితే, దీనిపై స్పందించిన హైకోర్టు.. 'ప్రతిసారీ నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానించింది.


డిఫెన్స్ తరఫు న్యాయవాది కృష్ణకాంత్ వాదనలు:

భగీరథ్‌ తరఫున అడ్వకేట్ కృష్ణకాంత్ తన వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో భగీరథ్‌పై 'పోక్సో' (POCSO) చట్టం వర్తించదని, ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. యువతి మైనర్ అనే నెపంతో విచారణకు వెళ్లే సమయంలో భగీరథ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.

'బండి సంజయ్ కుమారుడు కావడంతోనే నిరాధారంగా పోక్సో చట్టాన్ని ప్రయోగించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ పొలిటికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. నిందితుడిని సామాన్యుడిలాగే పరిగణించి న్యాయం చేయాలి' అని ఆయన కోరారు. ఇక, తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని బాధితురాలి తరఫు న్యాయవాది కోరడంతో, కోర్టు రేపు మధ్యంతర బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

కాగా, ముందస్తు బెయిల్ రావడానికి వారం సమయం పట్టేలా ఉండటంతో, ఆ వారం లోపు అరెస్టు కాకుండా ఉండేందుకు బండి భగీరథ్ న్యాయవాది మధ్యంతర బెయిల్ కోరారు. దీనిపై రేపు కోర్టు ఇచ్చే ఆదేశాలు బండి భగీరథ్‌కు కీలకం కానున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 06:19 PM